కొత్త పోస్టులో చేరకుండానే లీవ్ లోకి ఎల్వీ... వాట్ నెక్ట్స్?

Update: 2019-11-06 16:27 GMT
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి అనూహ్యంగా బదిలీ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం... జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంతో బాగానే హర్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికలకు ముందే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల దరిమిలా... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎల్వీ... జగన్ అధికారంలోకి వచ్చాక కూడా అదే పదవిలో కొనసాగారు. మరో ఐదు నెలల్లో పదవీ విరమణ చేయనున్న ఎల్వీని అప్పటిదాకా సీఎస్ గానే కొనసాగిస్తారన్న విశ్లేషణలు కూడా వినిపించాయి. అయితే ఏమైందో తెలియదు గానీ.. అనూహ్యంగా సీఎస్ పోస్టు నుంచి ఎల్వీని తప్పించేసిన జగన్ సర్కారు...ఆయనకు గుంటూరు జిల్లా బాపట్లలోని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్ గా నియమించింది. అంతేకాకుండా ఈ బదిలీ తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా జగన్ సర్కారు తన ఉత్వర్లుల్లో చెప్పింది.

జగన్ సర్కారు తీసుకున్న బదిలీ దరిమిలా ఎల్వీ ఎలా స్పందింస్తారన్న విషయం నిన్నటిదాకా ఆసక్తి రేకెత్తించింది. ఆ సస్పెన్స్ కు తెర దించుతూ ఎల్వీ సుబ్రహ్మణ్యం తనకు కేటాయించిన కొత్త పోస్టులో జాయిన్ కాకుండానే లాంగ్ లీవ్ పెట్టేశారు. నేటి నుంచి (నవంబర్ 6 నుంచి) డిసెంబర్ 6 వరకు ఏకంగా నెల రోజుల పాటు సెలవు పెట్టేసిన ఎల్వీ... జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంతో హర్ట్ అయినట్టుగానే తేల్చి చెప్పేశారు. నెల రోజుల పాటు సెలవు పెట్టిన ఎల్వీ... తన భవిష్యత్తు వ్యూహం ఏమిటన్న విషయంపై మాత్రం అంతగా స్పష్టత ఇవ్వలేదనే చెప్పాలి. మరో ఐదు నెలల్లో ఐఏఎస్ గా పదవీ విరమణ చేయనున్న ఎల్వీ... జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై న్యాయ పోరాటం చేసే అవకాశాలు అంతగా లేవన్న వాదన వినిపిస్తోంది.

సాదారణంగా తమెకు ఇష్టం లేని రీతిలో బదిలీ చేయడం, బదిలీ చేసినా పోస్టు కేటాయించకపోవడం వంటి సర్కారు నిర్ణయాలపై సివిల్ సర్వీసెస్ అధికారులు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనళ్లను ఆశ్రయిస్తున్న వైనం మనకు తెలిసిందే. అయితే ఎల్వీ విషయంలో ఈ తరహా పరిణామాలు చోటుచేసుకునే అవకాశమే లేదన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే...సీఎస్ పోస్టు నుంచి ఎల్వీని తప్పించిన జగన్ సర్కారు... ఆయనకు అదే హోదాకు సమానమైన మానవ వనరుల అభివృద్ది కేంద్రం డైరెక్టర్ జనరల్ పోస్టును కేటాయించింది. ఇక సీఎస్ పోస్టు నుంచి తనను అవమానకర రీతిలో బదిలీ చేసిందన్న విషయంపైనా జగన్ సర్కారుపై ఎల్వీ నోరు విప్పే అవకాశం లేదు. ఎందుకంటే... ఎల్వీ బదిలీని సాధారణ విషయంగానే చూపించేసిన జగన్ సర్కారు... సీఎస్ గా బదిలీ చేసినా కొత్త పోస్టులో ఆయనను నియమించింది కదా. మరి జగన్ సర్కారు తీసుకున్న బదిలీ నిర్ణయంపై పోరుబాట పట్టే అవకాశాలే లేని నేపథ్యంలో ఎల్వీ ఏకంగా నెల రోజులు ఎందుకు సెలవు పెట్టారన్న విషయంపై ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేసిందనే చెప్పాలి.
Tags:    

Similar News