త‌మిళులు..ర‌జ‌నీని సీఎంగా నో అంటున్నారా?

Update: 2017-06-25 06:35 GMT
అమ్మ అకాల మ‌ర‌ణంతో త‌మిళ రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న ప‌రిస్థితులు తెలిసిందే. వ‌రుస సంచ‌ల‌నాల‌తో.. అనిశ్చిత రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఆ రాష్ట్రంలో అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. అధికార‌పార్టీలో నెల‌కొన్న అధిపత్య పోరు.. గ్రూపు రాజ‌కీయాలు ఒక ఎత్తు అయితే.. త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ త్వ‌ర‌లో పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వ‌నున్నారంటూ వ‌స్తున్న వార్త‌ల‌తో అక్క‌డి రాజ‌కీయం హీటెక్కిపోయింది.

ఇలాంటి వేళ‌.. చెన్నై ల‌యోల కాలేజ్ పూర్వ విద్యార్థుల నేతృత్వంలో సంస్కృతి సంప్ర‌దాయ ప్ర‌జా మండ్రం అప్పుడ‌ప్ప‌డు రాష్ట్రంలో స‌ర్వేలు నిర్వ‌హిస్తుంటుంది. తాజాగా అలాంటి స‌ర్వేనే నిర్వ‌హించి.. ఆ ఫ‌లితాల్ని వెల్ల‌డించారు. వివిద ప్రాంతాల్లోని వివిధ వ‌ర్గాల‌కు చెందిన 5వేల మంది ద‌గ్గ‌ర 874 మంది అభిప్రాయాలు సేక‌రించారు. వీటిని కూర్చి తాజాగా విడుద‌ల చేసిన స‌మాచారం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

తాజా స‌ర్వే ఫ‌లితాల్ని చూస్తే.. రాష్ట్రంలోని రాజ‌కీయ అనిశ్చితిని ప్ర‌తిబింబించేలా రాష్ట్రప‌తి పాల‌న‌కు రాష్ట్రంలో ఎక్కువ‌గా అవ‌కాశాలు ఉన్నాయ‌న్న విష‌యాన్ని 30.2 శాతం మంది న‌మ్ముతున్న‌ట్లుగా చెబుతున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ప‌వ‌ర్ లో ఉన్న అన్నాడీఎంకే కంటే డీఎంకే ప‌వ‌ర్లోకి రావాల‌ని భావిస్తున్న వారి సంఖ్య 47 శాతం ఉండ‌టం గ‌మ‌నార్హం.

ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో డీఎంకే ఎప్పుడూ ముందు ఉంటుంద‌న్న అభిప్రాయాన్ని ప్ర‌జ‌లు వ్య‌క్తం చేయ‌గా.. రాష్ట్ర సీఎంగా అన్ని అర్హ‌తలు ఉన్న నాయ‌కుడు డీఎంకే కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు ఎంకే స్టాలిన్ అని 59 శాతం మంది ఓటు వేయ‌టం విశేషం. అదే స‌మ‌యంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కు 11 శాతం మంది మాత్ర‌మే ఓటు వేయ‌టం గ‌మ‌నార్హం. అదే స‌మ‌యంలో అమ్మ‌కు అత్యంత విధేయుడైన మాజీ సీఎం ప‌న్నీర్ సెల్వంకు 13 శాతం మంది సీఎంగా ఓకే చేశారు.

ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి వ‌స్తే విజ‌యం సాధిస్తారా? అన్న ప్ర‌శ్న‌కు అలాంటి ఛాన్సే లేద‌ని 55 శాతం మంది తేల్చేస్తే.. 33 శాతం మంది మాత్రం ఛాన్స్ ఉంద‌ని చెప్పారు. ఇక‌.. త‌మిళ‌నాడులో బీజేపీకి ఛాన్సే లేద‌ని 60 శాతం మంది తేల్చేశారు. ఇక‌.. రాష్ట్రంలో ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి ఎన్నిక‌లు నిర్వ‌హించాలా? అన్న ప్ర‌శ్న‌కు 57 శాతం మంది ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ఓటు వేశారు. ఇక‌.. రాష్ట్రానికి సీఎంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ప‌ళ‌నిస్వామిని ముఖ్య‌మంత్రిగా ప‌ద‌విలో కొన‌సాగే వీలు లేద‌ని 48 శాతం మంది అభిప్రాయ‌ప‌డిన‌ట్లుగా వెల్ల‌డించారు. కోటి ఆశ‌ల‌తో రాజ‌కీయాల్లోకి రావాల‌ని భావిస్తున్న ర‌జ‌నీకి తాజా స‌ర్వే ఫ‌లితాలు షాకిస్తాయ‌న‌టంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News