ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను ఓడించేందుకు జరిగిన కుట్ర బయటకు!

Update: 2022-03-01 23:30 GMT
నీ చుట్టు ఉన్న వాళ్లే.. నువ్వు.. నా అనుకున్నవాళ్లే వెన్నుపోటు పొడిస్తే.. ఎవరికి చెప్పాలి? ఏం చేయాలి? తమ అడ్డా లాంటి కడపలో తిరుగులేని గెలుపును ఎప్పుడూ గెలుస్తూ వచ్చే వైఎస్ కుటుంబం.. సొంత జిల్లాలో ఓడిపోవటమా? అది కూడా కడప లాంటి కంచుకోటలో? చేతిలో అధికారం లేకుంటే ఏమైనా చేసేయొచ్చా? మరేమైనా జరగొచ్చా? అంటే అవుననే సమాదానం వస్తుంది. అదే.. దుర్మార్గ రాజకీయ లక్షణం.

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకా ఎలాంటి వ్యక్తి అన్న విషయం అందరికి తెలిసిందే. వైఎస్ మాదిరి ఆవేశ పరుడు కాదు ఆయన. శాంత స్వభావుడు.. అలా అని ఉత్తినే ఉండరు చెప్పాల్సినదంతా సున్నితంగా చెప్పేసినా వినకుండా ఉంటే.. వివేకలో మరో మనిషిని నిద్ర లేపినట్లే. వీలైనంత వరకు సర్దుకుపోవటం వివేకకు కొత్తేం కాదు. అలాంటి ఆయనకు మారిన సమీకరణాలు.. టీడీపీ అధికారంలో ఉన్న వేళలో తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే.. వచ్చే ఫలితం ఏమిటన్న దానిపై క్లారిటీ ఉన్నట్లుంది. అందుకే.. తాను పోటీ చేయటానికి సిద్ధంగా లేనన్న విషయాన్ని పార్టీ అధినేత.. అన్న కొడుకు జగన్మోహన్ రెడ్డి అడగటంతో వివేకా కాదన్నారట. ఈ విషయం తాజాగా బయటకు వచ్చింది.

అంతేనా.. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి గెలుపొందటం ఎలా సాధ్యమైంది? అన్నది ప్రశ్నకు సంచలన సమాధానాలు లభిస్తున్నాయి. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి జరిగిన దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు వైఎస్ వివేక అల్లుడు రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. వాంగ్మూలం రిపోర్టులో ఉన్న అంశాల్ని చదివితే.. మరిన్ని షాకింగ్ నిజాలు బయటకు వస్తాయి. దానికి సంబంధించిన వివరాలు వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి మాటల్లో చదివితే..

-  2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయటం వైఎస్ వివేకాకు అస్సలు ఇష్టం లేదు. తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ.. జగన్ చేసిన ఒత్తిడితో పోటీకి ఓకే చేశారు. అప్పట్లో నేను అమెరికాలో ఉన్నాను. నాకు ఎర్ర గంగిరెడ్డి ఫోన్ చేశారు.

-  వివేకాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒప్పించాలన్నారు. దీంతో ఆయన ఒప్పుకున్నారు. ఇదే ఎన్నికల్లో తన కంటే బలహీనమైన టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి చేతిలో కేవలం 30 ఓట్ల తేడాతో వివేక ఓడిపోయారు. ఎందుకిలా? అంటూ ఎర్ర గంగిరెడ్డికి ఫోన్ చేసి అడిగా. అంతర్గత వెన్నుపోట్ల కారణంగా ఓడినట్లుగా చెప్పారు.

-  అప్పటికే అవినాశ్ రెడ్డి కుటుంబానికి ఎర్ర గంగిరెడ్డి దగ్గరయ్యాడని తెలిసింది. ఈ ఎన్నికల తర్వాత ప్రొద్దుటూరులో తన సోదరుడి పేరు మీద ఎర్ర గంగిరెడ్డి రూ.కోటి విలువైన వ్యవసాయ భూమి కొన్నాడు.

-  ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన బీటెక్ రవి.. నాకు కాలేజీలో జూనియర్. దీంతో.. అతడి గెలుపు.. వివేకా ఓటమి గురించి మాట్లాడాను. దానికి అతను అసలు విషయాన్ని చెప్పాడు. వివేకా కోసం కాకుండా తన కోసం పని చేసినందుకు శివశంకర్ రెడ్డికి రూ.70లక్షలు ఇచ్చినట్లుగా బీటెక్ రవి నాకు చెప్పారు.

-  మా బంధువులైన భాస్కర్ రెడ్డి.. అవినాష్ రెడ్డిలతో పాటు శివశంకర్ రెడ్డి సైతం ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో ఓట్లు వివేకాకు పడకుండా చేయటం వల్లే ఓడినట్లుగా చెప్పారు. వివేకాకు మొదట్నించి ఖర్చులు ఎక్కువ. దాన ధర్మాలు భారీగా చేసేవారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం చేసిన అప్పులు తీర్చటానికి హైదరాబాద్ లోని రెండు ఇళ్లు.. ఒక ప్లాటు.. హిమాచల్ ప్రదేశ్ లోని జల విద్యుత్ కేంద్రంలో పదిశాతం వాటా అమ్ముకోవాల్సి వచ్చింది.
Tags:    

Similar News