కేసీఆర్ అన్నిసార్లు ఫోన్లు చేయాలా?

Update: 2015-07-12 17:44 GMT
ఒక్కోసారి ఊహించ‌ని స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. ఇలాంటి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చ‌ట్టం.. నిబంధ‌న‌ల కంటే కూడా వ్య‌క్తిగ‌త ప‌రిచ‌యాలు.. మాన‌వ సంబంధాలు కీల‌క‌భూమిక పోషిస్తాయి. ఆ మ‌ధ్య విశాఖ‌ను అత‌లాకుత‌లం చేసిన హుధూద్ తుఫాన్ దారుణాన్ని గుర్తు చేసుకుంటే.. ఈ ఘోర విప‌త్తుతో ఆహార ప‌దార్ధాలు మొద‌లు.. స‌హాయ చ‌ర్య‌ల‌కు ప‌లు రాష్ట్రాల సాయం అవ‌స‌రమైంది.

వెనువెంట‌నే. రంగంలోకి దిగిన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. యుద్ధ ప్రాతిప‌దిక‌న‌.. తెలంగాణ‌.. ఒడిశా.. మ‌హారాష్ట్ర.. ప‌శ్చిమ‌బెంగాల్ త‌దిత రాష్ట్రాల నుంచి అవ‌స‌ర‌మైన సాయాన్ని అర్థించ‌టం.. వెంట‌నే వారు స్పందించ‌టం జ‌రిగిపోయాయి.

తాజాగా ప‌న్నెండేళ్ల‌కు ఒక‌సారి వ‌చ్చే పుష్క‌రాలు మ‌రో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత వ‌స్తున్న పుష్క‌రాల్ని కుంభ‌మేళ స్థాయిలో నిర్వ‌హిస్తాన‌ని చెప్పిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఊహించ‌ని స‌మ‌స్య ఒకటి మీద‌కు వ‌చ్చి ప‌డింది. ఎంతో అద్భుతంగా పుష్క‌రాలు నిర్వ‌హించాల‌ని భావించినా.. ప‌లు జిల్లాల్లోని గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంతంలో నీళ్లు లేక‌.. వెల‌వెల‌బోతున్న ప‌రిస్థితి.

ఎక్క‌డివ‌ర‌కో ఎందుకు స్వ‌యంగా ముఖ్య‌మంత్రి స్నానం చేయాల‌ని భావిస్తున్న ధ‌ర్మ‌పురిలో సైతం గోదార‌మ్మ జాడ లేని దుస్థితి. దీంతో.. ఎగువ‌న ఉన్న మ‌హారాష్ట్రకు ముఖ్య‌మంత్రి ఫోన్లు చేస్తున్నారు.

పుష్క‌రాలు ముంచుకొస్తున్న నేప‌థ్యంలో నీటి జాడ లేని ప‌రిస్థితుల్ని చూసి.. కాసిన్ని నీళ్లు వ‌ద‌లాల‌ని కోరుకుంటున్నారు. ఇలాంటి ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో వెనువెంట‌నే నిర్ణ‌యం తీసుకునే వీలుంది. మ‌రి.. ఏమైందో కానీ.. కేసీఆర్ ఫోన్‌కు మ‌హారాష్ట్ర స‌ర్కారు పెద్ద‌గా స్పందించింది లేదు. మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో పాటు.. త‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావుకు సైతం కేసీఆర్ ఫోన్లు చేస్తున్న ప‌రిస్థితి. అదేం చిత్ర‌మో.. కేసీఆర్ లాంటి బ‌ల‌మైన నేత అన్నిసార్లు ఫోన్లు చేసినా.. గోదారి నీటిని వ‌దిలే విష‌యంలో మాత్రం మ‌హారాష్ట్ర స‌ర్కారు ఇంకా నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌టం కాస్తంత విస్మ‌యానికి గురి చేస్తుంది.
Tags:    

Similar News