రష్యా వర్సెస్ ఉక్రెయిన్.. సైనిక బలం ఎవరికెంత ?

Update: 2022-02-25 04:10 GMT
ఆధునిక యుగంలో అందునా డిజిటల్ ప్రపంచంలో.. గడిచిన రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కాటు వేసిన వేళ.. ఇప్పటికిప్పుడు ప్రశాంతమైన వాతావరణం కొన్నాళ్ల పాటు సాగాలన్న భావన సాధ్యమయ్యేది కాదన్న విషయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన తాజా చర్యతో సందేశాన్ని ఇచ్చేయడం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం నుంచి ఉక్రెయిన్ మీద రష్యా విరుచుకుపడటం.. కడపటి సమాచారం అందేసరికి.. ఉక్రెయిన్ కీలక నగరమైన కీవ్ మీద దాదాపు పట్టు వచ్చేసిందన్న అధికారిక ప్రకటన వెలువడటం తెలిసిందే.

రోడ్డు మీద ఇద్దరు పడి కొట్టుకుంటున్న వేళ.. ఎవరి బలం ఎంత? ఎవరి వైపు న్యాయం ఉంది? ఎవరిది తప్పు ఉందన్న విషయాలపై లెక్కలు తేల్చే మెకానిజం ప్రపంచానికి లేదు. ఈ కారణంతోనే.. ఉక్రెయిన్ మీద కోపం వచ్చిన రష్యా అధినేత.. వార్నింగ్ లు ఇచ్చేసి.. అంతకు మించినట్లుగా సైనిక చర్యలకుఓకే చెప్పేయటం తెలిసిందే. ఇలాంటి వేళ.. యుద్దం జరుగుతున్న రెండు దేశాలకు మధ్య ఆయుధ బలం ఎంత? సైనిక బలం ఎంత? లాంటి గణాంకాల్ని చూస్తే.. ఎవరి బలం ఎంతన్నది అర్థం కావటమే కాదు.. రష్యా సైనిక సంపత్తి ముందు ఉక్రెయిన్ ఎంతలా తేలిపోతుందో ఇట్టే అర్థమవుతుంది.

ఉక్రెయిన్ లోని ఏ ప్రాంతాల వైపు రష్యా సైన్యం కదులుతుందన్న విషయంపై ఇప్పటికే పలువురికి క్లారిటీ వచ్చేయటం తెలిసిందే. గడిచిన కొద్ది నెలలుగా ఉక్రెయిన్ మీద దాడి సందర్భంగా ఏమేం చేయాలన్న దానిపై రష్యా అధినేత పుతిన్ పక్కా ప్లాన్ తో ఉండటం తెలిసిందే. ఇందుకు తగ్గట్లే.. గడిచిన కొద్ది నెలల్లో దాదాపు 2 లక్షల మంది సైనిక బలగాల్ని మొహరించటం.. తాజాగా ఉక్రెయిన్ లోకి సైనికులు పెద్ద సంఖ్యలో అడుగు పెట్టి.. కీవ్ నగరాన్ని తమ వశం చేసుకున్నట్లుగా రష్యా ప్రకటించింది. అంతేకాదు.. ఉక్రెయిన్ లోని కీలక ప్రాంతాల్లోయుద్ధ ట్యాంకులు.. ఆయుధ సామాగ్రిని రష్యా ఆర్మీ సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. అందుకు తగ్గట్లే తాజాగా అలాంటి పరిస్థితే నెలకొంది.

ఇప్పటికే సిద్ధంగా ఉండి.. ఎప్పుడెప్పుడో రణానికి రెఢీ అవుదామని ఉత్సాహాన్ని ప్రదర్శించేలా ఉక్రెయిన్ లోకి అడుగు పెట్టిన యుద్ధ ట్యాంకులు.. ఆయుధ సామాగ్రికి తాజాగా.. ఎయిర్ ఫోర్సు.. నేవీ నుంచి మద్దతు కూడా లభిస్తోంది.

ఇక.. గణాంకాల్లోకి వెళితే..

సైనిక సంపత్తి                రష్యా               ఉక్రెయిన్

సైనిక బలగాలు           29 లక్షలు             11 లక్షలు

యాక్టివ్                        9 లక్షలు             2 లక్షలు

రిజర్వ్                       20 లక్షలు           9 లక్షలు

ఎటాక్ ఎయిర్ క్రాఫ్ట్    1511                     98

అటాక్ హెలికాప్టర్           544                     34

ట్యాంకులు                   12,240                2,596

ఆయుధ వాహనాలు       30,122              12,303

ఆర్టిలరీ                            7571                 2040

ఈ గణాంకాల్ని చూసిన తర్వాత రష్యాకు.. ఉక్రెయిన్ కు బలంలో ఏ మాత్రం పోలిక లేదనే చెప్పాలి. ఇప్పటికే ఉక్రెయిన్ లోని కొంత భాగాన్ని.. పలు ప్రాంతాల్ని రష్యా సైన్య మొహరించిందని.. వీరికి అదనంగా రష్యన్ సెక్యూరిటీ గార్డులు.. ఇతర దేశీయ భద్రతా బలగాల సిబ్బంది పాల్గొన్నారు.

అదే సమయంలో రష్యా సైన్యంలోని 60 శాతం బలగాలు రష్యా, బెలారుస్ సరిహద్దుల్లో ఉన్నాయని బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వాలస్ వ్యాఖ్యానించారు. రష్యా సైన్యంలోని 60 శాతం బలగాలు రష్యా, బెలారుస్ సరిహద్దుల్లో ఉన్నాయని బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వాలస్ వ్యాఖ్యానించటం చూస్తే.. రష్యా అంతిమ లక్ష్యం ఇట్టే అర్థం కాక మానదు. పేరుకు నాటో బలం ఉందని చెబుతున్నప్పటికీ.. ఉక్రెయిన్ కు అండగా నిలిచేందుకు నామమాత్రపు సాయాన్ని మాత్రమే ఇవ్వటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా రష్యా సైనిక సంపత్తి ముందు తలిపోయేలా ఉన్న వేళ.. యుద్ధం మరెన్ని మలుపుల్ని తిప్పుతుందో చూడాలి మరి.
Tags:    

Similar News