ఉక్రెయిన్ ను మాత్రమే కాదు ప్రపంచ కుబేరుల్ని దెబ్బేసిన పుతిన్

Update: 2022-02-25 03:21 GMT
ఒక్క తిక్కోడు చాలు.. ఆగమాగం చేయడానికి. చక్కగా నడిచే వ్యవస్థల్ని దారుణంగా దెబ్బ తీయటమే కాదు.. నోటికి వచ్చినట్లుగా.. చేతికి వచ్చినట్లుగా విరుచుకుపడుతూ చేస్తున్న హింస.. ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావాన్ని పడేలా చేస్తోంది. అన్ని బాగున్నప్పుడు.. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తో వేలాది కోట్ల సంపదను పెంచేసుకునే ప్రపంచ కుబేరుల (టాప్ 20)కు దిమ్మ తిరిగేలా షాకిచ్చారు రష్యా అధ్యక్షుడు పుతిన్.

ఎందుకిలా అంటే.. ఉక్రెయిన్ మీద సైనిక చర్యకు రష్యా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. స్టాక్ మార్కెట్ల సెంటిమెంట్ దారుణంగా దెబ్బతిన్నాయి. బుల్ బబ్బుంటే.. బేర్ చెలరేగిపోయింది. దీంతో.. మార్కెట్లలో ఉచకోత మొదలైంది. అంతకంతకూ పడిపోయిన స్టాక్ మార్కెట్ సూచీకి తగ్గట్లే.. షేర్ల ధరల మీదా ప్రభావం పడింది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ప్రతికూలంగా మారటంతో షేర్ మార్కెట్ పరిస్థితి భయానకంగా మారింది.

పుతిన్ నోటి నుంచి సైనిక చర్యను చేపట్టాలన్న ఆదేశం వెలువడిన వెంటనే.. యుద్ధం మొదలు కావడం.. నాలుగైదు గంటల్లోనే భారీగా నష్టపోయినట్లుగా చెబుతున్నారు. యుద్ధం మొదలైన నాలుగైదు గంటల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 20 అపర కుబేరుల సంపద కళ్ల ముందు కరిగిపోయిన పరిస్థితి. ఇలా కరిగిన ఈ షేర్ల విలువ మొత్తం కలిపి అక్షరాల రూ.3.11 లక్షల కోట్లుగా చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కుబేరులందరికి భారీగా నష్టపోయేలా చేసింది.

ఎక్కడి దాకానో ఎందుకు? భారతీయ కుబేరులుగా అభివర్ణించే రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. గౌతమ్ అదానీ.. ఉదయ్ కోటక్.. దిలీప్ సంఘ్వీ సహా టాప్ 10 మంది వ్యాపారస్తుల షేర్ల విలువ దాదాపు రూ.60 వేల కోట్ల మేర పడిపోయి ఉంటాయని చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఉక్రెయిన్ లో  జరుగుతున్న దాడి పుణ్యమా అని.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా పేరున్న టెస్లా వ్యవస్థాపకుడైన ఎలన్ మస్క్ నికర విలువ రూ.లక్ష కోట్లకు పడిపోవడం గమనార్హం.

గురువారం షేర్ల ధరలు భారీగా పడిపోవటంతో.. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి రూ.9700 కోట్లు.. హెచ్ సీఎల్ టెక్నాలజీ స్ శివనాడార్ కు రూ.5300 కోట్లు.. రాధాకిషన్ దమానీ.. దిలీప్ సంఘ్వీ.. కుమార్ మంగళం  బిర్లా లాంటి బడా వ్యాపారస్తులు పెద్ద ఎత్తున నష్టపోయినట్లుగా చెబుతున్నారు.

ఈ మార్కెట్ భయాందోళనలు శుక్ర.. శనివారాలు కూడా సాగుతాయని చెబుతున్నారు. రష్యా ఆరంభించిన యుద్ధం అంతకంతకూ పెరుగుతున్న కొద్దీ.. అపర కుబేరుల ఆస్తులు అంతకంతకూ కరిగిపోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మొత్తానికి అపర కుబేరుల కంట్లో నుంచి రక్త కన్నీరు కార్పించటంలో పుతిన్ సక్సెస్ అయ్యారని చెప్పాలి.
Tags:    

Similar News