పాపం పవన్.. పట్టించుకోని నాయకులు?

Update: 2019-10-31 04:40 GMT
పార్ట్ టైం పొలిటీషియన్ అని ఏపీ రాజకీయాల్లో ముద్రపడ్డ జనసేనాని పవన్ కళ్యాణ్ వైఖరికి ఇప్పుడూ అందరూ దూరంగా జరుగుతున్నారు. తన తెరవెనుక మిత్రుడు చంద్రబాబు కూడా హ్యాండ్ ఇచ్చేలానే కనిపిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇక బీజేపీ రానేరాను అని చెప్పేసింది. ఇక అంతగా బలం లేని కమ్యూనిస్టులు వచ్చినా ఒకటే రాకున్నా ఒక్కటే. ఇదీ మన జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ఏపీ ఇసుక కొరతకు వ్యతిరేకంగా నిర్వహించ తలపెట్టిన లాంగ్ మార్చ్ కథ..

 చాలా రోజుల తర్వాత ఏపీలో మళ్లీ పోరుబాట పట్టిన పవన్ కళ్యాణ్ కు మద్దతు కరువవడం చర్చనీయాంశంగా మారింది. ఏపీలోని ప్రధాన పార్టీలు టీడీపీ, బీజేపీ, ఇతర పార్టీల మద్దతు కోసం స్వయంగా ఫోన్ చేశారు పవన్. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పవన్ నిరసనలో పాలుపంచుకోం అని కుండబద్దలు కొట్టారు. ఇక బెస్ట్ ఫ్రెండ్ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న చంద్రబాబు కూడా పవన్ కు మైలేజ్ తెచ్చే ఈ లాంగ్ మార్చ్ లో తానెందుకు పాల్గొనాలని దూరంగా ఉండబోతున్నారట.. మొత్తానికి ఏపీలో బలం పుంజుకోని జనసేనాని పవన్ నిర్వహిస్తున్న సభకు ఇప్పుడు ప్రధాన పక్షాలు దూరంగా ఉండడంతో ఇది ఎంతమేరకు సక్సెస్ అవుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

మొన్నటి ఎన్నికల వేళనే జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరును ప్రజలు తిరస్కరించారు. అధికార టీడీపీని విమర్శించకుండా ప్రతిపక్ష వైసీపీని తిట్టడం.. చంద్రబాబు, లోకేష్ పోటీచేసే ప్రాంతాల్లో ప్రచారం చేయకపోవడం.. చంద్రబాబుకు బీటీంగా వ్యవహరించడం  ఇవన్నీ ప్రజల్లోకి వైసీపీ బలంగా తీసుకెళ్లడంతో పవన్ ఘోరంగా ఓడిపోయారు. కనీసం ఆయన కూడా గెలవలేకపోయారు.

అయితే ఓడాక కూడా మళ్లీ చంద్రబాబు చేపట్టిన ఇసుక కొరత ఉద్యమాన్ని పవన్ అందిపుచ్చుకొని వైసీపీని ఎండగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.  టీడీపీ ఇన్నాళ్లు చేస్తున్న ఆందోళనలకు పవన్ మద్దతివ్వలేదు. కనీసం లోకేష్ గుంటూరులో నిర్వహించిన దీక్షకు సైతం సంఘీభావం తెలుపలేదు. ఎంతసేపు తనను అందరూ ఫాలో కావాలి కానీ.. తాను ఎవ్వరినీ ఫాలో కానని.. అమావాస్యకు, పౌర్ణమికి మాత్రమే స్పందించి అలా ధర్నా చేసి ఇలా వెళ్లిపోయే పవన్ ను ఎవ్వరూ విశ్వసించడం లేదు. ఇప్పుడు చంద్రబాబు సహా ఎవ్వరూ పవన్ ను నమ్మి ఆయన వెంట నడువకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

పార్ట్ టైం పాలిటిక్స్.. ఇతరుల ఆందోళనలను హైజాక్ చేయడం.. ఇతర పార్టీలకు మేలు చేసేలా పవన్ రాజకీయాలు ఉండడంతోనే పవన్ ను ఇప్పుడు అందరూ దూరం పెడుతున్నారన్న చర్చ సాగుతోంది. ఆయనకు  తెరవెనుక దోస్త్  అనుకుంటున్న చంద్రబాబు సహా బీజేపీ కూడా దూరంగా పెడుతోంది. విశాఖలో పవన్ నవంబర్ 3న తలపెట్టిన లాంగ్ మార్చ్ కు ప్రతిపక్షాల నుంచి స్పందన లేకపోవడం పవన్ చేసుకున్న స్వయంకృతాపరాధమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Tags:    

Similar News