క్రెడిట్ కార్డు స్కోర్ పెరగాలా.. అయితే ఇలా చేయండి!

Update: 2022-02-04 23:30 GMT
ఈ కాలంలో అప్పు చేయని వారు ఎవరూ ఉండరు! ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలన్నా... లేక భారీ బడ్జెట్ కు సంబంధించిన ఇల్లు, స్థలాలు వంటివి తీసుకోవాలన్నా చాలామంది లోన్లు తీసుకుంటారు. దానిని ఈఎంఐ కింద మార్చుకొని సులభ పద్దతుల్లో చెల్లింపులు చేస్తున్నారు. ఇదిలా ఉంటే దీనికంటే ముందుగా ఓ వ్యక్తికి లోన్ ఇవ్వాలంటే.. అప్పులు ఇచ్చే బ్యాంకులు కానీ, ఇతర ఆర్థిక సంస్థలు అన్నీ ఆ వ్యక్తికి సంబంధించిన క్రెడిట్ హిస్టరీని చూస్తున్నాయి. దీనిలో క్రెడిట్ స్కోర్ మంచిగా ఉంటే రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. లేకపోతే వారికి రుణాలు మంజూరు చేసేందుకు ఆలోచిస్తున్నాయి. ఒక వేళ వారికి రుణాలు ఇచ్చినా సరే వాటిపై ఎక్కువ రుణ రేటును వసూలు చేస్తున్నాయి. ఇంతకీ ఈ క్రెడిట్ స్కోర్ ఏంత ఉంటే మంచిది? క్రెడిట్ స్కోర్ తగ్గకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఓ సారి చూద్దాం.

సాధారణంగా ఓ వ్యక్తికి రుణం రావాలి అంటే క్రెడిట్ స్కోర్ సుమారు 750 దాటి  ఉండాలి. దీని కంటే తక్కువగా ఉంటే బ్యాంకులు, ఇతర రుణ దాతలు అప్పులు ఇచ్చేందుకు ఆలోచిస్తారు. అయితే ఈ 750 అనే మార్కుకు తగ్గకుండా క్రెడిట్ స్కోర్ తీసుకుని రావడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. మనం తీసుకున్న అప్పును నెల వారి సులభ వాయిదాల్లో చెల్లించడం ద్వారా దీనిని ఆ మార్కుకు తగ్గకుండా చూసుకోవచ్చు. కానీ దీనిని ఇలా కొనసాగించడం అంత సులభమేమీ కాదు. కొన్నికొన్ని సార్లు సరైన సమయానికి డబ్బులు చేతికి అందకపోయినా.. మరే ఇతర కారణాల ద్వారా అయినా వాయిదా చెల్లించకపోతే అప్పుడు స్కోరు పడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా స్కోరు 700 కంటే కిందకు పడితే బ్యాంకులు, రుణ దాతలు లోన్ ఇచ్చేందుకు మొగ్గు చూపరు. ఇంకా చెప్పాలి అంటే మనం పెట్టుకున్న దరఖాస్తును చెత్తబుట్టలో పడేస్తారు. దీనికి ప్రధానంగా కొన్ని అంశాలు ప్రభావితం చేస్తాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా ఏ బ్యాంక్ అయిన రుణం ఇస్తే నెలవారి మొత్తాన్ని నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని సూచిస్తోంది. ఇలా కాకుండా వినియోగదారుడు మొదటి నెల వాయిదాని మిస్ చేస్తే రెండో నెలలో కట్టుకోవాల్సి వస్తుంది. అయితే ఇలా ఆ వ్యక్తి మూడు వాయిదాలు కట్టకపోతే దానిని బ్యాంకులు ఎన్పీఏగా మార్కు చేస్తాయి. అసలు పూర్తిగా కట్టకపోతే డీఫాల్ట్ కింద పెట్టేస్తాయి. ఇలా జరిగితే క్రెడిట్ స్కోర్  భారీగా పడిపోతుంది. అందుకే చెల్లింపులు ఎప్పటికప్పుడు చెల్లించాల్సి వస్తుంది. అయితే డీఫాల్ట్ కింద పెట్టిన వ్యక్తి రికార్డును క్లోజ్ చేసేందుకు సంస్థ ప్రయత్నిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఎంతో కొంత మొత్తాన్ని రాబట్టుకోవడం కోసం అయితే ఇది రుణం తీసుకున్న వ్యక్తికి ఇబ్బంది కలుగజేస్తుంది. ఎందుకంటే అనుకున్న మొత్తం కడితే సెటిల్డ్ అని మన రికార్డులో రాస్తారు. ఇది వ్యక్తికి మంచిది కాదు.దీని వల్ల ఇతర సంస్థలు లోన్ ఇవ్వాలంటే ఆలోచిస్తాయి. అందుకే పూర్తిగా కట్టేయాలి.

క్రెడిట్ స్కోర్ పెరగాలి అంటే వాయిదాలను కచ్చితంగా అనుకున్న టైంలోపు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మంచి స్కోర్  ఉంటుంది. లేకపోతే ఒక్క నెల మిస్ అయినా కానీ సుమారు వంద పాయింట్లు కోల్పోవాల్సి వస్తుంది. డబ్బు వాయిదాకు టైం కు అందకపోతే అందిన వరకు అయినా కానీ కట్టేయాలి. అప్పుడు కనీసం స్కోరు పడకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. దీనితో పాటు మీరు ఎక్కువగా అప్పు తీసుకోవడం కోసం అప్లికేషన్లు పెట్టుకోవడం కూడా మీ క్రెడిట్ స్కోర్ ను తగ్గించేందుకు ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే మనం ఎక్కువ అప్లికేషన్ లు పెట్టాము అంటే  రుణం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు లెక్క. ఒక వేళ మన అప్లికేషన్ రిజెక్ట్ అయితే క్రెడిట్ స్కోర్ పడిపోతుంది.

క్రెడిట్ స్కోర్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకోవడం వల్ల స్కోర్ తక్కువ అయిన వెంటనే సంబంధిత సంస్థలను కాంటాక్ట్ అయ్యి దానికి గల కారణాలను తెలుసుకుని సరిదిద్దుకోవచ్చు. కనీసం ఈ పనిని నెలకు ఓ సారి అయినా చేయాలని నిపుణులు చెబుతున్నారు.

పై జాగ్రత్తలను ఫాలో కావడం వల్ల క్రెడిట్ స్కోర్ తగ్గకుండా ఉంటుంది. ఎక్కువ మంది  అవసరానికి రుణాలు ఇచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది.
Tags:    

Similar News