పంజాబ్ లో ఎవరి ఆనందం వాళ్ళదేనా ?

Update: 2022-02-21 05:35 GMT
పంజాబ్ లో ఎన్నికలు ముగిసిన తర్వాత అన్నీ పార్టీలు హ్యాపీగా ఉన్నాయి. ఎవరికి వాళ్ళు తమ పార్టీయే అధికారంలోకి వచ్చేయటం ఖాయమంటూ ప్రకటనలు చేసేస్తున్నారు. ఓటర్లు కూడా భారీ ఎత్తున పోలింగ్ లో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొన్నారు. సగటు పోలింగ్ 65 శాతం దాటింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని చాలా కేంద్రాల్లో పోలింగ్ 71 శాతం దాటింది.

 గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, పేదలు అత్యధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొన్నట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. ఇంత భారీ ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ జరగడం వల్ల ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ? అన్న సందేహాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ మాట్లాడుతూ తమ పార్టీకి మూడింట రెండొంతుల సీట్లు ఖాయమన్నారు. తమ కూటమికి 80 సీట్లు ఖాయమని అకాలీదళ్-బీఎస్సీ కూటమి నేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ ప్రకటించారు.

అలాగే సంపూర్ణ ఆధిక్యతతో అధికారంలోకి వస్తామని ఆప్ తరపు ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ సింగ్ ప్రకటించారు. విచిత్రమేమిటంటే తాము అధికారంలోకి వచ్చేయటం ఖాయమని చెప్పనిది బీజేపీ కూటమి మాత్రమే. కాబట్టి పోటీలో నుంచి బీజేపీ ఔట్ అన్న విషయం అర్ధమైపోతోంది. ఇదే సందర్భంగా అకాలీదళ్-బీఎస్పీ కూటమి నేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ ప్రకటనను కూడా ఎవరు నమ్మటం లేదు. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియలో ఈ కూటమి ప్రభావం మొదటి నుండి కూడా పెద్దగా కనబడటం లేదు.

 ఇక మిగిలిన కాంగ్రెస్-ఆప్ పార్టీల నేతల ప్రకటనలను మత్రమే జనాలు సీరియస్ గా తీసుకుంటున్నారు. మొదట్లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలతో దెబ్బతిన్న కాంగ్రెస్ చివరలో పుంజుకున్నట్లే కనబడుతోంది. ముఖ్యమంత్రి చన్నీ, పీసీసీ అధ్యక్షుడు నవ్ జోత్ సింగ్ సిద్ధూ కలిసి పనిచేశారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తదితరాల్లో ఐకమత్యంగానే పనిచేశారు. కాబట్టి కాంగ్రెస్ కు రెండోసారి అవకాశం ఉన్నట్లు అనుమానంగా ఉంది. ఫైనల్ గా ఆప్ ను తీసుకుంటే మొదటినుండి మంచి దూకుడుగానే ఉంది. మొత్తానికి అధినేతలంతా హ్యాపీగానే ఉన్నారు.
Tags:    

Similar News