ఇన్నాళ్లకు కొంత ఊరట !

Update: 2022-02-22 23:30 GMT
ఎప్ప‌టి నుంచో శ్రీ‌కాకుళం జిల్లా,వంశ‌ధార ప్రాజెక్టు (ఫేజ్ 2) నిర్వాసితుల‌కు సంబంధించిన కొన్ని స‌మ‌స్య‌లు అప‌రిష్కృతంగా ఉన్నాయి.గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో నిర్వాసితుల‌కు సంబంధించి ప‌రిహారం చెల్లింపుల్లో చాలా తాత్సారం జ‌రిగింద‌న్న‌ది ఓ వాస్త‌వం.అదేవిధంగా ఆ రోజు అధికార దుర్వినియోగం జ‌రిగినా అక్క‌డి పాల‌కొండ ఎమ్మెల్యే విశ్వ‌స‌రాయి క‌ళావ‌తి(వైసీపీ),మ‌రో ఎమ్మెల్యే క‌ల‌మ‌ట వెంక‌ట ర‌మ‌ణ(పాత‌ప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం,వైసీపీలో గెలిచి టీడీపీకి వెళ్లారు) విప‌క్ష హోదాలో ఉండి కూడా పూర్తి స్థాయిలో ఉద్య‌మించి,నిలువ‌రించ‌లేక‌పోయారు.

ఇదే స‌మ‌యంలో మాన‌వ హ‌క్కుల సంఘంతో స‌హా ఇంకొన్ని ప్ర‌జా సంఘాలు సీన్ లోకి వ‌చ్చి న్యాయ‌పోరాటం చేశాయి.వాటి ప్ర‌య‌త్నం కాస్త ఫ‌లించిన దాఖ‌లాలు కూడా ఉన్నాయి.

హైకోర్టు ఉత్త‌ర్వుల నేప‌థ్యంలో కొంత వెన‌క్కు త‌గ్గిన ప్ర‌భుత్వంత త‌రువాత పంట పొలాలు స్వాధీనం చేసుకునే క్ర‌మంలో ప్రాజెక్టు ప‌నులు చేప‌ట్టే నెపంతో రైతుల‌ను  ముంపు గ్రామాల నుంచి ఖాళీ చేయించే క్ర‌మంలో ప‌లు వివాదాలు చోటు చేసుకున్నాయి.  ముఖ్యంగా నిర్వాసితుల‌కు క‌నీస సౌక‌ర్యాలు క‌ల్పించ‌కుండానే ప్రాజెక్టు నిర్మాణం పేరిట త్యాగాలు చేయాలంటూ  ఆ రోజు అధికారులు మ‌రియు పోలీసులు ప్ర‌వ‌ర్తించారు.

ప్రాజెక్టు ప్ర‌భావిత ముంపు ప్రాంతాల‌కు సంబంధించి నెలకొన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌యమై చంద్ర‌బాబు కొంత సానుకూలంగా ఉన్నా  ప్రాజెక్టు ప‌నులు వేగ‌వంతం చేయాల‌న్న త‌లంపుతో నిర్వాసితుల‌కు న్యాయం చేయ‌లేక‌పోయారు. స్థానిక నాయ‌క‌త్వం కూడా ప‌రిహారం ఇప్పిస్తామంటూ,అడిగినంత మేర ఇప్పిస్తామంటూ నిర్వాసితులు ఊరించి ఊరించి విసిగించారు. ఆఖ‌రికి  ముంపు గ్రామాల‌ను ఆ రోజు ఖాళీ చేయించారు.

దీంతో హిర‌మండ‌లంలో కొన్ని  గ్రామాలు, పాతప‌ట్నంలో కొన్నిగ్రామాలు, ఇంకా ఎల్ ఎన్ పేట ప‌రిధిలో ఉన్న  కొన్ని గ్రామాలు ప్రాజెక్టు ప‌రిధిలో ఉన్న వాటిలో చాలా ప్రాంతాలు ఎన్నో అవ‌స్థ‌లు ప‌డ్డాయి. ఓ విధంగా చెప్పాలంటే పంట‌లు కోల్పోయి రోడ్డున ప‌డిపోయిన బాధిత రైతుల‌కు ఆ రోజు స‌రిగా న్యాయం జ‌ర‌గ‌లేదు.

తాజాగా రెండు వంద‌ల కోట్ల రూపాయ‌లు నిర్వాసితుల‌కు చెల్లించే నిమిత్తం ప్రభుత్వం విడుద‌ల చేసింది. ఈ మొత్తాన్ని అతి త్వ‌ర‌లో పంపిణీ చేస్తామ‌ని డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ దాసు చెబుతున్నారు.ఇదొక్క‌టే ఈ ఎపిసోడ్ లో ఊర‌టనిచ్చే విష‌యం.అయినా కూడా నిర్వాసితుల కాల‌నీల్లో మౌలిక వ‌సతుల అభివృద్ధి, బ‌డి,గుడి నిర్మాణం, ఇంకా ఇంకొన్ని ప‌నులు చేప‌ట్టాల్సి ఉంది.వీటిని త్వ‌ర‌తిగ‌తిన చేప‌ట్టేందుకు సీఎం సుముఖ‌త చూపితే మేలు అన్న‌ది నిర్వాసితుల త‌ర‌ఫున అభ్య‌ర్థ‌న.


    
    
    

Tags:    

Similar News