ఆయ‌న్ని పంపిస్తే.. తెలంగాణలో పాల‌న ఆగిపోతుందా?!

Update: 2022-03-30 11:30 GMT
ఏపీకి కేటాయించినా తెలంగాణలో కొనసాగుతున్న సీనియర్‌ ఐఏఎస్‌ సోమేశ్‌కుమార్‌ (తెలంగాణ సీఎస్‌), ఇతర అధికారులను అక్కడికి పంపిస్తే ఇక్కడ పరిపాలన ఏమీ ఆగిపోదని కేంద్ర ప్రభుత్వం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి కేటాయించిన అధికారులు తెలంగాణలో కొనసాగు తుండడంపై కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది.

తెలంగాణ సీఎస్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ సూరేపల్లి నందా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ టి. సూర్యకరణ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. క్యాట్‌ (సెంట్రల్‌ అడ్మినిస్ర్టేటివ్‌ ట్రిబ్యునల్‌) ఆదేశాల అండతో తెలంగాణలో కొనసాగుతున్న అధికారులను ఏపీకి పంపినంత మాత్రాన పరిపాలన ఆగిపోదని పేర్కొన్నారు.

క్యాట్‌లో విచారణ సందర్భంగా కేంద్రం తీసుకున్న వైఖరికి తెలంగాణ ప్రభుత్వం  మద్దతు పలికిందని తెలిపారు. ప్రస్తుతం హైకోర్టులో మాత్రం కేంద్రం వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించడాన్ని తప్పుబట్టారు.

బాగా అనుభవం ఉన్న ఆ అధికారులే కావాలని అనుకుంటే ఇంటర్‌ క్యాడర్‌ బదిలీలు చేసుకోవచ్చని సూచించారు. అంతేకాదు... ఇలా ఒక రాష్ట్రానికి చెందిన కేడ‌ర్‌వారు మ‌రో రాష్ట్రంలో ప‌నిచేయ‌డం స‌రికాద‌ని.. ఇలా ఉండేందుకు నిబంధ‌న‌లు కూడా ఒప్పుకోవ‌ని కేంద్రం తెలిపింది. సీఎస్ ను పంపించినంత మాత్రాన రాష్ట్రంలో ప‌రిపాల‌న‌పై ఎలాంటి ఎఫెక్ట్ ప‌డ‌ద‌ని.. స్ప‌ష్టం చేసింది. ఆయ‌న‌ను త‌క్ష‌ణ‌మే ఏపీకి పంపించి వేయాల‌ని కోరింది.ఈ  వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. సోమేశ్‌ వాదనల కోసం విచారణను ఏప్రిల్‌ 4కు వాయిదా వేసింది. మ‌రి ఎలాంటి తీర్పు వ‌స్తుందో చూడాలి.
Tags:    

Similar News