బాబు సంతకం చేయాల్సిన ఫైల్ మీద చినబాబు సంతకం!?

Update: 2020-09-21 05:30 GMT
ఫైబర్ గ్రిడ్ పేరుతో చంద్రబాబు సర్కారు భారీగా ప్రజా నిధుల్ని స్వాహా చేసిందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఒకే కనెక్షన్ తో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ ను చౌకగా అందించటం.. అందులోనే కేబుల్ టీవీ ప్రసారాల్ని సైతం అందించే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును 2015లో బాబు సర్కారు ప్రకటించటం తెలిసిందే. దీనికి సంబంధించిన పెట్టుబడులు.. మౌలిక సదుపాయాల కల్పన శాఖ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ను ఏర్పాటు చేశారు.

ఈ శాఖను తాను అధికారంలో ఉన్న ఐదేళ్లలోనూ చంద్రబాబే నిర్వహించారు. ఇదిలా ఉంటే.. టెరా సాఫ్ట్ అనుబంధ సంస్థ టెరా స్టోన్ సొల్యూషన్స్ లిమిటెడ్ డైరెక్టర్ గా ఉన్న వేమూరి హరికృష్ణప్రసాద్ ఏపీ ప్రభుత్వ ఐటీ సలహాదారుగా నియమించుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే తూర్పు గోదావరి జిల్లాలో ఈపాస్ యంత్రాల సరఫరాలో గోల్ మాల్ చేసిన టెరా సాఫ్ట్ ను ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ బ్లాక్ లిస్టులో పెట్టింది. అయినప్పటికీ ఫైబర్ గ్రిడ్ తొలిదశ టెండర్ ను వేమురి సంస్థకు అప్పజెప్పటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. రూల్ ప్రకారం ఏదైనా ఫైల్ మీద సంబంధిత శాఖను చూసే మంత్రి ఫైల్ మీద సంతకం చేయటం రివాజు. కొన్ని విషయాల్లో మాత్రం ముఖ్యమంత్రే సంతకం పెట్టేస్తుంటారు. అలాంటి సమయంలోనూ సంబంధిత మంత్రి సంతకం అవసరం. అంతే తప్పించి.. తనకు ఏ మాత్రం సంబంధం లేని మంత్రి సంతకం చేయటాన్ని అంగీకరించారు. తాజాగా బయటకు వస్తున్న ఆధారాల ప్రకారం బాబు ప్రభుత్వంలో ఐటీ.. పంచాయితీరాజ్ శాఖల్ని చూసిన లోకేశ్.. ఏపీఎస్ఎఫ్ఎల్ కు సంబంధించిన ఫైల్ మీద సంతకాలు చేయటాన్ని తప్పు పడుతున్నారు.

భారత్ నెట్ ఫేజ్ 2కి సంబంధించిన ఎంవోయూ ఫైల్ పై 2017 నవంబరు 12న నారా లోకేశ్ సంతకం చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫైల్ వివరాలు బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు చూసే శాఖలకు సంబంధించిన ఫైల్ పైన మంత్రి లోకేశ్ సంతకాలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. మరి.. దీనిపై చినబాబు ఏం చెబుతారో చూడాలి.
Tags:    

Similar News