ఏడాదినుంచి టచ్ లో ఉండి.. ఇప్పుడు జై కొట్టాడు

Update: 2018-03-10 05:57 GMT
పవన్ కల్యాణ్ పార్టీలోకి ఒక నాయకుడు వచ్చి చేరాడు. పేరు మాదాసు గంగాధరం. నెల్లూరు జిల్లాకు చెందిన నాయకుడు. జనసేన పార్టీలో ఆయన చేరిక పెద్ద చిత్రమైనదేమీ కాదు. అనూహ్యమైనదేమీ కాదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ.. గత ఏడాది కాలంగా పవన్ భజన చేస్తూనే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయినప్పటికీ.. పవన్ కల్యాణ్ కు అప్పటినుంచి టచ్ లోనే ఉన్నాడు. పవన్ కల్యాణ్ రాజకీయ ప్రవేశాన్ని కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలు స్వాగతిస్తున్నాయన్నట్లుగా ఆయనకు ఒక మైలేజీ ఏర్పడడానికి.. అక్కడ ఉండి ఇతోధికంగా.. ఆయన సాయపడినవాడే. కాగా ఇప్పుడిక పార్టీకి ‘బయటినుంచి’ అందించే సేవలు చాలనుకుని.. పార్టీ ‘సెటప్’లోకి ప్రవేశించి సేవలు చేయడానికి అన్నట్లుగా.. కాంగ్రెస్ కు  రాజీనామా చేసి.. ఇటు వచ్చేశారు.

నిజానికి పవన్ కల్యాణ్ తలుపులు తెరచి.. ‘ద్వారము తెరచియే యున్నది’ అని ఒక్క బహిరంగ ప్రకటన చేస్తే చాలు.. ఇతర పార్టీల నుంచి.. (తెలుగుదేశం సహా) ఇబ్బడి ముబ్బడిగా వచ్చి చేరిపోవడానికి చాలా మంది నాయకులే సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే పవన్ కల్యాణే అందుకు పెద్దగా సుముఖంగా లేరు. ఆయనతో టచ్ లోకి వస్తున్న నాయకులు చాలా మందే ఉన్నప్పటికీ.. పవన్  ఆచితూచి వారిని ఎంచుకున్నట్లుగా సమాచారం.

మాదాసు గంగాధరం తొలి నాయకుడిగా ఎంట్రీ తీసుకోవడమే కాదు.. అప్పడే కీలకమైన ప్లీనరీ మహాసభల నిర్వహణ పర్యవేక్షణ బాధ్యత కూడా పుచ్చుకున్నాడు. రాజకీయచైతన్యానికి మారుపేరైన నెల్లూరుజిల్లా కు చెందిన ఆయన.. నిలకడైన ప్రజాబలం ఉండే నేత కాకపోయినా.. అర్థబలం ఉన్న వ్యక్తిగా గుర్తింపు ఉంది. తెరవెనుక కథ నడపగల రాజకీయ చాతుర్యంలో అనుభవం ఉన్న వ్యక్తి గనుకనే.. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ ఉపాధ్యక్షుడి స్థాయికి ఎదిగారనే పేరు కూడా ఉంది.

నిజానికి మాదాసు గంగాధరం 30 ఏళ్ల నుంచి పవన్ కు పరిచయం ఉన్నారుట. జనసేన పార్టీ పెట్టినప్పటినుంచి కాంగ్రెస్ నుంచి పవన్ అనుకూల వాదనలు బహిరంగంగా వినిపిస్తున్నారు. పవన్ రాష్ట్రమంతా యాత్రలు చేయాల్సిన అవసరం ఉన్నదని.. ఆయన ఏడాది కిందటే సూచించారు. ఇప్పుడు కార్యరూపంలోకి వస్తున్న యాత్రల స్కెచ్ ఆయనదే అనే ప్రచారం కూడా పార్టీలో ఉంది.

Tags:    

Similar News