అశోక్ ఓకే...సంచయిత ఏం చేయాలి...?

Update: 2022-04-09 09:32 GMT
విజయనగరం పూసపాటి రాజులకు వందల ఏళ్ళ చరిత్ర ఉంది. ఆధునిక యుగంలోనూ ఆ కుటుంబానికి ఎంతో ప్రతిష్ట ఉంది. అలాంటి రాజ వంశంలో బాబాయ్, అమ్మాయి మధ్యన రాజకీయ చిచ్చు చెలరేగి ఏపీలో విజయనగరం కోటలో కొన్నాళ్ళు భీకర సమరం సాగింది. ఈ అంతపురం పోరాటంలో బాబాయ్ అశోక్ గజపతిరాజు గెలిచారు. ఇపుడు అమ్మాయి సంచయిత ఏం చేయాలి. ఇదే అందరిలో మెదులుతున్న ప్రశ్న.

సంచయిత అలా వచ్చి ఇలా  మెరుపులా మాయమయ్యారు. ఆమె వయసు చిన్నది, ఆమె రాజకీయం ఇంకా పదును తేరుతుందని, అశోక్ కి అసలైన ప్రత్యర్ధిగా అవతరించి విజయనగరం కోటలో పాగా వేస్తుందని తలచిన వారికి నిరాశ తప్పలేదు. ఆమెను ముందు పెట్టి చేసిన రాజకీయం వికటించడంతో పెద్దలు సర్దుకున్నారు. దాంతో ఒక వైపు కధ సుఖాంతం అయింది. మరి రెండవ వైపు సంగతి ఏంటి. ఇదొక పెద్ద డౌట్.

విషయానికి వస్తే సంచయిత అశోక్ అన్న ఆనందగజపతిరాజు కుమార్తె. ఆమెను హఠాత్తుగా తీసుకువచ్చి 2020 మార్చిలో అటు మాన్సాస్ సంస్థలకు, ఇటు  సింహాచలం , రామతీర్ధం దేవాలయాలకు చైర్ పర్సన్ గా చేశారు. వైసీపీ సర్కార్ ఎత్తుగడలో భాగంగా ఈ రకంగా పావులు కదిపింది.

నాడు ఒక్కసారిగా అతి చిన్న వయసులో చైర్  పర్సన్  అయి సంచయిత సంచలనం రేపారు. బాబాయ్ నే సవాల్ చేశారు. తనకు కూడా మాన్సాస్ చైర్ పర్సన్ అయ్యే హక్కు అర్హత ఉన్నాయని ఆమె వాదించారు. అయితే అశోక్ దీని మీద కోర్టుకు వెళ్లి సింగిల్ బెంచ్ తీర్పుని అనుకూలంగా పొందారు. ఆ తరువాత డివిజన్ బెంచ్ కూడా అదే తీర్పు ఇవ్వడంతో బాబాయ్ మళ్లీ కుర్చీ ఎక్కారు.

ప్రస్తుతం ఆయనే సింహాచలం దేవస్థానం చైర్మన్ గా ఉంటున్నారు. తాజాగా పద్నాలుగు మందితో ప్రభుత్వం పాలకవర్గాన్ని నియమించింది. అయితే చైర్మన్ విషయం మాత్రం వదిలేసింది. నిజంగా వైసీపీకి కనుక అశోక్ తో పోరాడాలని ఉన్నా, తమ మాటే కరెక్ట్ అని ఆలోచించినా సంచయితకు మరో దఫా చాన్స్ ఇచ్చి న్యాయ పోరాటం కొనసాగించేవారు అని అంటారు.

కానీ వైసీపీ పెద్దలు మనసు మార్చుకున్నారు. అశోక్ వైపే న్యాయం ఉండడంతో ఎన్నిసార్లు కోర్టు తలుపులు తట్టినా తీర్పు అలాగే వస్తుంది అని భావించి ఉంటారు. దాంతో చాలా కామ్ గా పాలక వర్గాన్ని మాత్రమే నియమించి ఊరుకున్నారు. ఇక్కడే సంచయిత ప్రస్థావన వస్తోంది. ఆమె వైసీపీ పెద్దలను నమ్ముకుని దూకుడు చేశారు. సొంత కుటుంబం మీద కత్తి దూశారు. ఇపుడు బాబాయ్ కుర్చీలో ఉన్నారు.

ఆమె మాత్రం మాజీ అయ్యారు. వైసీపీ పెద్దలు అవసరం తీరాక‌ పక్కన పెట్టారు అని విమర్శలు వస్తునాయి. దాంతో సంచయిత రూట్ ఎటూ అన్న చర్చ ముందుకు వస్తోంది. అంతా బాగున్న రోజుల్లో సంచయితను తెచ్చి విజయనగరం అసెంబ్లీ సీటు నుంచి పూసపాటి వారికి వ్యతిరేకంగా పోటీ చేయించలాని కూడా వైసీపీ నేతలు  ఆలోచించారు అని అంటారు. కానీ ఇపుడు మాత్రం సీన్ రివర్స్ అయింది.

సంచయితని సైడ్ చేశారు కాబట్టి ఆమెకు వైసీపీలో దారులు మూసుకుపోయాయి. ఇక ఆమె వైసీపీ నేతల మాటలు విని మాన్సాస్ చైర్ పర్సన్ అయ్యారు. అంతకు ముందే ఆమె బీజేపీలో ఉన్నా ఆ పార్టీ ఆమెను దూరం పెట్టింది. ఇపుడు ఆమె బీజేపీలోనే తన రాజకీయ‌ జీవితం కొనసాగించాల్సి రావచ్చు.

తాను తిట్టిపోసిన టీడీపీలోకి ఎటూ వెళ్ళలేరు. పైగా అక్కడ బాబాయ్, ఆయన కుమార్తె అతిధి ఉన్నారు. ఏపీలో బీజేపీకి ఏమీ పెద్దగా లేదు కాబట్టి ఆమె ఇక్కడ నుంచి రాజకీయాలు చేస్తారా. చేసినా ఎంతవరకూ రాణించగలరు అన్నది కూడా ప్రశ్నగా ఉంది మొత్తానికి ఈ పూసపాటి వారి నవతరం వారసురాలి రాజకీయం ఎటూ కాకుండా పోయింది అంటున్నారు. దానికి ఆమె దూకుడే కారణం అని కూడా అంటున్నారు.
Tags:    

Similar News