ఆత్మహత్య చేసుకుంటాం.. డీజీపీదే బాధ్యత : బుద్ధా వెంకన్న

Update: 2021-01-07 11:04 GMT
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై నిత్యం దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఏపీ టీడీపీ నేతలు గురువారం గవర్నర్ హరిచందన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. గవర్నర్ ను కలిసిన వారిలో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌, తెనాలి శ్రవణ్ కుమార్, వర్ల రామయ్య, బుద్దా వెంకన్న ఉన్నారు. ఈ సందర్భంగా వీరు పలు ఆరోపణలు చేశారు.

ఏపీలో ప్రతిరోజూ ఆలయాలపై దాడులు, దేవతా విగ్రహాల ధ్వంసం జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా 140 జరిగాయని ఆరోపించారు. గత 19 నెలలుగా దేవాలయాలపై జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు.

ఈ ఘటనలపై ప్రశ్నిస్తుంటే తమపై కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. డీజీపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబుపై కేసులు పెట్టాలని చూస్తున్నారని, అది జరిగితే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. ఒకవేళ కేసు పెడితే సీఎం జగన్ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటామని అన్నారు.  

Tags:    

Similar News