మహాకూటమి జాబితా ఖరారయ్యేనా.?

Update: 2018-11-10 11:33 GMT
ఊగిసలాట కొనసాగుతోంది. మహాకూటమి ఏర్పడి నెల రోజులు కావస్తున్నా ఇంకా సస్పెన్స్ వీడడం లేదు. కొన్ని రోజులుగా వాయిదా పడుతున్న ప్రకటన శనివారమైనా విడుదలవుతుందని ఆశిస్తే నిరాశే ఎదురవుతోంది. నామినేషన్ల గడువు ముంచుకొస్తున్నా సీట్ల సర్దుబాటు వీడడం లేదు.

ఇప్పటివరకూ 74 స్థానాల అభ్యర్థులను శనివారం ఉదయం ప్రకటిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి ఆర్ సీ కుంతియా ప్రకటించారు. కానీ ఖరారయ్యాని చెబుతున్న స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల నుంచి పలు అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో జాబితా ప్రకటన ఆదివారానికి వాయిదా పడ్డట్టు సమాచారం.

కూటమిలోని పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు తెగడం లేదు. ఉమ్మడి కూటమి అభ్యర్థుల జాబితాపై ఈనెల 8న ప్రకటన చేస్తామని పేర్కొంది. అయితే అది సాధ్యం కాలేదు. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ 74 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ప్రకటించినా కొలిక్కిరాలేదు. ఈ నెల 10న ఈ జాబితా ప్రకటిస్తారని ఆశించినా సాధ్యం కాలేదు.

టీడీపీ కోరుతున్న స్థానాల మీద తకరారు నెలకొంది. శేర్ లింగంపల్లి  స్థానాన్ని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ బలంగా కోరుతున్నారు. అలాగే ఎల్బీ నగర్ సీటును టీడీపీ కోరుతుండగా.. అదే స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి బలంగా ఉన్నారు.. పటాన్ చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ లోని ఆశావహుల మధ్యే పోటీ ఎక్కువగా ఉంటోంది. పటాన్ చెరును కాంగ్రెస్ కే కేటాయించాలని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ ఒత్తిడి తెస్తున్నారు. ఇక పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య జనగామలో బలంగా ఉన్నారు. టీజేఎస్ కు కేటాయిస్తారని.. ఇక్కడ కోదండరాం పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇక్కడ గందరగోళానికి తావిచ్చింది.

ఇక వరంగల్ వెస్ట్ నుంచి కాంగ్రెస్ తరఫున డీసీసీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి తనకే సీటు కావాలని ఆందోళనకు దిగారు. ఇక కొత్తగూడెం విషయంలోనూ సీపీఐ - కాంగ్రెస్ మధ్య వివాదం రాజుకుంటోంది. ఇప్పటికే మాజీ మంత్రి వనమా వేంకటేశ్వరావుకు టికెట్ ఖరారైందని ప్రచారం జరుగుతోంది. దీంతో అభ్యర్థుల జాబితా ప్రకటనపై తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
   

Tags:    

Similar News