మోడీ మాటకు.. సామాన్యులు కదిలిపోతున్నారు

Update: 2015-07-11 08:46 GMT
పాలకుల్లో మార్పులు రాకున్నా.. ప్రజల్లో మాత్రం మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో పెట్రోల్‌.. డీజిల్‌ ధరలు రూపాయి పెరిగితే.. పదుల రోజుల తరబడి ఆందోళన చేసేవారు. కానీ.. ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. సబ్సిడీలలో కోత విధించినా.. దానికి సానుకూలంగా స్పందిస్తున్నారు.. పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాకపోతే.. సబ్సిడీలకు ఎందుకు కోత పెడుతున్నామన్న విషయాన్ని వివరంగా వివరిస్తే సరిపోతుంది. ఈ వాదనకు మరింతగా బలం చేకూరుస్తూ తాజాగా ఒక సమాచారం బయటకు వచ్చి ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు తమ గ్యాస్‌ సిలిండర్‌కు సబ్సిడీ వదిలేసుకోవాలని.. అలా వదిలేస్తే పేదలకు మరింత మందికి సాయం చేయొచ్చని.. ప్రభుత్వం మీద ఆర్థిక భారం తగ్గుతుందన్న ప్రకటనకు సానుకూల స్పందన లభిస్తోంది. గ్యాస్‌ మీద సబ్సిడీ వదులుకోవాలంటూ ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపుతో దేశంలోని 10లక్షల మంది తమ గ్యాస్‌ సబ్సిడీని వదులుకున్నట్లుగా సర్కారు చెబుతోంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇలా సబ్సిడీ వదులుకున్న రాష్ట్రాల్లో.. వెనుకబడిన రాష్ట్రాల్లో ఒకటిగా చెప్పే ఉత్తరప్రదేశ్‌ మొదటిస్థానంలో నిలవటం విశేషం. ఈ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 2.09లక్షల మంది తమ సబ్సిడీని రద్దు చేసుకున్నారు. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర నిలిచింది.

ప్రభుత్వం ఇప్పటివరకూ ప్రతి వినియోగదారుడికి ఏడాదికి పన్నెండు సిలిండర్లు చొప్పున సబ్సిడీ మీద అందిస్తున్నాయి. ఇందుకుగాను ప్రతి సిలిండర్‌ మీద రూ.207 సబ్సిడీ భారాన్ని మోస్తోంది. ఇలా మోస్తున్న సబ్సిడీ భారం ఏడాదికి రూ.40వేల కోట్ల మేర ఖజానాపై భారం పడుతోంది.

దీంతో.. సంపన్నులు.. ఆర్థికంగా బలవంతులు తమ గ్యాస్‌ సిలిండర్‌పై ఉన్న సబ్సిడీని స్వచ్ఛందంగా మినహాయించుకునే సదుపాయాన్ని కల్పించారు. దీనికి స్పందన లభించి.. దేశ వ్యాప్తంగా పది లక్షల మంది తమ సబ్సిడీని వదులుకున్నారు. మొత్తానికి ప్రజల్లో మార్పు మొదలైందన్న మాట.



Tags:    

Similar News