బీఅలెర్ట్‌: శ్రీ‌నివాస్ ప్రాణాల‌కు ముప్పు!

Update: 2018-10-27 07:55 GMT
విశాఖ విమానాశ్ర‌యంలో ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై క‌త్తితో దాడి చేసిన వైనం తెలిసిందే. ఎయిర్ పోర్ట్‌లో వెయిట‌ర్ గా ప‌ని చేసే శ్రీ‌నివాస్ అనే యువ‌కుడు కోడి పందేల‌కు ఉప‌యోగించే క‌త్తితో దాడికి పాల్ప‌డ్డాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్య‌వ‌హారం భారీ సంచ‌ల‌నానికి కార‌ణ‌మైంది.

వాస్త‌వ కోణంలో చూసిన‌ప్పుడు జ‌గ‌న్ మీద క‌త్తితో దాడి చేయ‌టం అన్న‌ది చాలా చిన్న కేసు. శిక్ష కూడా పెద్ద‌గా ప‌డే అవ‌కాశం లేద‌న్న మాట న్యాయ‌వ‌ర్గాలు చెబుతున్నాయి. కోడి పందేల‌కు ఉప‌యోగించే క‌త్తితో దాడి చేయ‌టం.. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ అలెర్ట్ గా ఉండ‌టం.. ప‌క్క‌కు జ‌ర‌గ‌టంతో అత‌డి భుజానికి గాయ‌మైంది.

గాయం కూడా చిన్న‌దే. కాకుంటే.. దాడి జ‌రిగిన వ్య‌క్తికి ఉన్న ప్రాధాన్య‌త వ‌ల్ల ఈ వ్య‌వ‌హారం పెద్ద‌దిగా మారి.. సంచ‌ల‌నంగా మారింది. పందెం కోళ్ల‌కు క‌ట్టే క‌త్తుల‌కు విషం పూసే అల‌వాటు ఉన్నందున జ‌గ‌న్ మీద దాడి చేసిన క‌త్తికి కూడా అలాంటి ర‌సాయ‌నాలు ఏమైనా పూసారా? అన్న దానిపై ప‌రీక్ష‌లు జ‌రుపుతున్నారు.

దానికి సంబంధించిన రిపోర్ట్ రావాల్సి ఉంది. వైద్యుల సూచ‌న మేర‌కు ప్ర‌స్తుతానికి జ‌గ‌న్ విశ్రాంతి తీసుకుంటున్నారు. మ‌రోవైపు.. ఈ వ్య‌వ‌హారంపై రెండు వ‌ర్గాలు విప‌రీతంగా ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు.. నింద‌లు వేసుకుంటున్న ప‌రిస్థితి. విమానాశ్ర‌యంలో విప‌క్ష నేత మీద జ‌రిగిన దాడికి సంబంధించి త‌మ‌కే మాత్రం బాధ్య‌త లేద‌న్న‌ట్లుగా అధికార‌ప‌క్షం వ్య‌వ‌హ‌రిస్తుంటే.. అధికార‌ప‌క్షం త‌ప్పును ఎత్తి చూపే ప్ర‌య‌త్నం చేస్తోంది విప‌క్షం.

ముందుగా ఊహించిన‌ట్లే ఈ వ్య‌వ‌హారంపై పెద్ద ఎత్తున రాజ‌కీయ దుమారం రేగుతోంది. దాడికి పాల్ప‌డిన శ్రీ‌నివాస్ జ‌గ‌న్ కు వీరాభిమాని అని.. ఆయ‌న‌పై సానుభూతి పుట్టాల‌నే ఉద్దేశంతోనే దాడి చేసిన‌ట్లుగా ప్ర‌చారం షురూ చేశారు. అంతేకాదు.. జ‌గ‌న్ ను ఫ్లెక్సీలు పెట్టే వారంటూ సోష‌ల్ మీడియాలో ఎదురుదాడిని.. దాడి జ‌రిగిన గంట నుంచే మొద‌లెట్టారు.

ఇదిలా ఉంటే.. శ్రీ‌నివాస్ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్య‌క్తేన‌ని.. అత‌డ్ని కావాల‌నే పుర‌మాయించార‌న్న‌ది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాద‌న‌. మొత్తానికి ఇరు వ‌ర్గాల మ‌ధ్య నింద‌లు.. ప్ర‌తి నింద‌ల జోరు అంత‌కంత‌కూ పెరుగుతోంది. మ‌రోవైపు పోలీసుల విచార‌ణ‌కు సంబంధించిన వీడియో క్లిప్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.
ఇందులో తాను జ‌గ‌న్ అభిమానిన‌ని శ్రీ‌నివాస్ చెప్పిన‌ట్లుగా ఉంది. ఈ కేసు విచార‌ణ క్ర‌మాన్ని చూస్తే.. ఇప్ప‌ట్లో శ్రీ‌నివాస్ బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం లేదంటున్నారు. ఒక‌వేళ విడుద‌ల అయినా అత‌డు మాట మారిస్తే త‌మ‌కే న‌ష్ట‌మ‌న్న భ‌యం అధికార‌ప‌క్షంలో ఉందంటున్నారు.

ఇదిలా ఉంటే.. ఎటు చూసినా శ్రీ‌నివాస్ కార‌ణంగా ఎవ‌రికో ఒక‌రికి న‌ష్టం.. లాభం ఖాయం. ఈ నేప‌థ్యంలో అత‌డి ప్రాణాల‌కు ముప్పు పొంచి ఉంద‌న్న అభిప్రాయం బ‌లంగా వినిపిస్తోంది. శ్రీ‌నివాస్ నోరు విప్పి ఎలా మాట్లాడినా ఎవ‌రో ఒక‌రికి న‌ష్టం కావ‌టంతో అత‌డ్ని నోటిని శాశ్వితంగా మూయించే దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రిగే అవ‌కాశం ఉంద‌న్న అనుమానాల్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.


Tags:    

Similar News