అటు వైపు చూడు జగన్... కొత్త చికాకులు ఎన్నో...?

Update: 2022-01-28 06:51 GMT
కొత్త ఎపుడూ వింతే పాత మాత్రం రోతే. కానీ రాజకీయ నాయకులు జనాలకు ప్రతీసారీ కొత్త చూపించాలనుకుంటారు. ఇపుడు ప్రజల అభిరుచి కూడా మారుతోంది కాబట్టి కొత్తగా తాము ఏదో చేశామని నేతాశ్రీలు చెప్పుకునేందుకు  చాలా చేస్తూంటారు. అయితే అందులో శాశ్వతంగా నిలిచే పనులు కూడా ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్తగా ఆలోచించి అడుగులు ముందుకు వేయకపోతే అసలుకే మోసం వస్తుంది.

ఇపుడు కొత్త జిల్లాల‌ విషయంలో ఏపీ సర్కార్ ముందు అనేక ప్రశ్నలు ఉన్నాయి. వాటికి తగిన జవాబులు ఉంచుకోకపోతే ఈ ప్రశ్నలే రేపటి రోజున పెను సమస్యలు అవుతాయి. కొత్త జిల్లాలు అంటేనే కొత్త తలనొప్పులని కోరి తెచ్చుకొవడం. ఉమ్మడి ఏపీని ఎందరో మహనీయులు ముఖ్యమంత్రులుగా ఎలారు. వారెవరూ ఈ తేనె తుట్టెను కదపలేదు. ఎందుచేత అంటే వారికి తెలుసు. వచ్చే ఆ కొత్త కొత్త  సమస్యలు ఎలాంటివో.

అయితే విభజన తరువాత తెలంగాణా ప్రభుత్వం కొత్త జిల్లాలు అంటూ వడివడిగా అడుగులు వేసింది. ఇప్పటికి ఆరేళ్ళ క్రితం కొత్త జిల్లాలను ప్రకటించింది. అయితే అవి సవ్యంగా పనిచేస్తున్నాయా. గాడిన పడ్డాయా అంటే లేదు అనే చెప్పాలి. ఇప్పటికీ తెలంగాణాలో కార్యకలాపాలు అన్నీకూడా  ఉమ్మడి జిల్లాల్లోనే సాగడం చిత్రం. మరో వైపు చూస్తే తాజాగా జిల్లాల‌ వారీగా ఉద్యోగుల విభజన చాలా గందరగోళంగా తయారైంది.

దాంతో ప్రభుత్వం మీదకు ఉద్యోగులు సమర శంఖమే పూరించారు. ఇక సీనియర్ ఉద్యోగులు పాత జిల్లాలు కోరుకుంటే అరకొర సదుపాయాలు ఉన్న కొత్త జిల్లాలు జూనియర్లకు వెళ్తున్నాయి. దీంతో సమతూల్యత పూర్తిగా  లోపించింది. అదే విధంగా నిరుద్యోగులకు ఈ పరిణామాలు  గొడ్డలి పెట్టుగా మారాయి. ఎందుకంటే సీనియర్లు దండీగా ఉన్న జిల్లాల్లో కొత్త పోస్టులకు ఎపుడూ అవకాశం ఉంటోంది. వారిలో అత్యధికులు రిటైర్మెంట్ కి చేరువగా ఉంటారు కాబట్టి.

అదే జూనియర్లు ఉన్న చోట పోస్టులు ఖాళీ కావు. దాంతో కొత్త జిల్లాల్లో దావానలంగా నిరుద్యోగం పెరిగిపోతోంది. మరి ఈ అసంతృప్తి సర్కార్ మీదకే వస్తుంది. ఆ విధంగా కొత్త జిల్లాల ప్రయోగం సాకారం కాని సీన్ పక్కనే తెలంగాణాలో కనిపిస్తోంది. ఇక కొత్త జిల్లాల్లో ఈ రోజుకూ మౌలిక సదుపాయలను కల్పించలేక తెలంగాణా నానా రకాలుగా  ఆపసోపాలు పడుతోంది. తెలంగాణా విభజన తరువాత ధనిక రాష్ట్రంగా ఉంది.

మరి ఆ రాష్ట్రానికే భవనాలు, అదనపు సిబ్భంది, ఇతర సదుపాయాలు కల్పించడం కష్టమైనపుడు అప్పులతో తిప్పలు పడుతున్న ఏపీ కొత్త జిల్లాల కోసం వేల కోట్ల రూపాయలు సమకూర్చడం సాధ్యమయ్యే పనేనా అంటే జవాబు ఉందా. ప్రజల వద్దకు పాలన అంటూ అందమైన నినాదాలు ఇచ్చేసి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటే ప్రయోజనం ఉండకపోతే విపక్షాల చేతికి కొత్త అస్త్రం అందించినట్లు అవుతుంది.

ఒక విధంగా ఇది పులితో స్వారీ. ఈ విషయంలో తెలంగాణాలో జరుగుతున్న పరిణామాలను  అక్కడి చేదు అనుభవాలను గుణపాఠంగా తీసుకోకపోతే మాత్రం ఏపీ సర్కార్ అంతకు మించి కొత్త ఇబ్బందులు కోరి తెచ్చుకున్నట్లే అవుతుంది అంటున్నారు. ఒక విధంగా కొత్త జిల్లాలే 2024 ఎన్నికల్లో ఏపీ రాజకీయాలను పూర్తిగా మార్చేసే సీన్ కూడా ఉంది అంటున్నారు.
Tags:    

Similar News