కేసీఆర్..క‌విత‌ల‌పై అస‌భ్య రాత‌లు..బుక్ అయ్యాడు

Update: 2019-05-01 05:07 GMT
సోష‌ల్ మీడియాలో అకౌంట్ ఉంటే చాలు.. ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా రాసేస్తే స‌రిపోతుందా?  దానికి త‌గిన మూల్యం చెల్లించాల్సిన అవ‌స‌రం ఉంది. ప్ర‌ముఖుల మీద మ‌న‌సుకు తోచిన‌ట్లుగా రాసేసే వారి విష‌యంలో తెలంగాణ పోలీసులు వెంట‌నే స్పందిస్తున్నారు. తాజాగా అలాంటి ఉదంత‌మే మ‌రొక‌టి చోటు చేసుకుంది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఆయ‌న కుమార్తె క‌మ్ నిజామాబాద్ ఎంపీగా వ్య‌వ‌హ‌రిస్తున్న క‌విత‌ల‌పై ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా రాత‌లు రాస్తున్న వ్య‌క్తిని తాజాగా సైబ‌ర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్య‌మంత్రి ప్ర‌తిష్ఠ‌కు భంగం వాటిల్లేలా.. అస‌భ్య రాత‌లు రాసిన ఒక‌రిపై టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్య‌క్షుడు గెల్లు శ్రీ‌నివాస‌యాద‌వ్ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

రెండు ఫేస్ బుక్ ఖాతాల్లో సీఎం కేసీఆర్ పైనా.. ఆయ‌న కుమార్తె క‌విత‌లపై అస‌భ్య రాత‌లు ఉండ‌టాన్ని గుర్తించిన గెల్లు శ్రీ‌నివాస‌యాద‌వ్ పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. దీనిపై దృష్టి సారించిన పోలీసులు.. ఫేస్ బుక్ నిర్వాహ‌కుల్ని సంప్ర‌దించుకొని ఐపీ చిరునామాలు తీసుకున్నారు. వీటి ఆధారంగా స‌ద‌రు వ్య‌క్తి ఎవ‌ర‌న్న విష‌యంపై ఆరా తీశారు.

త‌మ విచార‌ణ‌లో స‌ద‌రు వ్య‌క్తి..  మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా న‌వాజ్ పేట‌లో ఉంటున్న ప్రైవేటు ఉద్యోగి న‌రేష్ గా గుర్తించారు. తాజాగా అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. అంద‌రికి వాక్ స్వాతంత్య్రం.. భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ ఉంటుంది. అలా అని.. అదే ప‌నిగా న‌చ్చ‌నోళ్ల మీద విషం క‌క్క‌టం.. అర్థం లేని ఆరోప‌ణ‌లు చేయ‌టం.. త‌ప్పుడు విమ‌ర్శ‌లు చేయ‌టం చ‌ట్ట‌ప్ర‌కారం నేర‌మ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. 
Tags:    

Similar News