పాదాభివందనం.. కేసీఆర్ చేతిలో తిరుగులేని ఆయుధం

Update: 2022-03-05 09:37 GMT
తమకు లభించే అతి తక్కువ సమయంలో అవతల వ్యక్తిని ఫిదా చేయటం.. మనసుల్ని గెలుచుకోవటం అంత చిన్న విషయం కాదు. నిజానికి దీనికి మించిన కఠినమైన టాస్కు మరొకటి ఉండదు. అయితే.. ఇలాంటి వాటి విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తుంటారు. జాతీయ స్థాయిలో మోడీకి వ్యతిరేకంగా జట్టు కట్టాలన్న పట్టుదలతో ఉన్న ఆయన.. అందుకు తగ్గట్లే పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లటం.. అక్కడి నుంచి జార్ఖండ్ రాజధాని రాంచీకి వెళ్లి.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ కావటం తెలిసిందే.

తాజాగా తన పర్యటన సందర్భంగా ఆయన ప్రదర్శించిన వినయం.. విధేయత ఇప్పుడు అందరిని ఆకర్షించటమే కాదు.. కేసీఆర్ లోని భిన్న దృక్ఫధాన్ని బయటకు తీసుకొచ్చిందని చెప్పాలి. రాంచీకి వెళ్లిన ఆయన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో భేటీ కావటం తెలిసిందే. దాదాపు గంటన్నర కంటే ఎక్కువ పాటు సాగిన ఈ సమావేశంలో వారు జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుకున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ సమావేశ సందర్భంగానే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్ ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్.. ఆయన కాళ్లకు పాదాభివందనం చేయటమే కాదు.. ఆయన కుమార్తె కవిత సైతం ఆయన కాళ్లకు మొక్కటం ద్వారా.. తమ విధేయతను చాటి చెప్పాలి.
ఇప్పటివరకుచాలామంది ముఖ్యమంత్రులు.. మరో రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవటం మామూలే కానీ.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. మరో రాష్ట్ర ముఖ్యమంత్రి తండ్రికి పాదాభివందం చేయటం అంత సామాన్యమైన విషయం కాదు. అందునా.. తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకతల గురించి తెలిసిందే.

ఆర్థికంగా బలోపేతమైన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి.. తిరుగులేని ప్రజాదరణ ఉన్న  అధినేత.. వేరు రాష్ట్ర ముఖ్యమంత్రి తండ్రి కాళ్లు మొక్కటం చాలా అరుదుగా జరిగే చర్యగా చెప్పాలి. దీనికి సంబంధించిన వీడియో.. ఫోటోలను చూసినప్పుడు ఏదో మొక్కబడిగా అన్నట్లు కాకుండా.. చాలా భక్తిబావాన్ని ప్రదర్శించటం చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. ఒక శక్తివంతమైన అధినేత.. తన స్థాయిని పక్కన పెట్టేసి.. పాదాభివందనం చేయటం చూసినప్పుడు.. ప్రముఖుల మనసుల్ని దోచుకోవటం ఖాయమని చెప్పాలి.

ఇదే ముఖ్యమంత్రి తనను కలవటానికి వచ్చిన వారిని గంటల తరబడి వెయిట్ చేయించటం.. అంతేనా.. కేంద్ర మంత్రులు లాంటి వారు.. ఫోన్లు చేసి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడటానికి  ప్రయత్నించి.. విఫలమైన వైనం చప్పున గుర్తుకు రాక మానదు. ఇదంతా చూసినప్పుడు అయితే పాదాభివందనానికి.. తేడా వస్తే.. కనీసం ఫోన్ కాల్ కు సైతం అందుబాటులోకి రాని కేసీఆర్.. తన చేతిలో ఉన్న తిరుగులేని అస్త్రాన్ని అప్పుడప్పుడు బయటకు తీసి విస్మయానికి గురి చేస్తారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News