మోడీ ఓ కాపీ క్యాట్..ఫైర్‌ బ్రాండ్ స‌హా వీళ్లంద‌రి మాట‌

Update: 2019-02-01 12:31 GMT
ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ కీల‌క బ‌డ్జెట్‌ ను ప్రవేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతులకు ప్రత్యేక ఆర్థికసాయం చేయనున్నట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. 2 హెక్టార్లలోపు(ఐదు ఎకరాలు) ఉన్న ప్రతి రైతుకు మూడు విడుతల్లో ఏటా రూ. 6 వేలు ఆర్థిక సాయం చేయనున్నట్లు గోయల్ ప్రకటించారు. తొలి విడుతలో భాగంగా జమ చేసే రూ. 2 వేల నగదును ఈ ఏడాదిలోనే బ్యాంక్ ఖాతాలో వేయ‌నున్నారు. డిసెంబ‌ర్ 2018 నుంచి మార్చి 31 వ‌ర‌కు తొలివిడుత‌గా గుర్తించ‌నున్నారు. పేదలైన 12 కోట్ల మంది రైతులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా మూడు విడుతల్లో నేరుగా నగదును జమ చేయనున్నారు. డిసెంబర్ 1, 2018 నుంచి ఈ పథకం అమలు కానుంది. అయితే 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ. 75 వేల కోట్లు, 2018-19 సంవత్సరానికి రూ. 20 వేల కోట్లు కేటాయించారు.

అయితే, ఈ ప‌థ‌కంపై అప్పుడే విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. మోడీ ఓ కాపీ క్యాట్ అంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తమ ప్రభుత్వ పథకాలనే కాపీ కొట్టిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. తాము ఇప్పటికే అమలు చేస్తున్న వాటిని కేంద్రం ఇవాళ కొత్తగా ప్రకటించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చిట్‌ ఫండ్‌ కంపెనీ మాదిరిగా మారిందని ధ్వజమెత్తారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. రాష్ర్టాలను సంప్రదించకుండానే ఎలా నిర్ణయం తీసుకుంటారు అని ప్రశ్నించారు. రాష్ర్టాలు చేసిన మంచిని కూడా కేంద్రం తమ గొప్పలుగా చెప్పుకుంటుందని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వానికి ప్రచార యావ తప్ప.. ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదని నిప్పులు చెరిగారు. ప్రజలను మోసం చేయడానికి బడ్జెట్‌ను బీజేపీ మేనిఫెస్టోలా తయారు చేశారని మమతా బెనర్జీ ఆగ్రహం వెలిబుచ్చారు.

టీఆర్ ఎస్ ఎంపీ క‌విత మాట్లాడుతూ....తెలంగాణ సీఎం కేసీఆర్ చేప‌ట్టిన రైతు బంధు ప‌థ‌కాన్ని కేంద్ర ప్ర‌భుత్వం..కాపీ కొట్టింద‌ని  అన్నారు. కేంద్ర బ‌డ్జెట్‌ పై ఇవాళ ఆమె త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. కేసీఆర్ రైతు బంధు స్కీమ్‌ నే కేంద్రం కాపీ కొట్టింద‌ని, కానీ అది స‌రిగాలేద‌న్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తి రైతుల‌కు పెట్టుబ‌డి సాయంగా ప్ర‌తి ఎక‌రాకు రెండు ద‌ఫాలా 5 వేలు ఇస్తోంద‌ని, కానీ కేంద్ర ప్ర‌భుత్వం త‌మ ప‌థ‌కంలో 2 హెక్టార్లలోపు(ఐదు ఎకరాలు) ఉన్న ప్రతి రైతుకు ఏడాదికి రూ. 6 వేలు ఆర్థిక సాయం ప్ర‌క‌టించిన‌ట్లు ఆమె చెప్పారు. మోదీ రైతు బంధును మ‌రింత రిఫైన్ చేయాల్సిన‌ అవ‌స‌రం ఉంద‌న్నారు. అయినా ఆ ప‌థ‌కాన్ని స్వాగ‌తిస్తున్న‌ట్లు ఆమె తెలిపారు. 33 శాతం మ‌హిళ‌ల రిజ‌ర్వేష‌న్ అంశాన్ని త‌మ బ‌డ్జెట్‌ లో వెల్ల‌డించ‌లేద‌ని క‌విత అన్నారు. క‌చ్చితంగా ఇది ఎల‌క్ష‌ణ్ బ‌డ్జెట్ అని అన్నారు. వేత‌న జీవుల‌కు ప‌న్నుమిన‌హాయింపులు క‌ల్పించార‌న్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ చేప‌ట్టిన రైతు బంధు ప‌థ‌కాన్నే .. కేంద్ర ప్ర‌భుత్వం అనుక‌రించింద‌ని టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ మాన‌న‌పుత్రిక రైతుబంధు ప‌థ‌కం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేయ‌నున్నార‌ని, ఈ ప‌థ‌కంతో రైతులు ల‌బ్ధి పొంద‌డం సంతోషంగా ఉంద‌ని అన్నారు. కిసాన్ స‌మ్మాన్ నిధి పేరుతో కేంద్ర ప్ర‌భుత్వం రైతుబంధు ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌నున్న‌ది. 5 ఎక‌రాల లోపు భూమి ఉన్న రైతుకు ఏడాది 6 వేలు చొప్పున సాయం అందించ‌నున్నారు. ఆ సొమ్మును నేరుగా రైతు ఖాతాలోకి వెళ్తాయి. అయితే కిసాన్ స‌మ్మాన్ నిధి.. ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షించిన రైత‌బంధు ప‌థ‌కాన్ని పోలి ఉంద‌ని కేటీఆర్ అన్నారు. గ‌త ఏడాది ఖ‌రీఫ్ సీజ‌న్‌లో టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం తెలంగాణ‌లో ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేసిన‌ట్లు కేటీఆర్ చెప్పారు. ఎన్డీఏ ప్ర‌భుత్వం కేవ‌లం ఆ ప‌థ‌కం పేరును మాత్ర‌మే మార్చింద‌ని, కానీ దాని స్పూర్తి అదే అన్నారు. జై కిసాన్ అంటూ ఎమోజీ ట్వీట్ చేశారు.


Tags:    

Similar News