రాష్ట్రంపై ఆశలు వదిలేసుకున్నట్లేనా ?

Update: 2022-07-05 03:28 GMT
‘జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రాష్ట్రంలోకి అడుగుపెట్టలేనేమో’ ... ఇవి తాజాగా నరసాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు. నరేంద్ర మోడీ భీమవరం కార్యక్రమంలో ఎంపీ పాల్గొనలేక పోయారు.

మోడీతో పాటు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి కార్యక్రమంలో పాల్గొనాలని ఎంపీ విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే ఆయన చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలైపోయాయి. దాంతో చేసేది లేక చివరకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళిపోయారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే వైసీపీ తరపున గెలిచిన ఎంపీకి ఏదో విషయంలో జగన్ తో సమస్యలు మొదలయ్యాయి. దాంతో పార్టీకి, జగన్ కు దూరమైపోయారు. జగన్ తో గ్యాప్ వచ్చేసిన తర్వాత ఎంపీ రెచ్చిపోవటం మొదలుపెట్టారు. ముందు ప్రభుత్వాన్ని తప్పుపట్టిన ఎంపీ  తర్వాత డైరెక్టుగా జగన్నే టార్గెట్ చేయటం మొదలుపెట్టారు. ఎప్పుడు మాట్లాడినా ఏ విషయంపై మాట్లాడినా జగన్ను సీన్ లోకి తీసుకురావటం చాలెంజులు చేయటం, మీసాలు తిప్పుతు మాట్లాడటం ఎంపీకి అలవాటైపోయింది.

ఇపుడు ప్రధానమంత్రి కార్యక్రమంలో మాట్లాడుతూ జగన్ కాదు కదా జగన్ అమ్మ మొగుడు కూడా తనను ఆపలేరంటు చాలెంజ్ చేశారు. ఎంపీకి ఉన్న నోటిదురుసు వల్లే పరిస్ధితులు ఇంతగా దిగజారిపోయాయి.

వైసీపీలోనే ఉంటు ప్రభుత్వ విధానాలను వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డి చాలాసార్లు విమర్శించారు. అయితే ఏ ఒక్కళ్ళూ ఆనంపైన దాడులు చేయలేదు, ఆయనపై కేసులు పెట్టలేదు. మరి ఎంపీపైన మాత్రమే కేసులు ఎందుకు నమోదయ్యాయి ? ఎందుకంటే జగన్ పై వ్యక్తిగతంగా  బురద చల్లుతున్నారు కాబట్టే అందరికీ మండింది.

తన నోటిని అదుపులో ఉంచుకునుంటే బాగుండేది. జగన్ తో పడక దూరమైపోయిన వ్యక్తి కామ్ గా ఉండుంటే ఇపుడీ పరిస్ధితి వచ్చేది కాదేమో. జగన్ ఎలాంటి వ్యక్తో గతంలోనే గ్రహించిన ఎంపీ ఇంకా ఎందుకు కెలుక్కుంటున్నట్లు ? ఎందుకు చాలెంజులు చేస్తున్నట్లు ? జగన్ ఉన్నంతవరకు రాష్ట్రంలోకి అడుగుపెట్టలేనన్న విషయం ఎంపీకి ఇప్పటికి అర్ధమైందా ? జగన్ పై అనవసరంగా మాట్లాడటం ఎందుకు ఎక్కడో ఢిల్లీకి వెళ్ళి కూర్చోవటం ఎందుకు ?
Tags:    

Similar News