పుతిన్ కు మోడీ ఫోన్ కాల్.. ఇద్దరు అధినేతలు ఏం మాట్లాడుకున్నారు?

Update: 2022-02-25 04:04 GMT
మొండోడు రాజు కంటే బలవంతుడు అన్న సామెత తెలిసిందే. మొండోడే రాజు అయితే.. పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా రష్యా అధినేత పుతిన్ కూడా అదే తీరును ప్రదర్శిస్తున్నారు. మొండితనానికి.. మూర్ఖత్వానికి నిలువెత్తు రూపంగా చెప్పే వాద్లిమిర్ పుతిన్.. తన సోదర దేశమైన ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగటం తెలిసిందే.

రష్యా బలంతో పోలిస్తే ఉక్రెయిన్  పిల్లకాకిగా చెప్పాలి. ఏ యాంగిల్ లో చూసినా కూడా రష్యాతో పోటీ పడలేని పరిస్థితి. అంతో ఇంతో సాయం చేయాలంటే అది నాటో కూటమి చేయాలి. తమ అవసరాలు తప్పించి మరింకేమీ పట్టనట్లుగా వ్యవహరించే నాటో కూటమి ఇప్పుడు ప్రదర్శిస్తున్న తీరు ఉక్రెయిన్ పరిస్థితి ఇబ్బందికరంగా మారిన సంగతి తెలిసిందే.

ఇలాంటి వేళ.. ఉక్రెయిన్ మీద సైనిక చర్య పేరుతో రష్యా చేస్తున్న యుద్ధంతో ఉక్రెయిన్ చిగురుటాకులా వణుకుతోంది. రష్యా సైన్యం చేస్తున్న డ్యామేజ్ ముందు.. ఉక్రెయిన్ సేనలు తిప్పి కొడుతున్న వైనం పెద్ద లెక్కలోకి రానిదనే చెప్పాలి. ఉక్రెయిన్ కీలక నగరం కీవ్ ను హస్తగతం చేసుకున్నట్లుగా ఇప్పటికే రష్యా ప్రకటించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. భారత్ లోని ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని.. ఆయన చెబితే రష్యా అధ్యక్షుడు పుతిన్ సానుకూలంగా స్పందించే అవకాశం ఉందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచలోనే మోదీ పవర్ ఫుల్ నేతగా ఆయన అభివర్ణించారు. మరోవైపు.. గురువారం సాయంత్రం నుంచి ప్రధాని మోదీ.. రష్యా అధినేత పుతిన్ కు ఫోన్ చేస్తారన్న వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీనికి తగ్గట్లే.. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి కాస్తంత పొద్దుపోయిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధినేతకు ఫోన్ చేశారు.

ఇరువురు నేతలు తాజా పరిణామాల మీద మాట్లాడుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఉక్రెయిన్ పైన రష్యా చేపట్టిన సైనిక చర్యకు సంబంధించి పుతిన్ తో మోడీ మాట్లాడినట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ మీద దాడులు ఆపాలని పుతిన్ ను నమో కోరినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పుతిన్ కు మోడీ సూచన చేశారు.

అదే సమయంలో ఉక్రెయిన్ లో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారని.. వారికి ముప్పు వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా మరే దేశాధినేత ధైర్యం చేయలేని రీతిలో.. పుతిన్ కు ఉక్రెయిన్ మీద యుద్ధం ఆపాలని ప్రధాని మోదీ కోరటం ఒకింత సాహసమైన ప్రక్రియగా చెప్పక తప్పదు. అయితే.. మోడీ సూచనకు రష్యా అధినేత పుతిన్ ఏ రీతిలో రియాక్ట్ అయ్యారన్న దానిపై ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.
Tags:    

Similar News