కేసీఆర్ ముంద‌స్తు మంత్రం..అప్పుడే మొద‌లైన టికెట్ల వేట‌

Update: 2022-03-05 12:51 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌ వేడిని సృష్టించిన సంగ‌తి తెలిసిందే. వచ్చే ఏడాది అంటే 2023 డిసెంబరులో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న‌ప్ప‌టికీ...అంతకుముందే ఎన్నిక‌లు జ‌ర‌గ‌వ‌చ్చ‌నే టాక్ రాష్ట్రంలో వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే, 2022 ఏప్రిల్‌, మే నెలల్లో జరగనున్న కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతోపాటే  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉందన్న దిశ‌గా రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అప్పుడే టికెట్లు సంపాదించుకునేందుకు నేత‌ల ప్ర‌య‌త్నాలు మొద‌లైపోయాయి. అయితే, ఇందులో ప్ర‌స్తుతం ఉద్యోగాలు చేస్తున్న ఉన్న‌తాధికారులు ఉండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ప్ర‌జాసేవ‌లోకి రావాల‌ని భావిస్త‌న్న అధికారుల్లో ప్ర‌ధానంగా వినిపిస్తున్న పేరు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు గడల శ్రీనివాసరావు. త‌న తండ్రి గడల సూర్యనారాయణ పేరుతో జీఎస్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్ ద్వారా కొత్తగూడెం నియోజకవర్గంలో వైద్యసేవలు అందిస్తున్న ఆయ‌న రాబోయే ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్లు టాక్‌.  అధికార పార్టీ తరఫున సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకే టీఎన్‌జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న మామిళ్ల రాజేందర్ ఇప్ప‌టికే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టిన‌ట్లు తెలుస్తోంది.

నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌గా పనిచేస్తున్న కేఆర్‌ నాగరాజు సైతం రాబోయే ఎన్నిక‌ల్లో బ‌రిలో దిగాల‌న్న ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్లు స‌మాచారం. వరంగల్‌ జిల్లాలోని వర్దన్నపేట (ఎస్సీ) నియోజకవర్గం లేదా వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి. పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ)గా పని చేస్తున్న లక్ష్మీనారాయణది తన సొంత జిల్లా అయిన వ‌న‌ప‌ర్తి నుంచి ఎన్నికల బరిలోకి దిగే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జగిత్యాల జిల్లా ట్రాన్స్‌పోర్ట్‌ అధికారిగా (డీటీవో)గా పనిచేస్తున్న ఖానాపూర్‌  ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ భర్త శ్యాం నాయక్ వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్న‌ట్లు త‌న స‌న్నిహితుల‌కు బ‌హిరంగంగానే చెప్పుకొంటున్నారు.

తనదైన శైలిలో ప్రజాదరణ పెంచుకుంటూ వెళ్తున్న  ములుగు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్‌ సిటింగ్‌ ఎమ్మెల్యే సీతక్క సమర్థంగా ఎదుర్కొనడానికి వీలుగా ములుగు జిల్లా డీఎంహెచ్‌వోగా పనిచేస్తున్న అల్లెం అప్పయ్య‌  పోటీకి దిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు స‌మాచారం. అప్పయ్య  ఆదివాసీ కోయ సామాజికవర్గానికి చెందిన వ్య‌క్తి కావ‌డం వ‌ల్ల అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఉన్నతస్థాయి వర్గాలు కూడా ఆయనవైపు మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2004 ఎన్నికల సమయంలోనే అప్పయ్య ఎమ్మెల్యే టికెట్‌ ఆశించడం ఆస‌క్తిక‌ర అంశం.

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో క‌లిసి చ‌దువుకున్న ఇటీవల రిటైరయిన డీసీపీ రాంనర్సింహారెడ్డి భూపాలపల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌ ఆశిస్తున్నారు. జిల్లాలోని మొగుళ్లపల్లి మండలానికి చెందిన ఆయన ఇప్పటికే ఆర్‌ఎన్‌ఆర్‌ ట్రస్ట్‌ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర క్యాడర్‌ అధికారిగా అక్కడే పని చేస్తున్న ఐఏఎస్‌ అధికారి పరికిపండ్ల నరహరి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

దీంతో భవిష్యత్తులో ఆయన ఏదో ఒక పార్టీ తరఫున రామగుండం నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది. విద్యుత్‌ శాఖలో ఏఈగా పనిచేస్తున్న మేడి రమేశ్ సతీమణి మేడి ప్రియదర్శిని ప్రస్తుతం బహుజన సమాజ్‌ పార్టీ నకిరేకల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో రమేశ్‌ ఈ నియోజవకర్గం నుంచి బీఎస్పీ తరపున పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇటు ముంద‌స్తు హ‌డావుడి అటు టికెట్ల కోసం ప్ర‌య‌త్నాలు బిజీబిజీగా జ‌రుగుతున్నాయ‌ని టాక్ వినిపిస్తోంది.
Tags:    

Similar News