రాజీవ్ హంత‌కురాలి 25 ఏళ్ల నిరీక్ష‌ణ ఫ‌లించ‌లేదు

Update: 2018-04-27 13:04 GMT
గ‌త 25 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్న రాజీవ్‌ గాంధీ హత్య కేసు ముద్దాయి నళిని నిరీక్ష‌ణ ఫ‌లించ‌లేదు. జైలు జీవితం అనుభవిస్తున్న ఎస్.నళిని శ్రీహరన్ పిటిషన్‌ ను మద్రాస్ హైకోర్టు కొట్టిపారేసింది. ముందస్తుగా రిలీజ్ చేయాలని ఆమె కోర్టుకు అభ్యర్థన పెట్టుకుంది. దానిపై ఆ రాష్ట్ర కోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. ప్రస్తుతం ఆమె జీవితకాల శిక్షను అనుభవిస్తోంది. జ‌స్టిస్ కేకే స‌దాశివ‌న్‌ - జ‌స్టిస్ ఆర్‌. సుబ్ర‌మ‌ణియ‌న్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం న‌ళిని పిటిష‌న్‌ను కొట్టివేసింది. ఈ అంశంపై ఇప్ప‌టికే సుప్రీంకోర్టు స్ప‌ష్ట‌మైన తీర్పునిచ్చింద‌ని, అలాంటి అంశంలో తాము జోక్యం చేసుకోబోమ‌న్నారు.

వెల్లోర్ సెంట్ర‌ల్ జైలులో న‌ళిని శిక్ష‌ను అనుభ‌విస్తోంది. ఆర్టిక‌ల్ 161 ప్ర‌కారం 20 ఏళ్లు శిక్ష పూర్తి చేసుకున్న వారిని విడుద‌ల చేయ‌వ‌చ్చు అంటూ 1994లో ప్ర‌భుత్వం ఓ స్కీమ్‌ ను తీసుకువ‌చ్చింది. దాని ప్ర‌కారం రిలీజ్ చేయాలంటూ పిటిష‌న‌ర్ వేడుకున్నారు. ఆర్టికల్ 161 (గవర్నర్‌కు క్షమాభిక్ష ప్రసాదించే అధికారం) కింద తమిళనాడు ప్రభుత్వం 1994లో ఈ ప‌థ‌కం తీసుకొచ్చింది. ఆమెను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో... దీన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజీవ్ హత్య కేసు నిందితులను విడుదల చేయరాదంటూ సుప్రీకోర్టు ఆదేశించడంతో... నళిని విడుదల ఆగిపోయింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.

ఇదిలాఉండ‌గా...దాదాపుగా రెండేళ్ల క్రితం వీరిని విడుద‌ల చేయాల‌ని త‌మిళ‌నాడులో భారీ ర్యాలీ జ‌రిగింది. రాజీవ్‌ గాంధీ హత్య కేసు ముద్దాయిలు ఏడుగురి జైలువాసానికి శనివారంతో 25 ఏళ్లయ్యిందని - మానవతా దృక్పథంతో వారిని తక్షణమే విడుదల చేయాలని అప్ప‌టి నడిగర్‌ సంఘం అధ్యక్షుడు నాజర్‌ - సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన - సినీ దర్శకులు జననాథన - గౌతమ్‌ - రమేశ్‌ ఖన్నా - అమీర్‌ - వెట్రిమారన - రామ్‌ - నటుడు సత్యరాజ్‌ - పీఎంకే యువజన విభాగం నాయకుడు అన్బుమణి రాందాస్‌ తదితరులు కోరారు. ఆ ఏడుగురి జైలు వాసం శనివారంతో 25 ఏళ్ల పూర్తయ్యాయి. ఈ సందర్భంగా వేలూరు జైలు ప్రాంగణం నుంచి చెన్నై వరకు వాహనాల ర్యాలీ జరపాలని తొలుత నిర్ణయించినప్పటికీ, పోలీసులు ఆ ర్యాలీకి అనుమతిని నిరాకరించారు. దీనితో ఎగ్మూరు ప్రాంతం నుంచి సచివాలయం వరకు నిర్వాహకులు ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీలలో నామ్‌ తమిళర్‌ పార్టీ నాయకుడు సీమాన మాట్లాడుతూ... రాజీవ్‌ గాంధీ హత్యకేసు ముద్దాయిలైన ఏడుగురు తమిళుల విడుదలకు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఇప్పటికే పలుమార్లు చర్యలు తీసుకున్నారని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వమే పట్టుసడలించి వారిని విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.రాజీవ్‌ గాంధీ హత్యకేసు ముద్దాయిలు ఏడుగురి జైలు జీవితం 25 యేళ్లుగా కొనసాగడం దురదృష్టకరమని, చేసిన నేరం తీవ్రమైనదే అయినా, ఇప్పటి పరిస్థితుల్లో వారిని మానవతాదృక్పథంతో కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని సినీనటుడు సత్యరాజ్‌ డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News