రాష్ట్రప‌తిగా తెలుగోడు.. ఇదే బీజేపీ వ్యూహం!

Update: 2022-03-12 12:30 GMT
ఇటీవ‌ల అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో బీజేపీ జోష్‌లో ఉంది. పంజాబ్‌లో ఓటమి ఎదురైనా మిగ‌తా నాలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని నిల‌బెట్టుకోవ‌డం ఆ పార్టీని ఆనందాన్నిస్తోంది. ముఖ్యంగా దేశ రాజ‌కీయాల్లో కీల‌క‌మైన యూపీలో వ‌రుస‌గా రెండో సారి అధికారంలోకి వ‌చ్చి రికార్డు సృష్టించింది. ఇదే జోరులో తదుప‌రి టార్గెట్‌పై ఫోక‌స్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. జాతీయ రాజ‌కీయాల్లో త‌మ‌కు వ్య‌తిరేకంగా పావులు క‌దుపుతున్న వాళ్లను దెబ్బ‌కొట్టేలా రాష్ట్రప‌తి ఎన్నిక‌పై దృష్టి పెట్టిన‌ట్లు స‌మాచారం. తెలంగాణ‌లో కేసీఆర్‌ను క‌ట్ట‌డి చేసేందుకు.. ద‌క్షిణాదిలో ప‌ట్టు సాధించేందుకు తెలుగు వ్యక్తినే రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ఎంపిక చేస్తార‌ని టాక్‌.

వెంక‌య్య‌కు ప్ర‌మోష‌న్‌
యూపీలో వ‌చ్చిన సీట్లు రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో బీజేపీకి అనుకూలంగా మార‌తాయి. ప్ర‌స్తుత రాష్ట్రప‌తి ప‌ద‌వీ కాలం ఈ ఏడాది జులైతో ముగుస్తుంది. ఈ నేప‌థ్యంలో త‌ర్వాత అభ్య‌ర్థి ఎవ‌ర‌నే విష‌యంపై బీజేపీ దృష్టి సారించింది.

776 మంది పార్ల‌మెంట్ స‌భ్యులు, వివిధ రాష్ట్రాల్లోని 4,120 మంది శాస‌న‌స‌భ్యుల‌తో ఏర్పాటు చేసిన ఎల‌క్టోర‌ల్ కాలేజీ ద్వారా రాష్ట్రప‌తిని ఎన్నుకుంటారు. వీళ్ల ఓట్ల విలువ ఆధారంగా ఎన్నిక ఉంటుంది. ప్ర‌స్తుతం బీజేపీకి స‌గం కంటే ఎక్కువ బ‌లం ఉంది. కాబ‌ట్టి మ‌రోసారి బీజేపీ అభ్య‌ర్థి రాష్ట్రప‌తి అయ్యే అవ‌కాశం ఉంది.

ఈ నేప‌థ్యంలో ఉప రాష్ట్రపతిగా ఉన్న తెలుగు వ్య‌క్తి వెంక‌య్యానాయుడిని రాష్ట్రప‌తి చేయాల‌ని బీజేపీ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ద‌క్షిణాదిపై అందులోనూ తెలుగు రాష్ట్రాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించిన బీజేపీ ఏపీకి చెందిన వెంక‌య్య నాయుడిని రాష్ట్రప‌తి చేయాల‌ని చూస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అందుకోసం వైసీపీతో పాటు బిజూ జ‌న‌తాద‌ళ్‌తోనూ బీజేపీ చ‌ర్చ‌లు చేస్తున్న‌ట్లుగా స‌మాచారం. దీంతో ఏక‌గ్రీవంగానే అభ్య‌ర్థిని ఎన్నుకోవాల‌నే దిశ‌గా క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.

రేసులో ద‌త్తాత్రేయ‌..
బీజేపీ వ్య‌తిరేక శ‌క్తుల‌ను ఏకం చేయాల‌నే ప్ర‌య‌త్నాల్లో ఉన్న కేసీఆర్‌ను దెబ్బ కొట్టేందుకు రాష్ట్రపతి ఎన్నిక‌ల‌ను వాడుకోవాల‌ని బీజేపీ ప్లాన్ వేసిన‌ట్లు తెలుస్తోంది. అందుకే తెలంగాణ నుంచి బండారు ద‌త్తాత్రేయ‌ను రాష్ట్రప‌తి చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు విశ్లేష‌కులు భావిస్తున్నారు. ప్ర‌స్తుతం హ‌రియాణా గ‌వ‌ర్న‌ర్‌గా కొన‌సాగుతున్న ద‌త్తాత్రేయ‌ను రాష్ట్రప‌తి చేసేందుకు కేసీఆర్ కూడా వ్య‌తిరేకించ‌డ‌ని బీజేపీ భావిస్తోంది. దీంతో వ్య‌తిరేకంగా మ‌రో అభ్య‌ర్థిని నిల‌బెట్టే విష‌యంలో ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు ఆయన స‌హ‌క‌రించ‌క‌పోవ‌చ్చ‌ని స‌మాచారం.

ఇలా కేసీఆర్‌ను ఇర‌కాలంలో పెట్టాల‌ని బీజేపీ చూస్తుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. మ‌రోవైపు ద‌త్తాత్రేయ సామాజిక‌వ‌ర్గమైన కురుమ‌లు క‌ర్ణాట‌క‌, ఏపీలోని రాయ‌లసీమ ప్రాంతాల్లో ఎక్కువ‌గా ఉన్నందున ఆయ‌న పేరు ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలిసింది. వివాద ర‌హితుడిగా ఉన్న ద‌త్తాత్రేయ పేరును ప్ర‌తిపాదిస్తే ఎవ‌రి నుంచి అభ్యంత‌రాలు వ‌చ్చే అవ‌కాశం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఆ ప‌ద‌వి అందుకున్న మూడో తెలుగు వాడిగా ఎవ‌రు నిలుస్తారో చూడాలి.
Tags:    

Similar News