అబ్బే.. మటన్‌పై నిషేధం ఉండదట!

Update: 2015-04-08 07:26 GMT
మహారాష్ట్ర ప్రభుత్వం టోన్‌ మార్చింది. గోవధను అరికట్టడానికి బీఫ్‌పై నిషేధాన్ని విధించిన ప్రభుత్వం కొన్ని అనుకోని పరిస్థితుల మధ్య గొర్రె, మేక మాంసాలపై నిషేధాన్ని కూడా విధిస్తామని ప్రకటించింది. అయితే అలాంటిదేమీ లేదని తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ వివరణ ఇచ్చుకొన్నాడు!

    ఇంతకీ జరిగింది ఏమిటంటే.. బీఫ్‌ పై నిషేధం నేపథ్యంలో కొంతమంది కోర్టుకు ఎక్కారు. ఇది సరికాదని వారు వాదించారు. అయితే ప్రభుత్వం తన చర్యకు కట్టుబడింది.

    ఇలాంటి నేపథ్యంలో కోర్టు నుంచి ఆసక్తికరమైన ప్రశ్న వచ్చింది. జీవకారుణ్యంకొద్దీ.. జంతువులను కాపాడుకోవడానికి గోవధను నిషేధించడం వరకూ బాగానే ఉంది కానీ..  ఆ జాలి కేవలం ఆవుల వరకే ఎందుకు? గొర్రెలు, మేకల విషయంలో కూడా ఎందుకు లేదు? అని కోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ లాయర్‌ స్పందిస్తూ.. ఇప్పుడు గోవధపై నిషేధం విధిస్తామని.. భవిష్యత్తులో గొర్రెలు, మేకల వధను కూడా నిషేధిస్తామని చెప్పుకొచ్చాడు.

    దీంతో చాలా మంది అవాక్కయ్యారు. ఇక మటన్‌ తినడం ఎలా? అనే సందేహం తలెత్తింది. ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి స్పందించాడు. తమ ప్రభుత్వానికి అలాంటి ఆలోచన ఏమీ లేదని స్పష్టం చేశాడు.

    గొర్రె.. మేక మాంసాలపై నిషేధం విధించే ఆలోచన ఏమీ లేదని ఆయన స్పష్టం చేశాడు. ఆవుల వధపై మాత్రం నిషేధం ఉంటుందని స్పష్టం చేశాడు. మరి ముఖ్యమంత్రి ప్రకటన మాంసప్రియులకు ఊరటనిచ్చేదనే చెప్పాలి.
Tags:    

Similar News