రేపైనా అమ్మ అనారోగ్యం గుట్టు వీడేనా?

Update: 2016-10-05 04:43 GMT
తమిళుల్నే కాదు.. అమ్మగా సుపరిచితురాలైన జయలలిత గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఆమెకు ఏమైంది? అంత తీవ్ర అనారోగ్యం ఏమిటి? ఆమె ఎప్పటికి కోలుకుంటారు? లాంటి ప్రశ్నలతో సతమతమయ్యే పరిస్థితి. ప్రతిది గుట్టుగా వ్యవహరించే అన్నాడీఎంకే పార్టీ లాంటి పార్టీలో.. ఆ పార్టీ చీఫ్ ఆసుపత్రిలో ఉన్న వేళ.. అసలేం జరుగుతుందో బయటకు రాని పరిస్థితి. ముఖ్యమంత్రి ఆసుపత్రిలో రోజుల తరబడి ఉంటే..సామాన్యుల్లో ఆందోళనలు మామూలే. వీటిని మరింత పెంచేలా వ్యవహరించటం.. అసలు విషయం ఏమిటన్నది బయటకు రాకపోవటంతో.. అమ్మను విపరీతంగా అభిమానించే కోట్లాది మంది ఏం జరిగిందో తెలీక పడుతున్న వేదన అంతాఇంతా కాదు.

ఈ పరిస్థితుల్లో సామాజికవేత్త ట్రాఫిక్ రామస్వామి కల్పించుకొని.. కోర్టు దృష్టికి అమ్మ ఆరోగ్యం ఇష్యూను తీసుకెళుతూ.. ఓట్లు వేసిన ముఖ్యమంత్రిగా గెలిపించిన ప్రజలకు.. అన్ని సమాచారాల్ని తెలుసుకునేందుకు హక్కులు ఉంటాయని.. అలాంటప్పుడు ముఖ్యమంత్రి ఆరోగ్యంపై స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందంటూ చేసిన వాదనను కోర్టు సమర్థించింది. అమ్మ ఆరోగ్యంపై స్పష్టమైన సమాచారాన్ని గురువారం నాటికి కోర్టుకు ఇవ్వాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

మరో రోజు గడిస్తే.. అమ్మ ఆరోగ్యానికి సంబంధించిన స్పష్టమైన.. అధికారిక వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రజల్లో తీవ్ర భావోద్వేగానికి గురిచేసే అవకాశం ఉన్ననేపథ్యంలో.. అమ్మ అనారోగ్యానికి సంబంధించిన వివరాలన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చి.. ఈ వివరాల్ని బయటకు వెల్లడించకుండా ఉంటే మంచిదన్న వాదనను ప్రభుత్వ వర్గాలు వినిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే.. ఇలాంటి వాదనలపై మద్రాస్ హైకోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మరోవైపు.. అమ్మ ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ను చూస్తే.. ఆమె ఆరోగ్యం మెరుగుపడిందని..ఆమెకు వైద్య చికిత్సలు కొనసాగుతుందని.. ఆమె శరీరం చికిత్సకు స్పందిస్తోందని.. ఆమె ఆరోగ్యం మెరుగు అవుతుందని పేర్కొన్నారు. ఏది ఏమైనా.. అమ్మ ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి స్పష్టత మరో రోజులో రానుందని చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News