పవన్ ప్రసంగం.. జగన్ అండ్ కో మనో ధైర్యాన్ని భారీగా పెంచిందా?

Update: 2022-03-16 05:12 GMT
ఒక విషయాన్ని అందరూ ఒకేలా చూడరన్నది తెలిసిందే. ఎవరికి ఆలోచనలకు తగ్గట్లు వారు చూస్తుంటారు. జనసేన ఆవిర్భావ సభను ఏపీ అధికార పార్టీ ఎలా చూస్తోంది? అన్నదిప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. ఎందుకంటే ఆవిర్భావ సభ సందర్భంగా వైసీపీ అధినేతను.. ఆ పార్టీ మంత్రులను.. నేతల్ని టార్గెట్ చేసిన వైనం తెలిసిందే. దీనికి ప్రతిగా తమ మీద పవన్ చేసిన ఘాటు విమర్శలు.. ఆరోపణలకు స్పందించి తిట్టిపోయటం తెలిసిందే. ఇదంతా బయటకు కనిపిస్తున్న వ్యవహారం.

అయితే.. వైసీపీలోని పెద్ద తలకాయలు.. పవన్ సభను.. అందులో పవన్ మాట్లాడిన మాటల్ని ఎలా తీసుకుంటున్నారు? అన్న విషయాన్ని పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు కనిపిస్తున్నాయి. సీఎంను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ గా ఉన్న ఆ పార్టీ.. ఒక విషయంలో మాత్రం చాలా హ్యపీగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏపీలో జగన్ బలం ఏమిటన్న విషయాన్ని తన ఆవిర్భావ సభలో పవన్ చెప్పకనే చెప్పేశారని చెబుతున్నారు. ఒక పరిణితి చెందిన రాజకీయ అధినేత ఎవరూ మాట్లాడని మాటల్ని పవన్ మాట్లాడారని.. అదొక్కటి చాలు రాజకీయ పరిణితి ఏ మాత్రం ఉందో ఇట్టే  అర్థమవుతుందన్న మాట వినిపిస్తోంది.

జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చమన్న మాట ఒక్కటి చాలని.. ప్రజల్లో జగన్ కున్న బలం ఏమిటో అర్థమయ్యేలా చేస్తుందని చెబుతున్నారు. ఒక జగన్ ను ఓడించటానికి ఏపీలోని ఏ రాజకీయ పార్టీకి సొంతంగా బలం లేదన్న విషయాన్ని పవన్ స్పష్టం చేశారంటున్నారు. ప్రతిపక్ష టీడీపీతో పొత్తుకు సై అన్న మాటతో టీడీపీ నేతలు సంతోషిస్తున్న తీరు చూస్తుంటే.. జగన్ ను ఒక్కటిగా ఎదుర్కోవటం ఎంత కష్టమైన.. క్లిష్టమైన టాస్కు అన్నది అర్థమవుతుందని చెబుతున్నారు.

ఎవరికి వారు వారి బలం గురించి చెప్పటం మామూలే. అందుకు భిన్నంగా రాజకీయ ప్రత్యర్థే స్వయంగా తమ బలం ఎంత? వైరి జట్టు బలం ఎంతన్న విషయాన్ని చెప్పేసిన తీరు జగన్ కు శ్రీరామరక్షగా అభివర్ణిస్తున్నారు. పొత్తుల విషయంపై పవన్ క్లారిటీ ఇవ్వటం వల్ల లాభం ఎంతన్నది పక్కన పెడితే.. నష్టం మాత్రం ఆయనకు.. ఆయన పార్టీకి జరుగుతుందన్న మాటను చెబుతున్నారు.

అదెలానంటే.. ఎప్పుడైతే ఓటును చీల్చనివ్వం అని చెప్పారో.. అప్పుడే జగన్ బలంపై స్పష్టత రావటంతో పాటు.. గడిచిన మూడేళ్లుగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న ప్రచారం సైతం తప్పేనన్న విషయం అర్థమవుతుందని తేలుస్తున్నారు. ఒక విధంగా జనసేన ఆవిర్భావ సభ కారణంగా జగన్ బలం ఏమిటి? ఆయన పాలనపై ప్రజామద్దతు ఎంత ఉందన్న విషయాన్ని పవన్ మాటలు చెప్పేశాయంటున్నారు. నిజంగానే ప్రజల్లో జగన్ కు వ్యతిరేకత ఉంటే.. పొత్తుల కోసం పవన్ తహతహలాడే వారు కాదు కదా? అన్న వైసీపీ వర్గాల వాదనలో లాజిక్ ఉందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News