250 కోట్ల స్కాం..ఐసీఐసీఐ సార‌థి అరెస్టే లేటు

Update: 2018-04-08 05:56 GMT
పంజాబ్ నేషనల్‌ లో బ్యాంకు (పీఎన్‌ బీ)లో దాదాపు రూ.14 వేల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి ఇటు సీబీఐతో పాటు అటు ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్, ఆదాయం పన్ను విభాగం ఎన్ని నోటీసులు జారీచేసినప్పటికీ అతను హాంకాంగ్ నుంచి భారత్‌ కు వచ్చేందుకు నిరాకరిస్తుండటం, అలాగే దేశంలోని వివిధ బ్యాంకులకు దాదాపు రూ.9 వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాతో పాటు ఆర్థిక నేరాలకు పాల్పడి బ్రిటన్‌ కు పారిపోయిన ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) మాజీ కమిషనర్ లలిత్ మోడీ - ఆయుధాల డీలర్ సంజయ్ భండారీని స్వదేశానికి రప్పించేందుకు దర్యాప్తు అధికారులు నానా తంటలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ ఉదంతాలతో గుణపాఠాలు నేర్చుకున్న సీబీఐ అధికారులు మరోసారి అటువంటి పరిస్థితి తలెత్తకుండా నిరోధించేందుకే ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రైవేటు రంగంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ - సీఈవో చందా కొచ్చర్‌ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవుతోంద‌ని తెలుస్తోంది.

వీడియోకాన్ గ్రూపునకు 2012లో అక్రమంగా రూ.3,250 కోట్ల రుణాన్ని మంజూరు చేసి క్విడ్ ప్రోకోకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చందా కొచ్చర్‌ తో పాటు ఆమె భర్త - నూపవర్ రెన్యువబుల్స్ సంస్థ అధిపతి దీపక్ కొచ్చర్ - వీడియోకాన్ గ్రూపు సంస్థల అధిపతి వేణుగోపాల్ ధూత్ విదేశాలకు పారిపోకుండా నిరోధించేందుకు వీలుగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దేశంలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేస్తూ లుకౌట్ సర్క్యులర్ (ఎల్‌ వోసీ)లను జారీ చేసింది. దీనిని బట్టి చూస్తుంటే సీబీఐ అధికారులు రేపో మాపో ఈ ముగ్గురినీ అరెస్టు చేయవచ్చన భావన కలుగుతుంద‌ని మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఇటీవలి కాలంలో పలువురు ఆర్థిక నేరగాళ్లు దేశం నుంచి జారుకున్న నేపథ్యంలో సీబీఐ ముందు జాగ్రత్త చర్యగా ఈ లుకౌట్ నోటీసులు జారీ చేసింది.

 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నేతృత్వంలోని 20 బ్యాంకుల కన్సార్టియం నుంచి పొందిన రూ.40 వేల కోట్ల రుణంలో భాగంగా వీడియోకాన్ గ్రూపు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.3.250 కోట్ల రుణాన్ని అందుకున్నది. చందా కొచ్చర్ అక్రమంగా ఈ రుణాన్ని మంజూరుచేసి క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారన్న ఆరోపణలపై సీబీఐ అధికారులు గత వారం విచారణ చేపట్టి ఆమె భర్త దీపక్‌తో పాటు వేణుగోపాల్ ధూత్‌ పై ప్రాథమిక కేసు నమోదు చేసిన విషయం విదితమే. వీడియోకాన్ రుణ వ్యవహారంపై గత వారం సీబీఐ విచారణ చేపట్టి దీపక్ కొచ్చర్, వేణుగోపాల్ ధూత్‌పై ప్రాథమిక కేసు నమోదు చేయడంతో పాటు దీపక్ సోదరుడైన రాజీవ్ కొచ్చర్‌ను గురువారం నిర్బంధించిన విషయం విదితమే. వీడియోకాన్ గ్రూపు సంస్థలతో గల సంబంధాలపై రాజీవ్‌ను సీబీఐ విస్తృతంగా ప్రశ్నించగా, ఆ సంస్థతో తనకు వ్యాపార సంబంధాలున్న మాట నిజమేనని, కానీ అది ఎన్నో ఏళ్ల‌ క్రితం సంగతని రాజీవ్ అంగీకరించాడు. కాగా, తమ మధ్య ఎటువంటి వ్యాపార సంబంధాలు లేవని అటు ఐసీఐసీఐ బ్యాంకు ఇటు రాజీవ్ కొచ్చర్ నేతృత్వంలోని అవిస్తా సంస్థ చెబుతున్నాయి. దీంతో దీపక్ కొచ్చర్ ఆధీనంలోని నూపవర్ రెన్యువబుల్స్‌లో పెట్టుబడులు పెట్టిన మారిషస్ సంస్థ డీహెచ్ హోల్డింగ్ రెన్యువబుల్స్ లిమిటెడ్‌కు వేణుగోపాల్ ధూత్ ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్నారా? లేదా? అనే అంశంపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. వీడియోకాన్ గ్రూపునకు ఐసీఐసీఐ బ్యాంకు రూ.3,250 కోట్లు, రూ.660 కోట్ల చొప్పున రెండు దఫాల్లో రుణమిచ్చిన ప్రతిసారి దీపక్ కొచ్చర్‌కు చెందిన నూపవర్ రెన్యువబుల్స్‌లో మారిషస్ సంస్థ డీహెచ్ హోల్డింగ్ రెన్యువబుల్స్ లిమిటెడ్ 10 శాతం (వరుసగా రూ.325 కోట్లు, రూ.66 కోట్లు) చొప్పున పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వీడియోకాన్ గ్రూపునకు 2012లో ఐసీఐసీఐ బ్యాంకు ఇచ్చిన రూ.3,250 కోట్ల రుణ వ్యవహారంలో ఆ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో చందా కొచ్చర్ మరిది రాజీవ్ కొచ్చర్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు శనివారం వరుసగా మూడో రోజు కూడా ప్రశ్నించారు. సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న అవిస్తా అడ్వైజరీ సర్వీసెస్ సంస్థ వ్యవస్థాపకుడైన రాజీవ్ కొచ్చర్ శనివారం ఉదయం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో గల సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. వీడియోకాన్ రుణ పునర్‌వ్ యవస్థీకరణలో అవిస్తా పోషించిన పాత్ర గురించి దర్యాప్తు అధికారులు ఈ సందర్భంగా రాజీవ్‌ను ప్రశ్నించారని, ప్రత్యేకించి ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రుణాన్ని పొందడంలో వీడియోకాన్ గ్రూపునకు అందించిన సాయం గురించి ఆరా తీశారని అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే వీడియోకాన్ గ్రూపు అధినేత వేణుగోపాల్ ధూత్‌కు సన్నిహిత సహచరుడైన మహేష్ చంద్ర పుగాలియాను కూడా సీబీఐ ప్రశ్నించింది.

Tags:    

Similar News