టీఆర్ ఎస్ ఎమ్మెల్యే కు టీడీపీ క‌టౌట్లు

Update: 2015-08-24 07:57 GMT
హైద‌రాబాద్‌ లోని కూక‌ట్‌ ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావుకు వింత ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయి. గ‌త 25 సంవ‌త్స‌రాలుగా టీడీపీలో క్రియాశీల‌కంగా ఉన్న ఆయ‌న గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే గా ఎన్నిక‌య్యారు. త‌ర్వాత ఆయ‌న కేసీఆర్ పిలుపు మేర‌కు టీఆర్ ఎస్‌ లో చేరారు. అయితే కృష్ణారావు అనుచ‌ర‌గ‌ణం మొత్తం ఆంధ్రా సెటిల‌ర్సే. వారే మొన్న ఎన్నిక‌ల్లో ఆయ‌న విజ‌యానికి బాగా కృషి చేశారు.

  మాధ‌వ‌రం టీఆర్ ఎస్‌ లో చేరినా నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న కార్య‌క‌ర్త‌లంద‌రూ అక్క‌డ టీఆర్ ఎస్ అభ్య‌ర్థిగా పోటీచేసిన ప‌ద్మారావుతోనే ఉంటున్నారు. ఇదిలా ఉంటే తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం టీఆర్ ఎస్‌ లో చేరకుండానే మాధవరం కృష్ణారావు తో సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గంలోని మోతీన‌గ‌ర్ డివిజ‌న్‌ లో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ప్రారంభించేందుకు వెళ్లిన మాధ‌వ‌రంకు స్వాగ‌తం ప‌లుకుతూ టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఫ్లెక్సీలు క‌ట్టారు. వీటిని చూసిన టీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌లు ఒక్క‌సారిగా అగ్గిమీద గుగ్గిల‌మ‌య్యారు.

 వీటిని చూసిన మీడియా ప్ర‌తినిధులు కూడా మాధ‌వ‌రం మ‌ళ్లీ పార్టీ మారుతున్నార‌ని క‌థ‌నాలు కూడా రాసేశారు. ఈ వార్త‌ల‌పై టీడీపీ కార్య‌క‌ర్త‌లు స్పందిస్తూ ఆయ‌న టీడీపీ పుట్టిన‌ప్ప‌టి నుంచి ఆ పార్టీలోనే ఉన్నందున ఇప్పుడు మ‌ళ్లీ మా పార్టీలోకి వ‌స్తే త‌ప్పేంటంటున్నారు. ఈ వార్త‌ల‌పై ఎమ్మెల్యే మాధ‌వ‌రం స్పందిస్తూ టీడీపీలో ఏళ్ల త‌ర‌బ‌డి ఎంతోమందితో త‌న‌కు అనుబంధం ఉంద‌ని..తాను పార్టీ మారినా వారితో త‌న అనుబంధం మాత్రం అలాగే కొన‌సాగుతుంద‌ని చెప్పి టీఆర్ ఎస్ నాయ‌కుల‌కు పెద్ద షాకే ఇచ్చారు. త‌న‌ను అభిమానించే వాళ్ల‌ను తాను వ‌దులుకోలేన‌ని..తాను వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి నియోజ‌క‌వ‌ర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తే వాళ్లంద‌రు త‌న‌కు ఓట్లేస్తార‌ని ముక్తాయించారు. సెటిల‌ర్స్ ఎక్కువ‌గా ఉన్న కూక‌ట్‌ ప‌ల్లిలో మాధ‌వ‌రం తెలివైన స్ర్టాట‌జీనే అమ‌లు చేస్తున్నార‌ని టీఆర్ ఎస్ నాయ‌కులు చెవులు కొరుక్కుంటున్నారు.
Tags:    

Similar News