గుడ్ న్యూస్: కరోనా రోగులకు 'ఇటోలీజుమ్యాబ్' బాగా పనిచేస్తోందట!

Update: 2020-05-04 08:30 GMT
భారతదేశంలో కరోనా మహమ్మారి..రోజురోజుకి తన ప్రభావాన్ని విస్తరించుకుంటూపోతుంది. కరోనా భాదితుల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప .. తగ్గడంలేదు. ఈ సమయంలో కరోనా వైరస్ తో బాధపడుతున్న రోగుల్లో 'ఇటోలీజుమ్యాబ్' ఔషధం బాగా పనిచేస్తోందని ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న నాయిర్ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్ పై ఉన్న ఇద్దరు రోగులకు దీన్ని అందించగా, వారి ఆరోగ్యం సాధారణ స్థితికి చేరిందని స్పష్టం చేశారు.

కాగా, 'ఇటోలీజుమ్యాబ్' ను ఇండియాలో బయోకాన్ సంస్థ తయారు చేస్తోంది. సోరియాసిస్, ఆర్థ్ రైటిస్ వంటి వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఈ ఔషధాన్ని వాడుతుంటారు. ఒక డోస్ ఇంజక్షన్ ఖరీదు రూ. 60 వేలు. కరోనాపై తమ ఔషధం సత్ఫలితాలను ఇస్తోందని తెలుసుకున్న బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా, ఆసుపత్రుల్లో ప్రయోగాత్మకంగా వాడేందుకు 'ఇటోలీజుమ్యాబ్'ను ఉచితంగా అందిస్తామని  తెలిపారు.

మరోవైపు , నాయిర్ ఆసుపత్రిలో ఈ డ్రగ్ పనిచేసిందని వైద్యులు వెల్లడించిన తరువాత, కింగ్ ఎడ్వర్డ్ స్మారక ఆసుపత్రిలో 35 ఏళ్ల కరోనా పాజిటివ్ రోగికి ఔషధాన్ని ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. అలాగే వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 125 మంది పేద రోగులకు కూడా ఇటోలీజుమ్యాబ్ ఇవ్వాలని భావిస్తున్న బీఎంసీ అధికారులు, ఆ మేరకు ప్రణాళికను రూపొందిస్తున్నారు. ముందు రోగుల కాలేయం, కిడ్నీల పనితీరును పరీక్షించిన తర్వాతే ఈ మందు ఇస్తారు. కొందరు రోగులకు ఒకడోసు సరిపోతుండగా, ఇంకొందరికి మూడు డోసుల దాకా ఇవ్వాల్సి వస్తోందని తెలిపింది.  ఈ లెక్కన ఒక డోసుకు రూ.60వేల చొప్పున 3 డోసులకు రూ.1.80 లక్షల దాకా ఖర్చవుతుంది.
Tags:    

Similar News