రాజమౌళి ,బన్నీ సహా సినీ ప్రముఖుల పేర 6 కోట్ల మోసం!

Update: 2022-10-14 16:30 GMT
సెలబ్రెటీల పేరు చెబితే పైసలు రాలుతాయి. వారి క్రేజ్ అలాంటిది మరీ. ముఖ్యంగా టాలీవుడ్ లో రాజమౌళి, అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతకాదు.. అయితే వారి పేరు చెప్పి ఇప్పుడు మోసాలు జరుగుతున్న పరిస్థితి.   సినీ పరిశ్రమలోని పెద్ద వ్యక్తులను ఉపయోగించుకుని ఆర్థిక మోసాలు చేస్తున్న వైనం వెలుగుచూసింది. భారీ మొత్తంలో డబ్బు ఇస్తే.. వారి  పెద్ద చిత్రాలలో పాత్రలు ఇస్తామని హామీ ఇచ్చే మోసగాళ్లు బయటపడ్డారు. ఇలా ప్రజలను మోసం చేయడం అలవాటుగా చేసుకున్నారు.

ఇక్కడ ఒక పెద్ద స్కామ్ వెలుగుచూసింది. పెద్ద మొత్తంలో డబ్బు గుంజుతున్న వైనం బయటపడింది. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన కొంగర అంజమ్మ చౌదరి, నాగం ఉమాశంకర్ అనే ఇద్దరు వ్యక్తులు పదుల సంఖ్యలో ప్రజలను స్టార్ హీరోలు, దర్శకుల సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నట్టుగా మోసం చేశారు. పెద్ద సినిమాల్లో నటింపచేస్తామని చెప్పి కొంతమంది బాధితులను మోసం చేసినట్టు తెలిసింది.

మరికొంతమందికి ఆర్‌ఆర్‌ఆర్, అల వైకుంఠపురములో, లవ్ స్టోరీ వంటి పెద్ద సినిమాల్లో వాటా ఇస్తామని చెప్పి ఎర వేశారు. వారికి భారీ లాభాలను అందిస్తామని ఆశచూపారు. చాలా మంది మహిళలు యాక్టింగ్ ఆఫర్లతో ట్రాప్ అయ్యారు. చాలా మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు మరియు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ మోసాల బారిన పడ్డట్టు తేలింది.

ఈ మొత్తం స్కామ్ విలువ రూ. 6 కోట్ల వరకు ఉంటుంది. మోసగాళ్లు వారి వాదనలను నమ్మడానికి ఎమ్మెల్యేలు మరియు ఎంపీల పేర్లను కూడా ఉపయోగించారని తెలిసింది. రూ. 6 కోట్లకు పైగా సేకరించగలిగారని పోలీసుల విచారణలో తేలింది. దోచుకున్నట్లు గుర్తించిన బాధితులు, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరుగుతోంది.

ఈ టాలీవుడ్ స్కాం ఇప్పుడు కలకలం రేపుతోంది.  అగ్రహీరోలు, దర్శకుల పేరు చెప్పి ఏకంగా అవకాశాలు ఇప్పిస్తామని 6 కోట్లు దోచుకున్న ముఠాను పోలీసులు విచారిస్తున్నారు. వీరు ఎవరి వద్ద ఎంత తీసుకున్నారు.? ఇందులో ఎవరి ప్రమేయం ఉందన్న దానిపై విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో ఏమేం వెలుగుచూస్తాయన్నది ఆసక్తి రేపుతోంది.

    

Tags:    

Similar News