శివమొగ్గ లో తీవ్ర ఉద్రిక్తత

Update: 2022-02-22 05:30 GMT
కర్నాటకను హిజాబ్ వివాదం పట్టి కుదిపేస్తున్న నేపథ్యంలో శివమొగ్గ లో ఓ హత్య జరగటం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. హత్యకు గురైన యువకుడు కూడా భజరంగ్ దళ్ యాక్టివిస్టు కావటంతో పరిస్థితి మరింత దిగజారిపోయింది. శివమొగ్గలో హర్ష (28) అనే యువకుడు వెళుతుండగా కారులో వచ్చిన ఐదుగురు కత్తులతో దాడి చేసి పొడిచేశారు. ఘటన జరిగిన తర్వాత పోలీసులు అప్రమత్తమై శివమొగ్గ లో ఇద్దరు, బెంగుళూరులో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

 భజరంగదళ్ యాక్టివిస్టుకు హిజాబ్ వివాదానికి సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు. అయితే భజరంగదళ్ యాక్టివిస్టులు మాత్రం దీన్ని అంగీకరించటం లేదు. హిజాబ్ వివాదంలో హర్ష బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ హత్య వెనుక ఎవరున్నారనే విషయంలో విచారణ జరుగుతోంది.

హిజాబ్ వివాదం ఉడిపి ప్రభుత్వ కాలేజీలో మొదలై అనేక జిల్లాలకు పాకింది. దాదాపు పది జిల్లాల్లోని విద్యాసంస్ధలను కేవలం హిజాబ్ వివాదం నేపధ్యంలోనే మూసేశారు.

 ఈ వివాదం కర్నాటకకు మాత్రమే పరిమితం కాకుండా పది రాష్ట్రాలకు పాకింది. చాలా రాష్ట్రాల్లో హిజాబ్ వివాదం తీవ్రంగానే ఉన్నప్పటికీ ఎక్కడా హత్యల్లాంటి ఘటనలు జరగలేదు. ఇపుడు శివ మొగ్గలో హత్య జరగటంతో ఒక్కసారిగా ఉద్రిక్తత మొదలైపోయింది.  

హత్యను నిరసిస్తు భజరంగ్ దళ్ యాక్టివిస్టులు శివమొగ్గలో టూ వీలర్లు, కార్లను ధ్వంసం చేసేశారు. చాలా వాహనాలను దగ్ధం చేశారు. సోమవారం హర్ష అంత్యక్రియలు జరగబోతోంది.

ఈ సందర్భంగా ఇంకెంత హింస జరుగుతుందో అన్న టెన్షన్ పోలీసులను, స్ధానికులను కుదిపేస్తోంది. మొత్తం మీద ఈ హింస శివ మొగ్గను దాటి ఇతర జిల్లాలకు పాకకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఏదేమైనా హిజాబ్ వివాదం నేపథ్యంలో మొదలైన ఉద్రిక్తత అనేక రూపాల్లో కర్నాటకను కుదిపేస్తుండటం మాత్రం ఆందోళనగానే ఉంది. మరి ఈ పరిస్ధితులను ప్రభుత్వం ఎలా ఎదుర్కుంటుందో చూడాల్సిందే.
Tags:    

Similar News