కారు నెంబర్ ప్లేట్ మీద ఏపీ సీఎం జగన్..తర్వాతేమైంది?

Update: 2019-10-23 07:35 GMT
అతి తెలివిని ప్రదర్శించిన వ్యక్తి ఒకరు అడ్డంగా దొరికిపోయారు. చలానాలు తప్పించుకోవటానికి అతగాడి ఎత్తు చిత్తు కావటమే కాదు.. పలు సెక్షన్ల కింద కేసులు మీద పడి.. కోర్టు ముందుకు వెళ్లాల్సి రావటమే కాదు.. రిమాండ్ కు పంపిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరును దుర్వినియోగపరుస్తూ అతి తెలివితో వేసిన ఎత్తు రివర్స్ కొట్టింది. హైదరాబాద్ లోని షాపూర్ నగర్ పైపు లైన్ రోడ్డు మీద ఒక కారును సైబరాబాద్ పోలీసులు అపారు. కారు నెంబరు ప్లేట్ మీద ఏపీ సీఎం జగన్ అని పేర్కొంటూ.. ముందు వెనుకా అదే పేరును రాయించారు.

పిఠాపురానికి చెందిన ముప్పిడి హరి రాకేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను కూకట్ పల్లిలో నివసిస్తున్నట్లు గుర్తించారు. పోలీసు చలానాలు తప్పించుకోవటానికే నెంబరు ప్లేట్ మీద ఇలా రాయించినట్లుగా గుర్తించారు. రిజిస్ట్రేషన్ శాఖ ప్రకారం ఈ కారు ఏపీ10 బీడీ7299 రిజిస్టర్ అయి ఉంది.

ఆ కారు హరి రాకేశ్ అంకుల్ దని చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నెంబరు ప్లేట్ ఉండటం.. మోసం చేయటం లాంటి కారణాలతో అతని మీద 420 - 210 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే.. ఏపీ సీఎం జగన్ అని పేరు రాసుకుంటే చలానాలు వేయరనుకున్న ఇతగాడు.. దాని కంటే ముందు అలా రాసుకోవటమే పెద్ద నేరమవుతుందన్న చిన్న లాజిక్ మిస్ అయి.. కొత్త సమస్యల్ని నెత్తిన పడేసుకున్నారన్న మాట వినిపిస్తోంది.


Tags:    

Similar News