సపోర్ట్ లేదంటూనే ముగ్గులోకి సోనియా

Update: 2022-10-12 08:47 GMT
కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలు అంటేనే ఒక ప్రహసనం. ఆ మాటకు వస్తే దేశంలో ఇపుడు ఉన్న ప్రతీ పార్టీలో ఎన్నికల దాకా కధ రావడం లేదు. ఆయా పార్టీలలో నాయకస్వామ్యమే తప్ప ప్రజస్వామ్యం మచ్చుకైనా లేదు అన్న విమర్శలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ మేము అలా కాదు అంటూ ప్రమాస్వామ్యం మాస్క్ వేసుకుంటూ సంస్థాగత ఎన్నికలకు తెర తీసింది. అయినా కూడా కాంగ్రెస్ లో గాంధేలను ఎదిరించి నిలిచే మొనగాడు ఎవరున్నారు అన్నదే ప్రశ్న.

ఇక అధ్యక్ష పదవికి ముగ్గురు పోటీకి దిగితే అందులో ఒకాయన స్క్రూటినీలోనే పోయారు. ఇక మిగిలింది కురు వృద్ధుడు మల్లిఖార్జున ఖర్గె కేంద్ర మాజీ మంత్రి శశిధరూర్. ఈ ఇద్దరూ కూడా తామే గెలుస్తామని నమ్మకంగా చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ లో ఖర్గె పట్ల గాంధీల ప్రేమ చూసినా ఆయన రాష్ట్రాలకు వచ్చినపుడు కాంగ్రెస్ నాయకులు పలికిన స్వాగతం చూసినా ఆయన గాంధీల మనిషి గెలిచే మనిషి అని ఇట్టే చెప్పవచ్చు.

ఇక శశిధరూర్ పోటీ ఎందుకు అంటే ఆయనకే తెలియాలి. ఆయన మాత్రం కాంగ్రెస్ లో ఈసారి పోటీ మామూలుగా ఉండదని భారీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. 1997, 2000లో జరిగిన ఎన్నికల కంటే కూడా ధీటుగా ఈసారి ఎన్నికలు ఉంటాయని, సైలెంట్ ఓటింగ్ జరిగి ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. కానీ ధరూర్ మాటలను కాంగ్రెస్ లోనే ఎవరూ నమండంలేదు. యధాప్రకారం గాంధీలు ప్రతిష్టించిన ఖర్గె సీట్లో కూర్చుంటారు అని ఇప్పటికే అంతా డిసైడ్ అయ్యారు.

ఈ నేపధ్యంలో ఖర్గె తనకు సోనియా గాంధీ సపోర్ట్ ఉంది అని అన్నట్లుగా వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం అయ్యాయి. మరి అవి ఎలా పుట్టుకువచ్చాయో ఏమో కానీ ఖర్గె ఎటూ గాంధీల మనిషి అని అనుకుంటున్న వారు ఎవరూ దాని మీద షాక్ తినలేదు. కానీ ఎన్నికలు చక్కగా జరిపిస్తున్నామని చెప్పుకోవడానికి ఆపసోపాలు పడుతున్న కాంగ్రెస్ పెద్దలు ఈ ప్రచారం పట్ల అలెర్ట్ అయ్యారో ఏమో కానీ అదే ఖర్గె ఏమీ లేదు తూచ్ అనేశారు. పైగా తనకు సోనియా గాంధీ మద్దతు ఉందని ఎక్కడైనా చెప్పానా. అలాంటిది ఏమీ లేదు అంటూ లేటెస్త్ గా ఖండించారు.

తన పేరుని కాంగ్రెస్లో సోనియా సహా ఎవరూ సూచించలేదని కూడా ఆయన చెప్పుకున్నారు. గాంధీ ఫ్యామిలీ నుంచి ఎవరూ ఎన్నికల్లో పాల్గొనటం లేదు, మద్దతు కూడా ఏ అభ్యర్ధికి ఇవ్వడం లేదు అని ఖర్గె క్లారిటీ ఇచ్చేశారు.కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిని 9,300 మంది సభ్యులు ఎన్నుకుంటారు వారే  లీడర్ అవుతారు అని ఖర్గె అంటున్నారు.

దేశంలో మోడీ పాలనలో సీబీఐ  ఈడీ వంటి  శక్తులను ప్రయోగిస్తున్నారని, ప్రజాస్వామ్యం కుంటుబడుతోందని, వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను అని చెప్పుకున్నారు. తనకు కాంగ్రెస్ వాదుల నుంచే మద్దతు ఉంది తప్ప గాంధీల నుంచి కాదు అని ఖర్గె అంటున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా ఖర్గె గాంధీల మనిషి అని తెలిసే ఆయనకు మద్దతు ఇస్తున్నారు.

ఇది ఓపెన్ సీక్రెట్ మరి సోనియా మద్దతు అని వార్త ఎవరు పుట్టించారో కానీ ఆమెను మళ్లీ బయటకు లాగి ఖర్గెకి మరింతగా విజయావకాశాలు పెంచడానికే ఇలా చేశారా అన్న చర్చ సాగుతోంది. మొత్తానికి సపోర్ట్ లేదు అని ఖర్గె అంటున్నా అంతా మాత్రం ఆయనకు గాంధీల ఫుల్ సపోర్ట్ ఉంది అంటున్నారు.  రేపు 17న ఎన్నికలు అయి ప్రెసిడెంట్ అయ్యాక ఖర్గె నోట ఇదే ఫస్ట్ మాటగా వస్తుందని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News