నాటు సారా చావులు... వైసీపీ ఉక్కిరి బిక్కిరి...?

Update: 2022-03-14 07:36 GMT
నాటు సారా ఏపీలో అతి పెద్ద కుటీర పరిశ్రమగా మారి మూడేళ్ళు దగ్గర  పడుతోంది. ఇదంతా మద్య పాన నిషేధం దిశగా దశలవారీగా ఒక్కో అడుగు అంటూ సర్కార్ పెద్దలు చేసిన ఆర్భాటానికి అసలైన నిర్వాకం. రేట్లు షాక్ కొట్టేలా పెంచుకుపోతామని దారుణంగా పెంచేశారు. కొత్త బ్రాండులు కూడా దించేసారు. దాంతో మద్యానికి దూరం అవుతారని సర్కార్ అంచనా వేసుకుంది. కానీ అలా జరగలేదు.

తాగిన వారు ఇంతకు రెట్టింపు తయారయ్యారు. ఇంట్లో ముంతా చెంబూ అన్నీ కూడా తాకట్టు వాకట్టు పెట్టి మరీ తాగేస్తున్నారు ఎక్కువ రేటు ఉన్నా తాగుడు కోసం తాము చితికిపోయి మరీ బతుకు కాల్చుకుంటున్నారు. అదీ లేనినాడు, డబ్బులు దొరకని నాడు మెల్లగా నాటు సారా బాట పడుతున్నారు.

అలా అధిక మద్యం రేట్లకు, అధికారుల నిర్లక్ష్యానికి పుట్టిన చీకటి బిడ్డ నాటు సారా. అయితే ఇది ఇపుడే పుట్టిందా అని డౌట్ ఎవరికైనా రావచ్చు. కానీ గతంలో ఉన్నా ఇంత లేదు. ఎందుకంటే బెల్ట్ షాపుల రూపంలో గత సర్కార్ కిళ్ళీ బడ్డీల లోనూ మందు సరఫరా చేస్తూ వచ్చింది. అలా అలవాటు పెంచుకున్న వారు ఇపుడు అధిక రేట్లకు తట్టుకోలేక నిజంగా షాక్ తిన్నారు.

ఆ షాక్ తో వారు మద్యం ముట్టడం మానలేదు. నాటు సారా వైపు అడుగులు వేశారు. దాంతో ఏపీ నిండా ఎటు చూసినా నాటు సారా విచ్చలవిడిగా తాండవిస్తోంది. చిత్రమేంటి అంటే అది సర్కార్ పెద్దలకు, అధికారులకు అసలు కనిపించడంలేదు.

అందుకే వారికి నాటు సారా అన్నది ఏపీలో ఏ కోశానా లేదు అనే అనిపిస్తుంది. కానీ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం లో మోగిన మరణ మృదంగం అబద్ధం చెప్పదు కదా. ఏకంగా 18 మంది ఒకేసారి మరణించడం ఏపీలో అతి పెద్ద దారుణంగా చూడాలి.

వీరంతా ఒకే రకమైన లక్షణాలతో ప్రాణాలు వదిలారు. వీరంతా కూడా నాటు సారా తాగే చనిపోయారు అని అయినవారు గోడుమని చెబుతున్నారు.  ఇది విషాదానికే  విషాదం లాంటి వార్త. కానీ సర్కార్ పెద్దలు ఇపుడు కూడా అలాంటిది జరగలేదు అంటున్నారు.  

నిజానికి ఒక వైపు గంజాయి, మరో వైపు మాదక ద్రవ్యాలు , ఇంకో వైపు నాటు సారా ఇలా ఏపీ నిండా విచ్చలవిడిగా మత్తు దొరుకుతోంది. మూడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ చేసిన ఘనమైన వాగ్దానం దశలవారీగా మద్యపాన నిషేధాన్ని వెక్కిరించేలా ఇవన్నీ పెరిగిపోయాయి. వీటి వెనక రాజకీయ పలుకుబడి ఉంది.  బడా బాబుల దందా ఉంది. అధికారుల చూసీ చూడని తత్వం ఉంది.

అందుకే నాటు సారా అతి పెద్ద కుటీర పరిశ్రమగా ఏపీలో వర్ధిల్లుతోంది. పరిశ్రమలు గత మూడేళ్లలో తరలిపోయాయి అని విమర్శలు చేస్తున్న వారికి జవాబుగా ఊరూ వాడా ఈ కుటీర పరిశ్రమలు వెలిగిపోతున్నాయన్నమాట. మరి పేదవాడి ప్రాణాలను ఫణంగా పెట్టి సాగుతున్న నాటు సారా వ్యాపారాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వం ఏం చేతోంది అన్నదే ప్రశ్న. ఎక్సైజ్ శాఖ దాడులు జరిగితే ఇంత పెద్ద వ్యాపారం ఎందుకు సాగుతుంది అన్నది మరో సందేహం.

అదే విధంగా  స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ బ్యూరోను ప్రభుత్వం నాటు సారా కట్టడికి ఏర్పాటు చేసింది. గతంలో కూడా నాటు సారాతో జనాలు చనిపోయారు. మరి ఇపుడు 18 మందిని నాటు సారా మింగేసింది. మరి ఈ స్పెషల్  ఎన్ఫోర్స్‌మెంట్ బ్యూరో ఏం చేస్తోంది. సంబంధిత  మంత్రిత్వ శాఖల మంత్రులు కూడా ఏం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు. ఇవన్నీ ప్రశ్నలే. అమాయకుల ప్రాణాలు గాలిలో కలసిపోతునా పాలకులకు పట్టదా అన్న ప్రశ్నలకు జవాబు ఉందా.
Tags:    

Similar News