తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం. అన్నాడీఎంకే ఎమ్మెల్యే పి వెట్రివెల్ కు మద్రాస్ హైకోర్టు లక్ష రూపాయల జరిమానా విధించింది. టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన ఈయన.. మంగళవారం సీఎం పళనిస్వామి నిర్వహించనున్న పార్టీ సమావేశాన్ని ఆపాల్సిందిగా ఆదేశించాలని కోరుతూ కోర్టుకెక్కారు. అయితే ఈ పిటిషన్ ను కొట్టేసిన మద్రాస్ హైకోర్టు.. విలువైన న్యాయస్థానం సమయాన్ని వృథా చేసినందుకు లక్ష జరిమానా విధించింది.
పళని ఏర్పాటు చేసిన ఈ పార్టీ సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకోవడానికి కొన్ని రోజులుగా దినకరన్ వర్గం నానా ప్రయత్నాలు చేస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు ఉండే ఈ సమావేశానికి సంబంధించిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి అనుమతి లేకుండా వేసినందుకు పిటిషనర్ కు న్యాయమూర్తి సీవీ కార్తికేయన్ అక్షింతలు వేశారు. ఇది తాను ఓ ఎమ్మెల్యేగా వేసిన పిటిషన్ కాదని, వ్యక్తిగతంగా వేశానని వెట్రివెల్ కోర్టుకు చెప్పారు. అలా అయితే సమావేశానికి హాజరు కావచ్చు లేదా సమావేశానికి వెళ్లి ఒక్కరే వేరుగా లంచ్ చేయొచ్చు లేదా ఇంట్లో కూర్చోవచ్చు అని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.
మరోవైపు తమిళనాడు అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయిన ముఖ్యమంత్రి పళని స్వామిని బలపరీక్ష ఎదుర్కోవలసిందిగా ఆదేశించాలని ప్రతిపక్ష పార్టీల ప్రతినిధుల బృందం గవర్నర్ ఆదివారం విద్యాసాగర్ రావుకు విజ్ఞప్తి చేసింది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకె నేత ఎం.కె.స్టాలిన్ సారథ్యంలో ఈ బృందం గవర్నర్ ను కలుసుకుంది. వెంటనే అసెంబ్లీలో బలపరీక్ష పెట్టాలని తాము చేసిన డిమాండ్ కు గవర్నర్ సానుకూలంగా స్పందించారని సమావేశానంతరం స్టాలిన్ వెల్లడించారు. ఆయనతో సమావేశమైన సందర్భంగా ప్రతిపక్షాలకు అసెంబ్లీలో ఎంత బలముందో సవివరంగా తెలియజేశామన్నారు. అసెంబ్లీలో డీఎంకెకు 89 మంది - కాంగ్రెస్ కు 8 - ఐయుఎంఎల్ కు ఒక ఎమ్మెల్యే ఉన్నారని, వీటి మొత్తం బలం 98 అని గవర్నర్ కు వివరించామన్నారు. అన్నాడీఎంకెకు చెందిన 21 మంది రెబెల్ ఎమ్మెల్యేలను కలుపుకుంటే ప్రతిపక్షాల మొత్తం బలం 119కి చేరుకుంటుందని కూడా గవర్నర్ కు స్పష్టం చేశామన్నారు. 21 మంది ఎమ్మెల్యేలు విడిపోవడంతో పళనిస్వామి ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని ఆయన స్పష్టం చేశారు.