తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ బాబు నేరుగా రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వ విషయాల్లో తెరవెనుక కీలక పాత్ర పోషిస్తున్న ఆయన వాటిలోనూ ప్రత్యక్ష ముద్ర ఉండేలా కసరత్తు చేస్తున్నారు. కొద్దికాలం క్రితం పార్టీ కార్యాలయంలో మంత్రులతో సమీక్ష నిర్వహించిన లోకేష్ ఆ తర్వాత అన్ని జిల్లాల జెడ్పీ చైర్మన్‌లతో సమావేశమయ్యారు. తాజాగా సెక్రటేరియట్ లోని మంత్రుల పేషీల్లోని కార్యకలాపాలపై కన్ను వేశారని సమాచారం.
లోకేష్ స్వయంగా ఎంపిక చేసిన వ్యక్తులను మంత్రుల పేషీల్లో మీడియా లైజనింగ్ అధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. ఈ చర్య లోకేష్ రంగలోకి దిగారనే వార్తలకు బలం చేకూరుస్తోంది. ఇంతకాలం వీరు అనధికారికంగా పనిచేస్తుండగా తాజాగా అధికారిక ఉత్తర్వులు ఇచ్చారు. ఈ 20 మంది మీడియా లైజనింగ్ అధికారులుకు నెలకు రూ.20 వేల చొప్పున వేతనాన్ని చెల్లించనున్నారు.
ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు పేషీలో మినహా మిగతా మంత్రులందరి పేషీల్లోనూ ఈ అధికారులు పనిచేస్తారు. మీడియా లైజనింగ్ అధికారుల నియామక ఫైలును తొలుత యనమల పక్కన పెట్టారు. అయినప్పటికీ లోకేష్ పట్టుబట్టడంతో వారి నియామకానికి ఎస్ అన్నట్లు సమాచారం. అయితే తన పేషీలో అవసరం లేదని ఆర్థికమంత్రి యనమల స్పష్టం చేయడంతో ఆయన ఒక్కరికి తప్ప మిగతా మంత్రుల పేషీల్లో నియమించారు.
ఆయా మంత్రుల పేషీల్లో పనిచేసే మీడియా లైజనింగ్ అధికారులందరూ మంత్రుల రోజువారీ కార్యకలాపాలను, ఎవరెవరు వచ్చి మంత్రులను కలుస్తున్నారనే వివరాలను సేకరిస్తారు. అనంతరం నివేదిక రూపేణా లోకేష్‌కు తెలియజేయనున్నారు. ఈ విధంగా మంత్రుల పనితీరును కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారని సమాచారం. అందులో భాగంగా లోకేష్ అందించే నివేదికలను కూడా సీఎం పరిశీలించనున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.