మెరీనాలో క‌రుణ అంత్య‌క్రియ‌ల‌కు హైకోర్టు ఓకే!

Update: 2018-08-08 06:19 GMT
త‌మిళ రాజ‌కీయాల్లో పెద్దాయ‌న‌.. త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధి అంత్య‌క్రియ‌ల విష‌యంలో నెల‌కొన్ని వివాదానికి తెర దించుతూ మ‌ద్రాస్ హైకోర్టు కీల‌కతీర్పును ఇచ్చింది. క‌రుణ అంతిమ సంస్కారాలు మెరీనా బీచ్ లోని అన్నాదురై స‌మాధి ప‌క్క‌న నిర్వ‌హించేందుకు స్థ‌లం కేటాయించాల‌ని కోరుతూ డీఎంకే చేసిన విన‌తిని కోర్టు అంగీక‌రించింది.

మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి నుంచి మొద‌లైన ఈ వాద‌న‌లు.. ద‌శ‌ల వారీగా అటు ప్ర‌భుత్వం.. ఇటు డీఎంకే త‌ర‌ఫు లాయ‌ర్ వాదించారు. ఇరు వ‌ర్గాల వాద‌న‌ల్ని విన్న కోర్టు.. చివ‌ర‌కు క‌రుణ అంత్య‌క్రియ‌లు మెరీనా బీచ్ లో జ‌రిపేందుకు స‌మ్మ‌తిస్తూ ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

మ‌ద్రాస్ హైకోర్టు ఈ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌టానికి ముందు ప‌లు నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. సీరియ‌స్ గా వాద‌న‌లు న‌డిచాయి. క‌రుణ అంత్య‌క్రియ‌ల్ని మెరీనాలో నిర్వ‌హించేందుకు వీలుగా అనుమ‌తి ఇవ్వాల‌ని కోర్టును కోరుతూ మంగ‌ళ‌వారం రాత్రి డీఎంకే హైకోర్టును ఆశ్ర‌యించింది. అత్య‌వ‌స‌ర వ్యాజ్యంపై హైకోర్టు అర్థ‌రాత్రి విచార‌ణ చేప‌ట్టింది.

ఈ రోజు ఉద‌యం 8 గంట‌ల్లోపు ఈ అంశంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం త‌ర‌ఫు లాయ‌ర్ హైకోర్టుకు వివ‌ర‌ణ ఇస్తూ.. మాజీ ముఖ్య‌మంత్రులుగా ఉంటూ క‌న్నుమూసిన వారికి మెరీనా బీచ్ లో స్థ‌లం కేటాయించిన దాఖ‌లాలు గ‌తంలో లేవ‌ని పేర్కొన్నారు. మాజీ ముఖ్య‌మంత్రి కామ‌రాజ్ నాడార్ మ‌ర‌ణించిన‌ప్పుడు డీఎంకే ప‌వ‌ర్లో ఉంద‌ని.. ఆయ‌న‌కు అంతిమ సంస్కారాల‌కు మెరీనాలో స్థ‌లం కేటాయించలేద‌ని పేర్కొంది.

దీనిపై డీఎంకే వివ‌ర‌ణ కోరిన కోర్టుకు.. కామ‌రాజ్ మ‌ర‌ణించిన‌ప్పుడు మెరీనాలో స్థ‌లాన్ని ఇవ్వాల‌ని అప్ప‌ట్లో త‌మ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఎవ‌రూ కోర‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు.  అదే స‌మ‌యంలో మెరీనా బీచ్ లో అంతిమ సంస్కారాలు జ‌ర‌ప‌కుండా నియంత్రించేలా చ‌ర్య‌లు తీసుకోవాలంటూ గ‌తంలో దాఖ‌లు చేసిన పిటిష‌నర్లు త‌మ వ్యాజ్యాల్ని వెన‌క్కి తీసుకోనున్న‌ట్లు వెల్ల‌డించారు. దీంతో.. మెరీనా బీచ్ లో అంత్య‌క్రియ‌లు జ‌ర‌పొద్ద‌ని పేర్కొంటూ ఎవ‌రి పిటీష‌న్లు పెండింగ్ లో లేవు క‌దా? అని ప్ర‌శ్నించారు.

దీనికి ఎవ‌రూ లేవ‌న్న స‌మాధానం వ‌చ్చింది. ఇదిలా ఉంటే.. మెరీనాలో క‌రుణ అంత్యక్రియ‌ల‌పై స్పందించిన అన్నా డీఎంకే స‌ర్కార్‌.. క‌రుణ అంత్య‌క్రియ‌ల‌కు స్థ‌లం కేటాయించ‌టానికి తీర ప్రాంత నియంత్ర‌ణ మండ‌లి నిబంధ‌న‌లు అడ్డుగా ఉన్నాయ‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. ప్ర‌త్యామ్నాయంగానే క‌రుణ అంతిమ సంస్కారాల‌కు గిండిలో 2 ఎక‌రాలు కేటాయించిన‌ట్లు వెల్ల‌డించారు.

త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ వాద‌న‌ను డీఎంకే లాయ‌ర్ తప్ప‌ప‌ట్టారు. రాష్ట్రంలో ఏడు కోట్ల మంది ప్ర‌జ‌ల్లో డీఎంకేకు కోటి మంది అనుచ‌రులు ఉన్నార‌ని.. మెరీనా బీచ్ లో స్థ‌లం ఇవ్వ‌కుంటే వారంతా మ‌న‌స్తాపానికి గుర‌వుతార‌ని తెలిపారు. మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌కు 3500 చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లం కేటాయించిన వారు.. క‌రుణ‌కు అర‌డుగుల స్థ‌లం కేటాయించ‌లేరా? అని  ప్రశ్నించారు. ఇరువ‌ర్గాల వాద‌న‌ల న‌డుమ‌.. క‌రుణ అంత్య‌క్రియ‌లు మెరీనా బీచ్ లో జ‌రిపేందుకు హైకోర్టు ఓకే చెప్పేసింది. దీంతో.. క‌రుణ అంత్య‌క్రియ‌ల‌పై సాగుతున్న స‌స్పెన్స్ కు తెర ప‌డిన‌ట్లైంది.


Tags:    

Similar News