గ్ర‌హ‌ణం వేళ ఈ గుడి య‌మా బిజీ..!

Update: 2018-07-27 05:50 GMT
సూర్య గ్ర‌హ‌ణం కావొచ్చు.. చంద్ర‌గ్ర‌హ‌ణం కావొచ్చు.. ఏదైనా స‌రే.. గ్ర‌హ‌ణం స్టార్ట్ కావ‌టానికి గంట‌ల ముందే ఆ గుడిని పూర్తిగా మూసేస్తారు. గ్ర‌హ‌ణం త‌ర్వాత కూడా సంప్రోక్ష‌ణ‌లు పూర్తి చేసిన త‌ర్వాతే ద‌ర్శ‌నానికి అనుమ‌తి ఇస్తారు. చిన్న గుడి నుంచి ప్ర‌ముఖ దేవాల‌యం వ‌ర‌కూ ఈ పద్ధ‌తిని తూచా త‌ప్ప‌కుండా ఫాలో అవుతారు. కానీ.. ఇప్పుడు చెప్పే గుడి మాత్రం అందుకు భిన్నం.

గ్ర‌హ‌ణాలు ఏర్ప‌డుతున్నాయంటే చాలు.. ఈ గుడికి ర‌ద్దీ పెరుగుతుంది. అంతేనా.. గ్ర‌హ‌ణ స‌మ‌యంలో ఈ గుడిలో జ‌రిగే ప్ర‌త్యేక పూజ‌ల‌కు ప్ర‌సిద్ధిగా నిలుస్తుంది చిత్తూరు జిల్లాలోని ప్ర‌ముఖ దేవాల‌యాల్లో ఒక‌టైన శ్రీ‌కాళ‌హ‌స్తి దేవాల‌యం. ద‌క్షిణ కైలాసంగా ప్ర‌సిద్ధి చెంది వాయు లింగేశ్వ‌ర క్షేత్రంగా పేరున్న శ్రీ‌కాళ‌హ‌స్తీశ్వ‌రాల‌యం మిగిలిన దేవాల‌యాల‌కు పూర్తి భిన్నం.

గ్ర‌హ‌ణ కాలంలో ఆల‌యంలో జ‌రిపే అభిషేకాల‌కు ప్ర‌త్యేకంగా ఉంటుంది. ఈ రోజు రాత్రి చోటు చేసుకునే సంపూర్ణ చంద్ర‌గ్ర‌హ‌ణం సంద‌ర్భంగా ముక్కంటికి ప్ర‌త్యేక అభిషేకాలు చేప‌ట్టేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ‌కాళ‌హ‌స్లీశ్వ‌రాల‌యంలో శ్రీ‌కాళ‌స్తీశ్వ‌ర‌స్వామి స్వ‌యంభు. ధృవ‌మూర్తిగా వెలిసిన శివ‌లింగాకృతిపై సాలీడు.. పాము.. ఏనుగుల‌తో భ‌క్త క‌న్న‌ప్ప గుర్తుల‌తో స్వ‌యంభు లింగంగా ఆవిర్భ‌వించింది. ఇక్క‌డ వెలిసిన వాయు లింగేశ్వ‌రుని.. సూర్య చంద్రాగ్ని లోచ‌నుడిగా పిలుస్తారు. సూర్య చంద్రుల‌తో పాటు అగ్నిభ‌ట్టార‌కునితో పాటు తొమ్మిది గ్ర‌హాలు.. 27 న‌క్ష‌త్రాల‌ను నిక్షిప్తం చేసుకున్న క‌వ‌చంతో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. అందుకే.. ఇక్క‌డ రాహు.. కేతువుల ఆట‌లు సాగ‌వు. అందుకే ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న భ‌క్తుల్లో ప‌లువురు ఈ క్షేత్రంలో రాహు.. కేతు స‌ర్ప‌దోష నివార‌ణ పూజ‌లు చేయించుకోవ‌టం క‌నిపిస్తుంది. ప‌లువురు ప్ర‌ముఖులు శ్రీ‌కాళ‌హ‌స్తికి వ‌చ్చి పూజ‌లు చేయించుకోవ‌టం తెలిసిందే. తాజాగా చోటుచేసుకోనున్న సంపూర్ణ చంద్ర‌గ్ర‌హ‌ణం సంద‌ర్భంగా అర్థ‌రాత్రి ఒంటిగంట‌కు మొద‌ల‌య్యే శాంతి అభిషేకం.. గ్ర‌హ‌ణం పూర్త‌య్యే టైంకు పూర్తి కానుంది.
Tags:    

Similar News