పబ్లిగ్గా బీరేసీ - చిందేసీ..బీజేపీ పరువు తీశాడు

Update: 2019-09-29 16:19 GMT
ప్రజా ప్రతినిధి అంటే... అది కూడా ఎమ్మెల్యే అంటే... కొన్ని వేలు, లక్షల మంది ప్రజలకు ప్రతినిధి. అలాంటి గురుతర బాధ్యత కలిగిన పదవిలో ఉన్న ఎమ్మెల్యేలు ఎలా ఉండాలి? ప్రజలందరికీ మార్గదర్శకులుగా ఉండాలి. మరి ఈ బీజేపీ ఎమ్మెల్యే చేసిందేమిటి? తనకు ప్రజలు కట్టబెట్టిన పదవితో పాటు టికెట్ ఇచ్చిన బీజేపీ పరువు కూడా తీసి పారేశారు. సామాన్య జనం. జల్సారాయుళ్ల మాదిరి జల్సా పార్టీకి వెళ్లి... పబ్లిగ్గా వేదికపై బీరు తాగుతూ... బార్ డ్యాన్స్ ముందు మోకాళ్లపై కూర్చున్న ఈ నేత... నిజంగానే బీజేపీ పరువును గంగలో కలిపేశారనే చెప్పాలి.

ఆ బీజేపీ ఎమ్మెల్యే ఎవరు? ఆయన చేసిన ఘనకార్యమేమిటన్న వివరాల్లోకి వెళితే...  మహారాష్ట్రలోని గాంధీ జిల్లాకు చెందిన ఆమ్ గన్ డోొరీ నియోజవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ పురమ్... ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఆ కార్యక్రమ నిర్వాహకులు మందు పార్టీతో పాటు స్టేడీ డ్యాన్సర్లతో వేడుకను హీటెక్కించేలా చేశారు. ఇన్ని ఏర్పాట్లున్న ఈ వేడుకలో పురమ్ తాను ఎమ్మెల్యేను అన్న విషయాన్ని మరిచి జల్సా రాయుడిలా మారిపోయారు. వేదికపై లేడీ డ్యాన్సర్లు చిందులేస్తుంటే... అప్పటికే మద్యం మత్తు తలకెక్కిన పురమ్ కూడా వేదిక ఎక్కేశారు. లేడీ డ్యాన్సర్ తో కలిసి కొంతసేపు చిందేశారు. ఆ తర్వాత అదే లేడీ డ్యాన్సర్ ముందు మోకాళ్లపై కూర్చుని తనదైన శైలిలో ఊగిపోయారు. అంతేనా... స్టేజీపై లేడీ డ్యాన్సర్ ముందు కూర్చోవడానికి ముందు అనుచరుడు బీరు బాటిల్ ఇస్తే... ఏమాత్రం వెనక్కు తగ్గకుండా.. పబ్లిగ్గానే ఓ సిప్పేసి మరీ చిందులాడారు.

ఈ తంతు మొత్తాన్ని వేడుకకు హాజరైన వారు వీడియో తీశారు. అసలే మద్యం మత్తు, ఆపై కళ్లెదుట కిర్రెక్కించే స్టెప్పులు వేస్తున్న లేడీ డ్యాన్సర్ల మత్తులో మునిగిన పురమ్... ఇవేవీ పట్టించుకోకుండా ఒళ్లు తెలియకుండా ఊగిపోయారు. ఎమ్మెల్యే గారి వీరంగాన్ని మొత్తం రికార్డు చేసిన కొందరు సదరు వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అంతే... ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అంతటితో ఈ రచ్చ ఆగలేదు. వీడియో చూసిన స్థానికులు తాము గెలిపించిన ఎమ్మెల్యే గారు ఇలా చవకబారు వ్యవహారంలో తప్పతాగి చిందులేయడమేమిటంటూ ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి పారేశారు. మహారాష్ట్ర అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికల ముందు చోటుచేసుకున్న ఈ ఘటన బీజేపీకి ఏ మేర దెబ్బేస్తుందో చూడాలి.
 

    

Tags:    

Similar News