ఎంఆర్ ఐ మెషీన్ లో ప‌డి వ్య‌క్తి మృతి..ముగ్గురి అరెస్టు!

Update: 2018-02-02 11:13 GMT
ముంబైలోని ఓ ఆసుప‌త్రి సిబ్బంది నిర్ల‌క్ష్యానికి ఓ నిండు ప్రాణం బ‌లైంది. కేవ‌లం త‌న బంధువైన మ‌హిళ‌కు తోడుగా ఆసుప‌త్రికి వ‌చ్చినందుకు ఓ అమాయ‌కుడిని ఆ ఆసుప‌త్రి సిబ్బంది...పొట్ట‌న‌బెట్టుకున్నారు. బ‌ద్ద‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఆ సిబ్బంది  తాము చేయ‌వ‌ల‌సిన ప‌నుల‌ను ఆ వ్య‌క్తికి అప్ప‌గించ‌డంతో అత‌డు మ‌ర‌ణించాడు. దాంతో, ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన వారిని పోలీసులు అరెస్టు చేశారు.

త‌న త‌ల్లికి ఎంఆర్ ఐ స్కానింగ్ తీయించేందుకు ఆమె కుమారుడు సోలంకి త‌న‌ మిత్రుడు రాజేష్ మారు(32)తో క‌లిసి ముంబైలోని బీవైఎల్ నాయ‌ర్ చారిట‌బుల్ హాస్ప‌ట‌ల్ కు వ‌చ్చాడు. ఓ ఆక్సిజ‌న్ సిలెండ‌ర్ ను ఎంఆర్ ఐ స్కానింగ్ రూమ్ లోకి తీసుకెళ్లాల్సిందిగా రాజేష్ మారును వార్డ్ బాయ్ విఠ‌ల్ చ‌వాన్ కోరాడు. అయితే, లోహంతో చేసిన వ‌స్తువుల‌ను ఎంఆర్ ఐ స్కానింగ్ గ‌దిలోకి అనుమంతిచ‌రు క‌దా అని విఠ‌ల్ ను రాజేష్ ప్ర‌శ్నించాడు. ఇవ‌న్నీ ఇక్క‌డ స‌హ‌జ‌మ‌ని - ఏం కాద‌ని - తాము రోజూ ఇలాగే చేస్తామ‌ని విఠ‌ల్ భ‌రోసా ఇచ్చాడు. అంతేకాదు, ఎంఆర్ ఐ మెషీన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంద‌ని,  సిలెండ‌ర్ ను నిర్భ‌యంగా తీసుకెళ్ల‌వ‌చ్చ‌ని చెప్పాడు. ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న డాక్ట‌ర్ - టెక్నీషియ‌న్ లు కూడా ఏమీ అన‌క‌పోవ‌డంతో రాజేష్ ....ఆ సిలెండ‌ర్ ను ఎంఆర్ ఐ స్కానింగ్ గ‌దిలోకి తీసుకెళ్లాడని సోలంకీ చెప్పాడు.  

ఆ గ‌దిలోకి రాజేష్ సిలెండ‌ర్ తో వెళ్లేస‌రికి ఎంఆర్ ఐ మెషీన్ ఆన్ లో ఉంది. దీంతో, సిలెండ‌ర్ లోని లోహాన్ని ఎంఆర్ ఐ మెషీన్ లోని బ‌ల‌మైన అయ‌స్కాంత త‌రంగాలు విప‌రీతంగా ఆక‌ర్షించాయి. దీంతో, ఒక్క క్ష‌ణంలోనే సిలెండ‌ర్ తోపాటు రాజేష్ ను ఎంఆర్ ఐ  మెషీన్ బ‌లంగా త‌న‌వైపున‌కు లాగేసింది. ఈ క్ర‌మంలో సిలెండ‌ర్ కు తాకిడి త‌గ‌ల‌డంతో సిలెండ‌ర్ లోని ఆక్సిజ‌న్ లీక‌యింది. ఈ ఘ‌ట‌న‌తో షాక్ తిన్న వార్డ్ బాయ్ - మిగ‌తా సిబ్బంది...రాజేష్ ను బ‌య‌ట‌కు లాగే ప్ర‌య‌త్నం చేశారు. అయితే, అప్ప‌టికే అత‌డి శ‌రీరం వాచిపోయి....తీవ్ర‌స్థాయిలో రక్త స్రావం అవుతోంది. వారంతా క‌లిసి.....రాజేష్ ను అదే ఆసుప‌త్రిలోని ఎమ‌ర్జెన్సీ యూనిట్ కు హుటాహుటిన త‌ర‌లించారు. అప్ప‌టికే ప‌రిస్థితి చేయి దాట‌డంతో అక్క‌డ‌కు చేరిన ప‌ది నిమిషాల‌కే రాజేష్ మ‌ర‌ణించాడు.

కేవ‌లం ఆసుప‌త్రి సిబ్బంది నిర్ల‌క్షం వ‌ల్లే రాజేష్ మ‌ర‌ణించాడని సోలంకీ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన వారి పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరాడు. దీంతో - డాక్ట‌ర్ సిద్ధార్థ్ షా - వార్డ్ బాయ్ విఠ‌ల్ - వార్డ్ అటెండెంట్ సునీత ల‌పై కేసు న‌మోదైంది. డాక్ట‌ర్ సిద్ధార్థ్ షా - వార్డ్ బాయ్ విఠ‌ల్ ల‌ను పోలీసులు ఐపీసీ సెక్ష‌న్ 304 కింద కేసు న‌మోదు చేసి అరెస్టు చేశారు. అయితే,ఎంఆర్ ఐ స్కానింగ్ సెంట‌ర్ల‌పై నియంత్ర‌ణ మండ‌లి లేక‌పోవ‌డం వ‌ల్లే ఇటువంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఎంఆర్ ఐ స్కాన‌ర్ల‌కు ఒక ప్ర‌త్యేక‌మైన నియంత్ర‌ణ అవ‌స‌రం లేద‌ని, స‌రైన శిక్ష‌ణ తీసుకోకుండా విధులు నిర్వ‌ర్తిస్తున్న వారి నిర్ల‌క్ష్యం వ‌ల్లే ఇటువంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని డాక్ట‌ర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Tags:    

Similar News