మోదీ ప్రమాణానికి దీదీ... మరి బాబు పరిస్థితేంటో?

Update: 2019-05-28 18:51 GMT
నరేంద్ర మోదీ ఓ వైపు, మమతా బెనర్జీ మరో వైపు... సార్వత్రిక ఎన్నికల్లో హోరాహోరీగా తలపడిన నేతలుగా వీళ్లను చూశాం. దీదీ పాలనలోని పశ్చిమ బెంగాల్ లో ఎలాగైనా అధిక సీట్లు సాధించి తీరాల్సిందేనని మోదీ సాగితే... ఎక్కడైనా ఓకే గానీ.. నా వద్ద మాత్రం పప్పులు ఉడకవంటూ దీదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగినా... బెంగాల్ ఎన్నికలపైనే జనం దృష్టి సారించేంతగా పరిస్థితి మారిపోయింది. వెరసి ఇకపై వీరిద్దరి మధ్య సుహృద్భావ వాతావరణం కనిపించదేమో అని అంతా అనుకున్నారు.

అయితే ఎన్నికలు ముగియడం, మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ బంపర్ మెజారిటీతో విక్టరీ కొట్టడం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ నెల 30న రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేసేందుకు మోదీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తన ప్రమాణస్వీకారోత్సవానికి రావాలంటూ ఆయన పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. అందరికీ షాకిస్తూ మోదీ నుంచి దీదీకి ఆహ్వానం అందింది. ఆ ఆహ్వానానికి దీదీ కూడా సానుకూలంగానే స్పందించడంతో పాటుగా ప్రధాని ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు అవుతున్నట్లు కూడా ఆమె ప్రకటించారు.

ఎన్నికల్లో నువ్వా, నేనా అన్న రీతిలో పోట్లాడుకున్న దీదీనే మోదీ ఆహ్వానిస్తే... మరి నాలుగేళ్ల పాటు కలిసి ఉండి, గడచిన ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని మోదీ పిలవకుండా ఉంటారా? అన్న విశ్లేషణ ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే జగన్ నుంచి ప్రమాణ స్వీకారానికి రావాలని అందిన ఆహ్వానంపై చంద్రబాబు ఇప్పటిదాకా నోరిప్పలేదు. మరి మోదీ నుంచి ఒకవేళ ఆహ్వానం వస్తే... ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News