సర్వే రిపోర్టు చూసి టైమ్లీగా ఎన్టీఆర్ జయంతిని కేసీఆర్ వాడేశారా?

Update: 2022-05-29 10:01 GMT
సమయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవటంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూటు సపరేటు అన్న సంగతి తెలిసిందే. ఎప్పుడేం చేయాలో చాలా మందికి తెలుసు కానీ.. ఎప్పుడేం చేయకూడదన్నది మాత్రం చాలా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

ఈ విషయంలో కేసీఆర్ ను వంక పెట్టే అవకాశమే ఉండదు. చేతికి వచ్చే అవకాశాన్ని అస్సలు వదులుకోని ఆయన.. ఎప్పటికప్పుడు టైమ్లీగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ కారణంతోనే ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ. ప్రభుత్వం మీద ఆగ్రహం అంతంతమాత్రమే అని చెబుతారు.

విపక్షాలు బలోపేతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవటం.. ఏదైనా అంశం కారణంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందన్నంతనే దాన్ని మరిచిపోయేలా నిర్ణయాల్ని ప్రకటించటం.. కొత్త ఎజెండాను టేకప్ చేయటంలో ఆయన అమితమైన వేగాన్ని ప్రదర్శిస్తుంటారు. శనివారం నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాల్లో ఎప్పుడూ లేని రీతిలో టీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు హాజరు కావటం.. జై తెలంగాణ.. జై కేసీఆర్.. జై ఎన్టీఆర్ అంటూ సరికొత్త నినాదాన్ని అందుకోవటం తెలిసిందే.

ఇదంతా ఎందుకు జరిగింది? గులాబీ ప్రజాప్రతినిధులు ఇంత భారీగా ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాలకు హాజరు కావటం అంటే.. దానికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా జరగదు. అలా ఇచ్చారంటే దానికి ఏదో ఒక బలమైన కారణం ఉందన్న మాట వినిపిస్తోంది. రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్న కొత్త తరహా వాదన ఏమంటే.. ఇటీవల కాలంలో ఏపీలోని జగన్ పాలనపై రహస్యంగా సర్వే నిర్వహించారని.. దానికి సంబంధించిన రిపోర్టు కేసీఆర్ చేతికి అందినట్లు చెబుతున్నారు.

పైకి జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదని చెప్పినా.. గడిచిన మూడేళ్ల ఆయన పాలనలో రాష్ట్రంలోని వివిధ వర్గాలు వైసీపీకి దూరమైన విషయాన్ని గుర్తించినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. డెవలప్ మెంట్ విషయంలో దారుణంగా దెబ్బ పడిన వైనంపై మధ్యతరగతి వర్గాల్లో ఆగ్రహం ఉందంటున్నారు. గతంలో ఏపీకి ఉన్న ఇమేజ్ కు.. తాజాగా ఉన్న ఇమేజ్ తో రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లిందన్న భావన వారిలో ఎక్కువైనట్లుగా చెబుతున్నారు.

 దీనికి తోడు టీడీపీ.. జనసేనలు దగ్గర కానున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి.. వైసీపీ ఒంటరిగా.. టీడీపీ - జనసేనలు పొత్తు పెట్టుకుంటే తిరుగులేని అధిక్యత తథ్యమన్న విషయం ఆయనకువచ్చిన రిపోర్టులు స్పష్టం చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఒకవేళ పొత్తులు లేకుండా విడివిడిగా పోటీ చేసినా.. కూడా జగన్ కు గడ్డు పరిస్థితి తప్పదన్న మాట వినిపిస్తోందంటున్నారు. మారిన సమీకరణాల నేపథ్యంలో.. తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజలను తనకు వ్యతిరేకం కాకుండా చూసుకోవటానికి వీలుగా ఎన్టీఆర్ జయంతిని తమ పార్టీ నేతలు పాల్గొనేలా చేయటం ద్వారా ఒక సానుకూలతను సొంతం చేసుకోవాలని ఆలోచించినట్లుగా చెబుతున్నారు.

అలా అని ఎన్టీఆర్ జయంతిని పార్టీ మొత్తంగా చేస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉండటంతో.. ఎంపిక చేసిన నేతలు హాజరు కావటం ద్వారా.. తెలంగాణలోని ఏపీ ప్రజలు మనసుల్ని దోచుకునే ప్లాన్ ను కేసీఆర్ రచించినట్లుగా చెబుతున్నారు. ఈ కారణంతోనే ఇప్పటివరకు ఎన్టీఆర్ కు ఒక దండ వేయని టీఆర్ఎస్ నేతలు సైతం ఇప్పుడు ఆయన్ను తలవటం.. పొగిడేయటం కనిపిస్తుంది. అంతేకాదు.. ఈ కార్యక్రమాల నిర్వహణకు దాదాపు పదిహేను రోజుల నుంచే స్ఫష్టమైన ఆదేశాల్ని ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

టీడీపీకి చెందిన రేవంత్ టీపీసీసీ చీఫ్ అయ్యాక.. కొందరు టీడీపీ అభిమానులు ఆ పార్టీ వైపునకు వెళుతున్న నేపథ్యంలో.. వారిని తమ వద్దే ఉంచుకోవటానికి వీలుగా ఎన్టీఆర్ శత జయంతిని  వాడుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ కారణంతోనే.. ఎప్పుడు లేని విధంగా తెలంగాణలోని పలు చోట్ల (ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలోని పలుచోట్ల)  ఎన్టీఆర్ విగ్రహాల ఆవిష్కరణ.. టీఆర్ఎస్ నేతల నివాళులు లాంటివి చేపట్టినట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News