లాలూ.. మళ్లీ ఇబ్బందుల పాలు

Update: 2022-05-20 07:30 GMT
బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జేడీ) అధ్యక్షుడు లాలూప్రసాద్‌ యాదవ్‌ను కష్టాలు వీడటం లేదు. ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పశు దాణా కుంభకోణానికి పాల్పడ్డారని ఆధారాలు లభించడంతో జైలుపాలయ్యారు. సీబీఐ ప్రత్యే కోర్టు ఈ కేసులో లాలూకు ఐదేళ్ల జైలుశిక్ష, 60 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ ఈ ఫిబ్రవరిలో తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఎప్పటి నుంచో జైలులో ఉన్న లాలూకు ఆరోగ్యం బాగోకపోవడంతో జార్ఖండ్‌ హైకోర్టు ఇటీవల బెయిల్‌ మంజూరు చేసింది. ప్రస్తుతం బెయిల్‌ మీద బయట ఉన్నారు.. లాలూప్రసాద్‌ యాదవ్‌.

ఇంతలోనే ఊపిరి తీసుకునే వ్యవధి కూడా లేకుండా, పులి మీద పుట్రలా మే 20న మళ్లీ సీబీఐ అధికారులు దాడులు చేశారు. బిహార్‌ రాజధాని పాట్నాలోని లాలూ నివాసంతోపాటు, ఢిల్లీ, లాలూప్రసాద్‌ కుటుంబీకులకు చెందిన పలు ప్రాంతాలపై వరుస సోదాలతో విరుచుకుపడ్డారు.

ఈ దాడులు ఎందుకంటే.. 2004 నుంచి 2009 వరకు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంలో లాలూప్రసాద్‌ యాదవ్‌ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమార్తెలు రైల్వే నియామకాల్లో పలు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని అభియోగం. దీనికి సంబంధించి సీబీఐ లాలూప్రసాద్‌ యాదవ్‌తోపాటు ఆయన కుమార్తెలపై కేసు నమోదు చేసింది.

ఈ నేపథ్యంలోనే లాలూప్రసాద్‌ యాదవ్‌ నివాసంతోపాటు ఆయన కుమార్తెల నివాసాల్లోనూ సీబీఐ అధికారులు సోదాలకు దిగారు. లాలూ, ఆయన సతీమణి రబ్రీదేవి, కుమార్తెలకు చెందిన 17 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు కష్టాలు మొదలయ్యాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గతంలో బిహార్‌ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం లాలూప్రసాద్‌ యాదవ్‌ పరిపాలించారు. బిహార్‌ రోడ్లను బాలీవుడ్‌ నటి హేమ మాలిని బుగ్గల్లా తీర్చిదిద్దుతానని లాలూ ప్రజలను ఆకట్టుకున్నారు. అలాగే సమోసాలో ఆలు (బంగాళా దుంప) ఉన్నంతవరకు బిహార్‌లో లాలూ ఉంటాడని చతురోక్తులు విసరడంలో లాలూ నేర్పరి. భోజ్‌పురి యాసతో లాలూప్రసాద్‌ యాదవ్‌ మాట్లాడే హిందీ భాషకి ఆయనకు ఎంతోమంది అభిమానులున్నారు.

బిహార్‌ ముఖ్యమంత్రిగా చేశాక కేంద్రంలో రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి నష్టాల్లో ఉన్న రైల్వేలను లాభాలు బాట పట్టించిన ఘనతను లాలూ దక్కించుకున్నారు. దీనిపై ఏకంగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లలో పాఠాలే ఉన్నాయంటే లాలూ సామర్థ్యం ఏంటో తెలుస్తుంది. అలాగే రైల్వేలను లాభాల బాట పట్టించడంపై వివిధ ప్రఖ్యాత విద్యా సంస్థల ఆహ్వానాలు అందుకుని లాలూ సెమినార్లలో కూడా ప్రసంగించారు.


అయితే దాణా కుంభకోణం కేసులో ఆయన జైలుకెళ్లడంతో ఆయన సతీమణి రబ్రీ దేవి బిహార్‌ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. లాలూప్రసాద్‌ యాదవ్‌ కుమారులు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్, తేజస్వీ యాదవ్, కుమార్తె మీసా భారతి కూడా రాజకీయాల్లో ఉన్నారు. తేజస్వీ యాదవ్‌ ప్రస్తుతం బిహార్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. దేశంలోనే అతి చిన్న వయసు (32)లో ప్రతిపక్ష నేత అయిన రికార్డును తేజస్వీ యాదవ్‌ సాధించారు. ప్రస్తుతం బిహార్‌లో జనతాదళ్‌ యునెటైడ్‌ (జేడీయూ) – బీజేపీ సంకీర్ణ సర్కారు అధికారంలో ఉంది. నితీష్‌ కుమార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
Tags:    

Similar News