వైసీపీ మంత్రులకు లోన్ యాప్ బెదిరింపులు

Update: 2022-07-29 15:00 GMT
లోన్ యాప్.. ఇప్పుడు ఈ నిర్వాహకుల ధాటికి చాలా మంది బాధితులుగా మారిపోతున్నారు. మామూలు ప్రజలు వీరి వేధింపులకు ఏకంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. చాలా మంది మహిళల మాన ప్రాణాలతో ఈ లోన్ యాప్స్ ఆడుకుంటున్నాయి. వీరి ఖాతాలో తాజాగా వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు కూడా చేరడం కలకలం రేపుతోంది. వైసీపీ మంత్రికే ఫోన్ చేసి లోన్ యాప్ డబ్బులు కట్టమని దబాయించిన వైనం విస్తుగొలుపుతోంది.

తాజాగా నెల్లూరు జిల్లాలో లోన్ యాప్ ఆగడాలు శృతిమించిపోయాయి. ఏకంగా వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితోపాటు పలువురు వైసీపీ కీలక నేతలకు ఈ లోన్ యాప్ నిర్వాహకులు షాకిచ్చారు. తనకు ఎదురైన లోన్ యాప్ ఆగడాలపై మంత్రి కాకాణి పోలీసులకు ఫిర్యాదు చేసి పట్టించిన వైనం మరిచిపోకముందే వైసీపీకే చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ ను సైతం తాజాగా లోన్ యాప్ మాఫియా తీవ్రంగా బెదిరించడం కలకలం రేపుతోంది.

నెల్లూరులో ఇప్పటికే మంత్రి కాకాణిని ముప్పుతిప్పలు పెట్టిన లోన్ మాఫియా.. తాజాగా మాజీ మంత్రి అనిల్ నుకూడా వదలడం లేదు. అనిల్ ఓ కార్యక్రమంలో బిజీగా ఉండగా.. లోన్ యాప్ టెలీకాలర్ నుంచి ఆయనకు కాల్ వచ్చింది. అనిల్ కు కాల్ చేసి అశోక్ అనే వ్యక్తి 8 లక్షలు రుణం తీసుకున్నాడని.. ఆయన మీ బావమరిదిగా సంతకం చేసి మీ పేరు, ఫోన్ నంబర్ ఇచ్చాడని బ్యాంకు నుంచి ఓ లేడీ ఫోన్ చేసి దబాయించింది. మీ బావమరిదినే అని.. మీరే కట్టాలని ఏకంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ ను బెదిరించింది. ఆయన తీసుకున్న రూ.8 లక్షలు ఎవరు కడుతారంటూ అనిల్ ను బెదిరించింది. తాను మాజీ మంత్రిని అని చెప్తున్నా ఆమె వినిపించుకోకుండా గదమాయించడం అందరినీ విస్తుపోయేలా చేసింది. చివరకు మరో టెలీకాలర్ కూడా బ్యాంకు నుంచి ఫోన్ చేసి అనిల్ కుమార్ కు 20 సార్లు కాల్ చేసి లోన్ కట్టాలని బెదిరించిన తీరు విస్తుగొలుపుతోంది.


వీడియో

ఈ లోన్ యాప్ వ్యవహారంలో అనిల్ కుమార్ తనకు సంబంధం లేదని మొత్తుకుంటున్నా సదురు లోన్ యాప్ వారు వినకుండా టార్చర్ చేసిన ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏకంగా అనిల్ కుమార్ నే మీరిద్దరూ కలిసి డబ్బులు వాడుకొని ఇప్పుడు కట్టనంటే ఎలా అంటూ ఆ లోన్ యాప్ లేడీ రెచ్చిపోయింది. దీంతో మాజీ మంత్రి కూడా చెప్పు తీసుకొని కొడతా అంటూ హెచ్చరించారు.

అయినా ఆ లోన్ యాప్ లేడీ వెనక్కి తగ్గకుండా రెచ్చిపోయింది. తనకు అసలు బావమరిదే లేడని.. తన పేరు వాడుకున్న వాడిని జైల్లో వేయించాలని కూడా అనిల్ సూచించారు. చివరికి బ్యాంకుకు వచ్చి మాట్లాడుతానని చెప్పినా వినకుండా ఆ లోన్ యాప్ టెలీకాలర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది.

ఇలాంటి కాల్స్ మంత్రి కాకాణికి కూడా రావడంతో వీరద్దరూ వేర్వేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఏపీలో అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులకే ఈ దుస్థితి ఏర్పడితే ఇక సాధారణ వ్యక్తుల పరిస్థితి ఏంటని అందరూ విస్తుపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ లోన్ యాప్ ల వేధింపుల వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయని.. మాజీ మంత్రికి వచ్చిన కాల్ ను బట్టి.. ఆ ఆడియోను బట్టి అర్థమవుతోంది.

ఈ లోన్ యాప్ వ్యవహారంలో చెన్నైకి చెందిన కోల్ మాన్ ఫైనాన్స్ కంపెనీకి చెందిన నలుగురు వ్యక్తులను ఈ వ్యవహారంలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ అనిల్ తో టెలీకాలర్ మాట్లాడిన ఆడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Full View
Tags:    

Similar News