మాగంటీ.. రాజకీయ జీవితం ఎండ్.?

Update: 2019-11-07 07:12 GMT
ఒక్క ఓటమి ఆ టీడీపీ సీనియర్ల తలరాతలను మార్చేస్తోంది. రాజకీయాల నుంచి దూరంగా జరిగేలా చేస్తోంది. టీడీపీలో ఇక రాజకీయ జీవితం మనుగడ కష్టమన్న ఆలోచనకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే టీడీపీకి రాజీనామా చేయగా.. విశాఖ సీనియర్ నేత గంటా మౌనం దాల్చారు. తాజాగా టీడీపీలో వెలుగు వెలిగిన ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు ఏకంగా అజ్ఞాంతంలోకి వెళ్లిపోవడం కలకలం రేపుతోంది.

2014లో టీడీపీ తరుఫున ఏలూరు ఎంపీగా గెలిచిన మాగంటి బాబు.. 2019 ఎన్నికల్లోనూ అదే సీటును పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి టీడీపీకి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. తాజాగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చంద్రబాబు వచ్చినా.. లోకేష్ జిల్లాలో పర్యటించినా అటు వైపే వెళ్లడం లేదు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు మాగంటి బాబు. ఆ తర్వాత టీడీపీలో చేరి 2014లో ఏలూరు ఎంపీ అయ్యారు. ఆ సమయంలో టీడీపీలో అవమానాలు ఎదుర్కొన్నారు. తగిన గుర్తింపు, గౌరవం దక్కడం లేదని వాపోయారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో మాగంటిని విస్మరించడం ఆయనకు ఆగ్రహం తెప్పించింది. ఇక చింతలపూడి మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టును చంద్రబాబు ఇవ్వకుండా అప్పటి మంత్రి పీతల సుజాత వర్గానికి ఇవ్వడాన్ని మాగంటి జీర్ణించుకోలేదు. 2019 ఎన్నికల్లో ఓడిపోయాక మాగంటి ఇక టీడీపీలో ఉండదల్చుకోలేదని డిసైడ్ అయినట్టున్నారు.

తనను చంద్రబాబు, టీడీపీ శ్రేణులు పట్టించుకోక పోవడం.. ఎన్నికల్లో సహకరించలేదని మాగంటి సన్నిహితుల వద్ద వాపోయాడు. అదే ఓటమికి దారి తీసిందని.. టీడీపీలో ఇక ఉండబోనని అజ్ఞాతంలోకి వెళ్లి పోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మాగంటి రాజకీయ జీవితం ముగిసినట్టేనని.. ఆయన కుమారుడు రామ్ జీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని సమాచారం.
Tags:    

Similar News