అమ్మ మృతి వెనుక రహస్యం వీడనుందా?

Update: 2017-01-09 08:46 GMT
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనుమానాలున్నాయంటూ మ‌ద్రాసు హైకోర్టులో దాఖ‌లైన పిటిష‌న్ ఈ రోజు విచార‌ణ‌కు వ‌చ్చింది. ఈ పిటిష‌న్‌ పై వాద‌న‌లు విన్న హైకోర్టు అనంత‌రం త‌మిళ‌నాడు స‌ర్కారుకి నోటీసులు జారీ చేసింది. వ‌చ్చేనెల 23లోపు జ‌య‌ల‌లితకు అందించిన చికిత్స‌ - మృతికి సంబంధించిన వివరాలపై సమ‌గ్ర‌నివేదిక‌ను సీల్డ్ క‌వ‌రులో త‌మకు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరో 15 రోజుల్లో అమ్మ మృతి వెనుక రహస్యం బయటపడుతుందని భావిస్తున్నారు.
    
కాగా హైకోర్టు ఆదేశాల ప‌ట్ల స్పందించిన ప్రభుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది జ‌య‌ల‌లిత‌కు అందించిన చికిత్సపై నివేదిక ఇవ్వ‌డానికి సిద్ధ‌మేన‌ని తెలిపారు. చికిత్సపై నివేదిక ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెన్నై అపోలో ఆస్పత్రి వర్గాలు సైతం  తెలిపాయి. అయితే... జయలలిత బంధువులు  తమను ఆశ్రయించనందున ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే హక్కు పిటిషనర్‌ కు ఉందా మద్రాస్‌ హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 23కు వాయిదా వేసింది.
    
చెన్నైకి చెందిన అన్నాడీఎంకే కార్యకర్త పీఏ జోసెఫ్‌ మద్రాస్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. అంతకుముందు డిసెంబర్‌ 29న పిల్‌ ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు.  జయలలిత మృతిపై పిటిషనర్‌కే గాక తమకు కూడా వ్యక్తిగతంగా సందేహాలు ఉన్నాయని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. అసలేం జరిగిందో ప్రజలకు తెలియాల్సిన అవసరముందని అప్పుడే వ్యాఖ్యానించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News